రవికాంత్ కంచనపల్లి కవి, ఉపాధ్యాయుడు. ఈ మధ్యకాలంలో ‘నానీ కిరణాలు’ పేరుతో ఓ కవితాసంపుటిని కాసం వెలువరించారు. ఇందులోని కవిత్వం చదివితే ఈ కవి జీవితాన్ని ఎంతలా తనలోకి ఒంపుకున్నాడో అర్థమవుతుంది. ఎంపిక చేసుకున్న వస్తువును సూక్ష్మంగా పరిశీలించి రాయటం ఇతని ప్రత్యేకత. ఇందులో వత్తిపరమైన నానీలు రాశారు. ప్రాపంచిక దక్పథం కలిగిన నానీలు రాశారు. ప్రేమైక అనుభవాలను కూడా వ్యక్తపరిచారు. సాంకేతికత సమాజం మీద ఎంత ప్రభావం చూపుతుందో తెలియజేస్తూ నానీలు రాశారు. ఇందులోంచి కొన్నింటిని పరిశీలిద్దాం.
పరోపకారమే చెట్టు గుణం నీడై పరుచుకుంది మానవత్వమే
చెట్టుమీద చాలామంది కవులు కవిత్వం రాసినప్పటికీ ఇది వ్యక్తికరణలో భిన్నమైంది. తీసుకున్న వస్తువు పాతదే అయిన రవికాంత్ కొత్తగా చెప్పారు. నానీలు నియమాలకు లోబడి రాయాల్సి ఉంటుంది. ఇవి రాసేటప్పుడు మెరుపునో, వ్యంగ్యాన్నో, సమర్థననో కవి ఆశ్రయించాలి. దానితో పాటు కవిత్వం చేయగలగాలి. అప్పుడే ఆ నాని పండుతుంది. వీరు రాసిన నానీలన్నీ చాలా శ్రద్ధగా, ఓపికగా చెక్కబడ్డవే.
ఇంధ్రధనుస్సులు ఎక్కడో లేవు బడి పిల్లల నవ్వుల్లో చూడండి
వత్తి జీవితంలో నుంచి రాసిన నానీ ఇది. కవి ఎక్కడి నుంచో కవిత్వాన్ని పుట్టించడు. తను లేని చోటు నుంచి కవిత్వాన్ని పుట్టిస్తున్నాడంటే అది దాదాపు కల్పితమే. ఈ కవి పనిచేస్తున్న బడిలో పిల్లలను ఉద్దేశించి ఈ నానీ రాశాడు. ఎంత సహజాతి సహజంగా ఉందో ఇది చదివితే అర్థమవుతుంది. ఇలాంటి వత్తిపరమైన కవితలు ఈ సంపుటిలో ఎన్నో ఉన్నాయి.
ఆమె పూలు ఏరుకుంటుంది ఆమె నవ్వులు ఏరుకుంటూ నేను
ఈ నానీ చదివితే రవి కాంత్ లోని ‘ప్రేమ తత్వం’ బోధపడుతుంది. తన జీవిత భాగస్వామి పట్ల ఎంత ప్రేమ ఉన్నదో తెలుస్తుంది. అతడు కుటుంబం పట్ల ఇంత ప్రేమను కలిగి ఉన్నాడంటే సమాజం పట్ల కూడా ఎంతో ఆలోచన చేస్తున్నాడని అర్థం చేసుకోవచ్చు. ప్రేమను పొందడం, ప్రేమను పంచడం అనే సుగుణాలు మనిషికి ఆభరణాలు. ఈ కవి నానీల్లో ప్రేమను నింపి కవిత్వపు ఆభరణాలను పంచుతున్నాడు.
ఈ తరం మూర్చరోగి వాడు తాళాల గుత్తి కాదు స్మార్టు ఫోన్ పెట్టండి
వ్యంగ్యాన్ని పలికించిన నానీ ఇది. పిల్లలు పెద్దలు స్మార్టు ఫోన్ కు అంకితమై జీవిస్తున్న ఈ తరుణంలో మనల్ని మేల్కొల్పే నానీలు రవికాంత్ రాశారు. సాంకేతికతకు సంబంధించిన నానీలు ఈ సంపుటిలో చాలా ఉన్నాయి. పిల్లవాడి అన్నప్రాసన నుండి మొదలు పెడితే మనిషి చితిలో కలిసే వరకు సెల్ఫోన్ ప్రభావం ఎంత ఉందో తెలియజేస్తూ నానీలు రాశారు.
ఇంకా ఈ సంపుటిలో అంత్యప్రాస నానీలు ఉన్నాయి. ఆంగ్ల పదాలు చేర్పు చేస్తూ రాసిన నానీలు ఉన్నాయి. పదునైన ఈ నానీలు చదువుతుంటే రాబోయే కాలంలో ఈ కవి వచన కవిత్వదారుల్లో పరిమళాలు వెదజల్లుతారని నమ్మకం ఎంతో కలిగింది. స్వచ్ఛమైన ‘నానీ కిరణాల’ ను ప్రసరించిన రవికాంతునికి కవితాభినందనలు.
– డా|| తండ హరీష్ గౌడ్
8978439551