నారసింహా..సీపీఎస్ రద్దు చేయరా..!

నవతెలంగాణ – యాదాద్రి
ఉద్యోగుల పాలిట కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్) పథకం యమగండంలా పరిణమించిందని, భాగస్వామ్య పింఛను పథకం రద్దు కావాలన్న తమ అభిమతం నెరవేరాలి అని కాంక్షిస్తూ..శ్రీ లక్ష్మి నారసింహునికి ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు కాంట్రీ బ్యుటరీ పెన్షన్ స్కీమ్ టీచర్స్, ఎంప్లాయీస్ అసోసియేషన్ (సీపీఎస్టీఈఏటీఎస్) రాష్ట్ర ప్రచార కార్యదర్శి మాచన రఘునందన్ తెలిపారు. నేడు ఆయన యాదగిరి గుట్ట ఆలయంలో సీపీఎస్ రద్దు కాంక్షిస్తూ..ప్రత్యేక పూజలు చేశారు. తమ అభిమతం నెరవేరాలని కోరుతూ..ప్రత్యేక పూజలు చేశారు. ఈ సంధర్భంగా రఘునందన్ మాట్లాడుతూ..ఉద్యోగులకు కొత్త పింఛను పథకం యమగండంలా దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు. సీపీఎస్ రద్దు ఆన్న అంశం దైవాధీనం ఆయిందని భావిస్తూ.. సీపీఎస్ రద్దయ్యే వరకు చెట్టుకు, పుట్టకు, రాయికి, రప్పకు మొక్కుతూనే ఉంటామని రఘునందన్ స్పష్టం చేశారు. దేశ వ్యాప్తంగా కోటి మందికి పైగా ఉద్యోగులు కాంట్రీ బ్యుటరీ పెన్షన్ స్కీమ్ లో ఉన్నారని వివరించారు. ఇప్పటికే దేశంలోని పలు రాష్ట్రాలు పాత పింఛను పథకం పునరుద్ధరణ దిశగా చర్యలు తీసుకుంటున్నాయన్నారు. తాజాగా హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం కూడా ఓల్డ్ పెన్షన్ స్కీమ్ (ఓపిఎస్)ను అమలు చేస్తోoదన్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా పాత పెన్షన్ పథకం పునరుద్ధరణ కోసం పాలకులు ఆలోచించేలా దైవం వారికి బుద్దిని ప్రసాదించాలని కోరుతున్నట్లు చెప్పారు.