నమో X మోన

నమో X మోనపెద్దాయన నిద్రలో నుంచి దిగ్గున లేచాడు. అర్థరాత్రి దాటిపోయి చాలాసేపయ్యింది. దాదాపు తెల్లవారు ఝాము అవుతోంది. పెద్దాయన నిద్రాభంగం కావటానికి ఏదో శబ్ధం కావటమే కారణం! మళ్లీ పెద్దాయన నిద్రకు ఉపక్రమించాడు! కాని లాభం లేదు! ఈ సారి ఎవరో పగలబడి నవ్వుతున్నట్లై నిద్రభంగం అయ్యింది! పెద్దాయనకు పట్టరాని ఆగ్రహం కలిగింది ”ఇదేమిటి? నేను నిద్రించేదే నాలుగు గంటలు! అందులో కూడా నిద్రాభంగమా?”
”ఎవరది?” అన్నాడు పెద్దయన కోపంగా.
ఎవరూ మాట్లాడలేదు. కాని మరోసారి పగలబడి నవ్వారు!
”ఎవరు అంటే పలకరేం? పైగా నవ్వుతారేం?” అన్నాడు పెద్దాయన మరింత కోపంగా.
”నేను ఎవరో కాసేపటికి నీకే అర్థమైతుంది కాని, ఇంత పెద్ద హోదాలో ఉండి ఇన్ని అబద్ధాలు. క్రమం తప్పకుండా పలుకవచ్చునా?” అన్నది ఆ స్వరం.
పెద్దాయనకు ఆస్వరం పరిచయమున్నట్లే అనిపించింది. పోల్చుకునే ప్రయత్నం చేశాడు.
”అబద్దాలా నేనా?” అన్నాడు.
”నీవే అబద్ధాలు అడుతున్నావు! అది కూడా అంతులేని అబద్ధాలు అడుతూనే ఉన్నావు!” అన్నది ఆ స్వరం.
”అబద్ధాలు అంటే ఏమిటో నాకు తెలియదు! నిజాలు మాత్రమే మాట్లాడుతాను! సరిగ్గా చెప్పాలంటే నేను మాట్లాడింది మాత్రమే నిజం!” అన్నాడు పెద్దాయన.
మరోసారి పెద్దగా నవ్వింది ఆ స్వరం.
”ఎందుకు మళ్లీ మళ్లీ నవుతావు?” అన్నాడు పెద్దాయన మరింత కోపంగా.
”నవ్వకేం చేయను? శిశుపాలుడి తప్పులు లెక్కించినట్లు, నీ అబద్దాలు కూడా లెక్కిస్తే ఈపాటికి లక్ష దాటిపోయేవి!” అన్నది ఆ స్వరం.
”నేను ఒక్క అబద్ధం ఆడినా నన్ను ఉరి తీయెచ్చు!” అన్నాడు పెద్దాయన గంభీరంగా.
”అదే నిజమైతే ఉరి మీద ఇప్పటికే రెండుసార్లు అబద్దమాడావు కదా!” అన్నది ఆ స్వరం.
”ఉరి తీయమని రెండుసార్లు అబద్దమాడానా చెప్పు!” అన్నాడు పెద్దాయన.
”పెద్దనోట్లు రద్దు చేసినపుడు, నల్లధనం వందరోజుల్లో బయటకు వస్తుందని, అట్లా బయటకు రాకపోతే ఉరితీయమని అన్నావు. కాని ఈ రోజు వరకు ఒక్క రూపాయి నల్లధనం బయటకు రాలేదు. పైగా ఆదానీ, అంబానీల వద్ద నల్లధనం ఉందని అన్నావు! పుల్వామాలో 39 మంది సైనికుల దుర్మరణానికి నీవు హెలికాప్టర్‌ ఇవ్వక పోవడమే కారణమని నీ మాజీ విశ్వాస పాత్రుడే ప్రకటించాడు! పెద్దనోట్ల రద్దులో ఒకసారి, పుల్వామా సైనికుల మరణంలో రెండవ సారి తప్పులు చేసినా నిన్ను ఎవరూ ఉరి తీయలేదు కదా!” అన్నది ఆ స్వరం.
పెద్దాయన మౌనంగా వింటున్నాడు.
”ప్రతిపక్ష పార్టీలకు ఓట్లేస్తే బుల్డోజర్లతో గుళ్లు కూల్చేస్తారు! అని అన్నావు కదా! గుళ్లు, గోపురాలు కూల్చటం, అందుకు బుల్డోజర్లు వాడే సంప్రదాయం మీ పార్టీ దే! అపుడెపుడో కరసేన పేరిట రాములవారి గుడో లేక బాబ్రీ మసీదో, ఎవరో ఒకరి ప్రార్థనా మంది రాన్ని కూలగొట్టిన చరిత్ర మీదే! అప్పట్లో బుల్డోజర్లు లేవు అందుకే కరసేవ చేశారు. మారిన టెక్నాలజీని అందిపుచ్చుకున్న మీ పార్టీ వారణాసిలో వందల సంఖ్యలో, చిన్న గుళ్లు, అదే సంఖ్యలో ఇండ్లూ కూల్చే శారు! ఆ రోజు నీవేమీ మాట్లాడలేదు! ఇప్పుడు మాత్రం ప్రతిపక్షం మీదికి నెడుతున్నావు!” అన్నది
ఆ స్వరం.
పెద్దాయన పక్కనున్న గ్లాసులో నీళ్లు తాగాడు.
”ముస్లిం పెట్టిన భోజనం తిన్నాను! వారిని నేనెప్పుడు విమర్శించలేదు! విభజన రాజకీయాలతో ప్రతిపక్షాలు కుట్ర చేస్తాయని అన్నావు కదూ! చొరబాటుదారులు, అధిక సంతానం గలవాళ్లూ, అన్నది కూడా నీవే కదా! మరి ఏది నిజం! అకస్మాత్తుగా ముస్లింలు పెట్టిన బిర్యాని గుర్తుకు వచ్చిందేం? నీవు చెప్పినట్లే హిందూ, ముస్లింలు కలిసి పీర్ల పండుగ జరుపుకునే పరిస్థితి ఇప్పుడుందా? ఆ సోదర భావాన్ని ధ్వంసం చేసిందీ, విద్వేషాన్ని రెచ్చగొట్టిందీ నీవు, నీ పార్టే కదా! ఇప్పుడు ఇంతపెద్ద అబద్దాన్ని సిగ్గు, ఎగ్గూ లేకుండా మాట్లాడవచ్చునా?” నిలదీసింది ఆ స్వరం.
”అన్నిటికన్నా పెద్ద అబద్దం ఏం చెప్పావో తెలుసా?” అడిగింది ఆ స్వరం.
ఏమిటన్నట్లు చూశాడు పెద్దాయన.
”నీవు అందరిలా పుట్టలేదని, ఆ దేవుడే నిన్ను పంపిం చాడని, అన్ని విషయాల్లో నీకు ఆ దేవుడే ప్రేరణ కల్గిస్తున్నాడని. ఒక ఇంటర్వూలో ప్రవచించావు!” అడిగింది ఆ స్వరం.
అవునన్నట్లు తలూపాడు. అపుడు పెద్దాయన మొఖం వెలిగిపోతున్నది.
”నీవు అందరి మనుషుల్లా జీవ ప్రక్రియ ద్వారా జన్మించలేదని మీ అమ్మగారు బతికి ఉన్నపుడు ప్రవచించలేదేమి! నీవు చెప్పింది ఎంత ఆ మాతృమూర్తి నిర్ధారించేది! అయితే ఒకందుకు ఇప్పుడు చెప్పడం వల్ల మీ తల్లిగారు బతికి పోయారు! నీ, నిర్ధయాలన్నింటికీ దైవమే ప్రేరణ కల్గిస్తున్నదా? కరోనా వచ్చినపుడు రాత్రికి రాత్రే లాక్‌డౌన్‌ ప్రకటించి వలస కార్మికుల ఉసుర్లు తీసినదానికి దైవమా ప్రేరణ? రాత్రికి, రాత్రి నోట్లరద్దు ప్రకటించి ఏటీఎం లైన్లలో అమాయక మధ్య తరగతి ప్రాణాలు పోతుంటే పట్టించుకోని నీ రాతి గుండెకు ప్రేరణ కలిగించలేదని దేవుని మీదికి నెడుతున్నావా? దేశంలోని సహజవనరులను, ప్రభుత్వ రంగ సంస్థలను ఆదానీ, అంబానీలకు ధారపోయమని నీకు దేవుడే చెప్పాడా? అడిగింది ఆ స్వరం.
పెద్దాయనకు ఏం మాట్లాడాలో తెలియటం లేదు!
”ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలిస్తామని అధికారంలోకి వచ్చిన నీకు ఉన్న ఉద్యోగాలు ఊడగొట్టమని దేవుడు చెప్పాడా? నీ గుళ్లోనే అభం శుభం తెలియని చిన్నారిపై అత్యాచారం చేస్తుంటే అడ్డుకోమని, నీకు దేవుడు ఎందుకు చెప్పలేదు? అబద్ధాలు ఆడేది నీవు! తప్పులు చేసేది నీవు! దేవుడి పేరు మీద విధ్వంసం సృష్టించేది నీవు! దేవుడి పేరు మీద ఓట్లడిగి, అధికారంలోకి వచ్చేది కూడా నీవే! వీటన్నింటికి ఆ దేవుడిని వాడుకుంటున్నావు? ఇంతకన్నా దైవద్రోహం ఉందా!” నిలదీసింది ఆ స్వరం.
పెద్దాయనకు గుర్తుకు వచ్చింది ఆ స్వరం తనదే! ఏదో చెప్పబోయాడు!
నీవు నోరు తెరవకు! తెరిస్తే మరో అబద్ధం ఆడతావు! నేను మోన! అంటే నీ అంతరాత్మను!” అన్నది ఆ స్వరం.
– ఉషాకిరణ్‌