నందనవనం పల్లె ప్రకృతి వనం

– చుట్టూ నీడనిచ్చే చెట్లు
– రకరకాల పూల పండ్ల మొక్కలు
– మండలానికే ఆదర్శంగా వెల్మగూడెం ప్రకతి వనం
నవతెలంగాణ-పెద్దవూర
పల్లె ప్రకృతి వనాలు పచ్చని హారాలయ్యాయి. అవెన్యూ ప్లాంటేషన్స్‌ మొక్కలు స్వాగత తోరణాలయ్యాయి.. హరితహారంలో నాటిన మొక్కలు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. ఇలా పల్లెలు అన్ని సుందర వనాలయ్యాయి. మండలంలోని వెల్మగూడెం గ్రామంలో చెరువు ప్రక్కన ఆహ్లదకరమైన వాతావరణంలో ఏడేళ్లలో ఉపాధిహామీ పనులలో నాటిన మొక్కలు గ్రామస్తులకు నీడనిస్తున్నాయి. వాతావరణంలో కాలుష్యాన్ని తగ్గిస్తూ పర్యావరణ సమతుల్యాన్ని పెంచుతూ గ్రామస్తులను ఆకట్టుకున్నాయి. పల్లె ప్రకృతివనం అవెన్యూ ప్లాంనంటేషన్లు గ్రామస్తులకు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. సాయంత్రం వేళ గ్రామస్తులు వ్యాయాయం చేస్తున్నారు. పిల్లలు ఆటలాడుతూ, వద్ధులు సేద తీరుతూ కనిపిస్తున్నారు. ఈ ప్రకృతి వనంలో ప్రతిరోజు ఉదయం, సాయింత్ర వేళల్లో సర్పంచ్‌ రావుల శ్రీనివాస్‌ తన సిబ్బందితో పరిశీలించి నీళ్లు పెడుతుంటారు.
రకరకాల మొక్కలు
ఈ ప్రకతి వనంలో ఉసిరి, నేరేడు, టేకు, వెలగ, వేప, విప్ప, చందనం, రేగు, కనుగ కుంకుడు, పనస, చీమచింత, అందుగా, నెమలినార, చింత, ఈత, హెన్నా,నిమ్మ సీతాఫలం, జామ, దానిమ్మ, కరివేపాకు, నిమ్మతాటి, వెదురు, జమ్మి, వావిలి, గులాబీ, మల్లె, తంగెడు, అడ్డసారం, సపోట పారిజాతం, తిప్పతీగ, పొడపత్రి, జీవ, వెదురు, గచ్చకాయ, గోరింట, వేప వంటి పూలు, పండ్లు, నీడనిచ్చేచెట్లతో అందంగా దర్శనమిస్తున్నాయి. ప్రకృతి ప్రేమికులను ఆకట్టుకుంటున్న వెల్మగూడెం పల్లె ప్రకృతి వనం మండలానికే ఆదర్శంగా నిలిచింది.