‘పలాస’ ఫేమ్ రక్షిత్ అట్లూరి హీరోగా నటించిన సినిమా ‘నరకాసుర’. అపర్ణ జనార్థన్, సంకీర్తన విపిన్ కథానాయికలు. సుముఖ క్రియేషన్స్, ఐడియల్ ఫిలిం మేకర్స్ బ్యానర్స్‌లో డాక్టర్ అజ్జా శ్రీనివాస్ నిర్మించారు. సెబాస్టియన్ నోవా అకోస్టా జూనియర్ దర్శకుడు. ఈ నెల 3న తెలుగుతో పాటు హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో ఈ మూవీ రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా హీరో రక్షిత్ మీడియాతో మాట్లాడుతూ, ‘ఈ మూవీ ఏపీ, తమిళనాడు సరిహద్దుల్లోని ఓ కాఫీ ఎస్టేట్ నేపథ్యంలో సాగుతుంది. నేను లారీ డ్రైవర్ శివగా నటించాను. ‘పలాస’లో దళితులకు సంబంధించిన సమస్యలు చూపించినట్లే,
ఈ సినిమాలో హిజ్రాల తాలూకా పాయింట్ ఒకటి తీసుకున్నాం. కథపరంగా ఛత్తీస్ ఘడ్, ఒరిస్సా, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో షూటింగ్ చేశాం. ‘పుష్ప’ మూవీకి ఈ మూవీకి ఎలాంటి పోలిక ఉండదు. ఇది సూపర్ హిట్ అనే నమ్మకంతో ఉన్నాం.
మంచి మాస్ హీరోగా పేరు తెచ్చుకోవాలని ఉంది. ‘శశివదనే, ఆపరేషన్ రావణ్’ రిలీజ్‌కి రెడీ అవుతున్నాయి. మరో 2 ప్రాజెక్ట్స్ కన్ఫర్మ్ అయ్యాయి’ అని తెలిపారు.