నానో యూరియాకు ఓకే

Nano urea is ok– మూడేండ్ల పాటు ఉపయోగించాలని కేంద్రం నోటిఫై˜
– దాని సామర్థ్యంపై ఇప్పటికే వివాదం
– ఆందోళన వ్యక్తం చేస్తున్న వ్యవసాయ శాస్త్రవేత్తలు, రైతులు
– అయినా పట్టించుకోని మోడీ సర్కారు
– ముందుకే వెళ్లాలని నిర్ణయం
న్యూఢిల్లీ: మూడేండ్ల కాలానికి నానో యూరియా ప్లస్‌ను వినియోగించాలని కేంద్రం నోటిఫై చేసింది. నానో యూరియా ఉపయోగంపై ఇప్పటికే వివాదం ఉన్నది. దాని సామర్థ్యం, సరిపోని ఫీల్డ్‌ ట్రయల్స్‌ కారణంగా నానో యూరియాపై రైతుల్లో ఆందోళన నెలకొన్నది. అయినప్పటికీ మోడీ సర్కారు ఇవేమీ పట్టించుకోకుండా నానో యూరియా వినియోగానికి గ్రీన్‌సిగల్‌ ఇచ్చింది. ఉత్పత్తిని తగ్గించటంతో రైతులు దీని వినియోగంపై అసంతృప్తితో ఉన్నారని ఇప్పటికే పలు నివేదికలు సూచించాయి. నానో యూరియా(ద్రవ రూపంలో).. అమైనో ఆమ్లాలు, పిగ్మెంట్లు, ఎంజైమ్‌లు, జన్యు పదార్ధాలను ఉత్పత్తి చేయటానికి అవసరమైన నైట్రోజన్‌ను మొక్కలకు అందిస్తుంది.
నోటిఫికేషన్‌ నానో యూరియా (లిక్విడ్‌) 16 కోసం స్పెసిఫికేషన్‌లను అందిస్తుంది. దీనిని మూడు సంవత్సరాల పాటు భారతదేశంలో ఎం/ఎస్‌ ఐఎఫ్‌ఎఫ్‌సీఓ తయారు చేస్తుంది. ఎరువుల తయారీ, మార్కెటింగ్‌లో నిమగమై ఉన్న బహుళ-రాష్ట్ర సహకార సంఘం అయిన ఐఎఫ్‌ఎఫ్‌సీఓ దాని అధునాతన ఉత్పత్తిని నోటిఫై చేయటానికి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సంతోషం వ్యక్తం చేసింది.
గతేడాది ఏప్రిల్‌ 26న కేంద్ర హౌం మంత్రి, సహకార మంత్రి అయిన అమిత్‌ షా.. న్యూఢిల్లీలో ఐఎఫ్‌ఎఫ్‌సీఓ నానో డీఏపీ (లిక్విడ్‌)ని ప్రారంభించారు. గ్రాన్యులర్‌ ఫారమ్‌లకు బదులుగా లిక్విడ్‌ నానో యూరియా, డీఏపీ వాడాలని ఆయన రైతులను ప్రోత్సహించారు. నానో-యూరియా ధర రూ. 225, నానో-డీఏపీ 500 ఎం.ఎల్‌ బాటిల్‌కు రూ. 600, గ్రాన్యులర్‌ యూరియా 50 కిలోల బ్యాగ్‌కు రూ. 266.50, డీఏపీ ధర 50 కిలోల బ్యాగ్‌కు రూ. 1,350గా ఉన్నాయి.
ఈ ఉత్పత్తి అశాస్త్రీయమైనది, అసమర్థమైది : విశ్రాంత ప్రొఫెసర్‌ తోమర్‌
కేంద్రం నానో-యూరియా ఉత్పత్తులను దూకుడుగా ప్రోత్సహిస్తున్నందున కొంతమంది వ్యవసాయ శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డాక్టర్‌ ఎన్‌.కె. చౌదరి చరణ్‌ సింగ్‌ హర్యానా అగ్రికల్చర్‌ యూనివర్శిటీలో సాయిల్‌ సైన్స్‌ విశ్రాంత ప్రొఫెసర్‌ తోమర్‌ మాట్లాడుతూ.. సాంప్రదాయ యూరియాతో పోలిస్తే ఈ ఉత్పత్తి అశాస్త్రీయమైనది, అసమర్థమైనది అని చెప్పారు. ఇది భారతదేశ ఆహార భద్రతకు ముప్పు కలిగిస్తుందని తెలిపారు. నానో యూరియా సామర్థ్యాన్ని కొలవటానికి సరైన శాస్త్రీయ అధ్యయనాలు, ఫీల్డ్‌ ట్రయల్‌ డాక్యుమెంటేషన్‌ లేకపోవడాన్ని ఆయన ఎత్తి చూపారు. తుది నిర్ణయానికి రావటానికి కనీసం మూడు సంవత్సరాల పరీక్షలు అవసరమని తోమర్‌ తెలిపారు.
పలువురు వ్యవసాయ శాస్త్రవేత్తలూ ఈ ఉత్పత్తిని వ్యతిరేకిస్తున్నప్పటికీ.. వారి అభిప్రాయాలను తెలపటానికి మాత్రం వారు ముందుకు రావటం లేదని కొందరు సామాజికవేత్తలు అంటున్నారు. ఈ విషయంలో మోడీ సర్కారు నిపుణులు, శాస్త్రవేత్తల అభిప్రాయలను గౌరవించి వెనక్కి తగ్గాలని వారు సూచిస్తున్నారు.న