2024 డిసెంబర్ 31న శివగిరి మఠం యాత్రలో భాగంగా ఒక సభను ప్రారంభిస్తూ, కేరళ ముఖ్యమంత్రి పినరరు విజయన్, దేవాలయాల్లోకి ప్రవేశించే క్రమంలో శరీరంలో మొండెం కనిపించే విధంగా చొక్కాలు తొలగించే ఆచారాన్ని ఆపివేయాలన్న స్వామి సచ్చిదానంద ప్రతిపాదనను సమర్థించాడు.పవిత్ర జంధ్యం ధరించిన వారిని గుర్తించడానికి ఈ ఆచారం ఉనికిలోకి వచ్చిందనీ, కేవలం అగ్ర కులాలకు చెందినవారు మాత్రమే దీన్ని ధరిస్తారని విశ్వసిస్తారు. శరీర మొండెం కనిపించడానికి మరేదైనా కారణం ఉండే అవకాశం లేదని కొందరు అనుమానిస్తూ ఉన్నారు. జంధ్యం ధరించని వార్ని దేవాలయంలోకి ప్రవేశించకుండా నిషేదించాల్సి వచ్చేది.
నారాయణ గురు సనాతన ధర్మంలో భాగంగా ఉన్నాడని ప్రచారం చేసే ప్రయత్నాలు జరిగాయనీ, కానీ ఆయన ”ఒకే కులం, ఒకే మతం, ఒకే దేవుడు” అని ప్రచారం చేశాడు కాబట్టి సనాతన ధర్మానికి దూరంగా ఉన్నాడని విజయన్ అన్నాడు. కులం, మతంతో నిమిత్తం లేని ఈ సమానత్వం సనాతన ధర్మానికి చాలా దూరంగా ఉంది. మతపరమైన భావోద్వేగాలను రెచ్చగొట్టడం ద్వారా హింసకు పాల్పడుతున్న కారణంగా గురు జీవితానికి, ఆయన పనికి నేడు ప్రాసంగిత ఉంటుందని కూడా విజయన్ అన్నాడు. గురు కేవలం ఒక మత గురువు మాత్రమే కాదు, గొప్ప మానవతావాది కూడా. విజయన్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో హిందువులంతా ఇబ్బందులకు గురవుతున్నారని విజయన్ విమర్శకులు విమర్శిస్తున్నారు. వారు శబరిమల గురించి ఉదహరించారు. అక్కడి పవిత్రాలయంలోకి రుతుక్రమం వచ్చే మహిళలకు కూడా ప్రవేశం కల్పించాలన్న సుప్రీంకోర్టు తీర్పును సమర్థించాలని పాలక పార్టీ నిర్ణయం చేసింది. ఈ విషయంలో భారతీయ జనతాపార్టీ అధికార ప్రతినిధులంతా విజయన్‌కు వ్యతిరేకంగా వ్యవహరించారు.
సనాతన ధర్మం చుట్టూ జరుగుతున్న చర్చ రెండవసారి కూడా తెరపైకి వచ్చినట్లు కనిపిస్తోంది. మొదటిసారి, ఆ చర్చ ఉదయనిధి స్టాలిన్ సనాతనధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు వచ్చింది. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లు, సనాతన ధర్మాన్ని కేవలం కులం, మతం స్థాయికి తగ్గించడం సాధ్యం కాదని ప్రకటిస్తున్నాయి. యాదచ్ఛికంగా 2022లో, న్యూఢిల్లీలో గణతంత్ర దినోత్సవం నాడు జరిగిన ప్రదర్శనలలో ఏర్పాటు చేయబడిన ఒక కేరళ శకటం నారాయణ గురుని ప్రదర్శించింది. కేంద్ర రక్షణ శాఖకు చెందిన జ్యూరీ సభ్యులు, కేరళ శకటం నారాయణ గురు కంటే కూడా కలాడికి చెందిన శంకరాచార్యుడ్ని ప్రదర్శించాలని పేర్కొంది. ఇదే, ఆ కేరళ శకటాన్ని తిరస్కరించడానికి ఒక ముఖ్యమైన కారణం.
శాశ్వతత్వానికి నిలబడే సనాతన ధర్మాన్ని బౌద్ధ మతం, జైన మతం, హిందూ మతాల కోసం ఉపయోగిస్తున్నారు. ఒకే ప్రవక్త, ఒకే పవిత్ర గ్రంథం మాత్రమే లేనిది హిందూ మతం.”హిందూ” అనే పదాన్ని హిందూమత పవిత్ర గ్రంథాల్లో ఎక్కడా ప్రస్తావించలేదు. దానికి రెండు ప్రధాన స్రవంతులు ఉన్నాయి – బ్రాహ్మణవాదం, శ్రమణవాదం. బ్రాహ్మణవాదం, శ్రేణీగత అసమానత్వం, పితస్వామిక విలువలపై ఆధారపడి ఉంటుంది. హిందూమతంపై బ్రాహ్మణీయ విలువలు ఆధిపత్యం చెలాయిస్తున్నాయని భావించాడు కాబట్టే అంబేద్కర్ హిందూ మతాన్ని త్యజించాడు. శ్రమణీయ సాంప్రదాయాల్లో అసమానత్వ విలువలకు దూరంగా ఉన్న నాథ్, అజివికాస్, తంత్ర, భక్తి సాంప్రదాయాలున్నాయి. నేటి ప్రజాదరణ పొందిన పరిభాషలో సనాతన ధర్మం, హిందూ ధర్మం పరస్పరం మార్చుకోదగినవి. హిందూమతం ఒక మతం కాదు, కానీ ధర్మం ఆధారమైన ఒక జీవన విధానం అని కొంతమంది సిద్ధాంతకర్తలు చెప్తున్నారు. అదే విధంగా సనాతనధర్మం ముఖ్యంగా వర్ణ వ్యవస్థ, కుల అసమానతలు, వాటి సాంప్రదాయాలకు కట్టుబడి ఉంటుంది. ధర్మం అనేది మతపరంగా నిర్దేశించబడిన విధిగా అర్థం చేసుకోవచ్చు. అసమానతపై ఆధారపడిన ఒక మతాన్ని తిరస్కరించడాన్ని సంఘ సంస్కర్తలు వ్యతిరేకిస్తున్నారు.
బుద్ధుడు, కబీర్, జ్యోతిరావు ఫూలేలను తన గురువులుగా పరిగణించిన అంబేద్కర్‌ను ఉదాహరణగా తీసుకుందాం. ఆయనకు కుల, లింగ అసమానతలను తిరస్కరించడం ముఖ్యం. మధ్యయుగం నాటి భారతదేశంలో కబీర్, తుకారాం, నమ్డియో, నార్సీ మెహతా లాంటి సాధువులు, వారి ఇష్టాలు నిత్యం కుల వ్యవస్థకు వ్యతిరేకంగా ఉండేవి, వారిలో కొందరు అగ్రకుల పాలకుల నుండి దాడులను కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది. నారాయణ గురు కులవ్యవస్థకు వ్యతిరేకంగా గొప్ప సంఘ సంస్కర్తగా వచ్చి, మత విభజనను అధిగమించాడు. బ్రాహ్మణీయ హిందూ మత మార్గదర్శకత్వంలో ప్రస్తుత పాలకవర్గం, కేరళ నుండి నారాయణ గురు శకటం ఏర్పాటును అంగీకరించకపోవడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. నారాయణ గురు మానవత్వంగల వ్యక్తి. ఆయన ఎదుగుతున్న కాలంలో ఆధ్యాత్మికవాదం, యోగా సాధన పనిలో బాగా నిమగం అయ్యాడు.1888లో తన తాత్విక ప్రయాణంలో అరువిప్పురం సందర్శించి, అక్కడ ధ్యానంలోకి వెళ్లాడు. అక్కడున్న సమయంలోనే ఆయన నది నుండి ఒక రాయిని తీసుకొని, దానిని ప్రతిష్టించి, దానినే శివుడి విగ్రహం అని పేరు పెట్టాడు. అప్పటి నుండి ఆ ప్రదేశాన్ని అరువిప్పురం శివాలయంగా ప్రసిద్ధి చెందింది. ఆ తర్వాత అది అరువిప్పురం ప్రతిష్టగా ప్రఖ్యాతి గాంచింది. ఇదొక పెద్ద సామాజిక అలజడిని, ముఖ్యంగా అగ్రవర్ణాల వారి నుండి వ్యతిరేకతను సష్టించింది. బ్రాహ్మణులు, నారాయణ గురు చేపట్టిన విగ్రహ ప్రతిష్టను అంగీకరించలేదు.”ఇది బ్రాహ్మణ శివుడు కాదు, కానీ ఇజావ శివుడు” అని వారికి సమాధానమిచ్చాడు. ఈ ఉటంకింపు తర్వాత కాలంలో ప్రసిద్ధి చెంది, కులతత్వానికి వ్యతిరేకంగా ఉపయోగపడింది. ఆయన తన జీవితాన్ని కులతత్వ వ్యతిరేక పోరాటానికి అంకితం చేశాడు. పాతుకుపోయిన కుల వ్యవస్థను సవాల్ చేయడంలో ఆయన కార్యాచరణ పెద్ద ఆచరణాత్మక సాధనమైంది. నారాయణ గురూ విప్లవాత్మక అవగాహన ”ఒకే కులం, ఒకే మతం, ఒకే దేవుడు”.నారాయణ గురు కులమతాల విభేదాలకు అతీతంగా ఒకే ఒక మానవత్వాన్ని చాటి చెప్పాడు. తరువాత కాలంలో ఆయన, మహారాష్ట్రలో జ్యోతిరావుఫూలే మాదిరిగా నిమ్నకులాల వారికి కూడా పాఠశాలలను ప్రారంభించాడు. అంబేద్కర్ కాలారామ్ దేవాలయ ఉద్యమ నిబంధనల వలె, ఆయన అన్ని కులాలకు చెందిన వారి కోసం దేవాలయాలను నిర్మించాడు.
పినరరు విజయన్ సమర్థించిన స్వామి సచ్చిదానంద సూచన కూడా శరీరంలో మొండెం కనిపించే విధంగా చొక్కాలు విప్పడం వల్ల వైద్యపరంగా నష్టం కలిగిస్తుందని చెపుతుంది. ఎందుకంటే అది శరీరంపై వ్యాధులను వ్యాప్తి చేస్తుంది. కాలానికనుగుణంగా చాలా ఆచారాలు మారాల్సిన అవసరం ఉంది. స్త్రీలు తమ రొమ్ముల్ని కనిపించకుండా కప్పుకునే హక్కు ఉండేది కాదనే విషయం అందరికీ తెలిసిందే. రొమ్ముల్ని కనిపించకుండా కప్పుకునే మహిళలు పన్ను చెల్లించాల్సి వచ్చేది. టిప్పు సుల్తాన్ కేరళను ఆక్రమించుకున్న తరువాత రొమ్ము పన్నును రద్దు చేశాడు, ఆ విధంగా మహిళలు తమ గౌరవాన్ని పొందారు. దేవాలయాలు మన సామాజిక జీవితంలో ఒక భాగం. దుస్తులు ధరించడంలో ఇలాంటి మార్పులు సామాజిక విధానాల్లో మార్పులకు తోడుగా ఉండాల్సిన అవసరం ఉంది. దీనికి ఎలాంటి వ్యతిరేకత వ్యక్తమైనా అది తిరోగమన చర్యే అవుతుంది. చాలా ప్రాంతాల్లో మతం పేరుతో రాజకీయాలు చేయడమనేది సామాజిక మార్పుకు, రాజకీయ విలువల్లో మార్పుకు వ్యతిరేకమే అవుతుంది. కేరళ, భిన్న రంగాల్లో అనేక వైరుధ్యాలను కలిగి ఉంది. ఇక్కడే ఒకవైపు కలాడికి చెందిన శంకరాచార్యుడు, వాద ప్రతివాదనల్లో బౌద్ధుల్ని ఎదుర్కొన్నాడు. బౌద్ధులు, ప్రాపంచిక సమస్యలపై దష్టిని కేంద్రీకరించేందుకు భౌతికవాద ప్రాతిపదికన వాదనలు వినిపించారు. అదే క్రమంలో శంకరుడు, ప్రపంచమంతా ఒక భ్రమ అని వాదించడానికి ప్రయత్నించడంతో పాటు ఆదర్శవాద తాత్వికతను సమర్థించాడు.
నేటి భారతదేశంలో కేరళతో సహా నారాయణ గురు, కబీర్ లాంటి సాధువుల మార్గాన్ని అనుసరించాల్సిన అవసరం ఉంది. వారి మానవీయ విలువలు సమాజంలో స్నేహ సంబంధాలకు మార్గ నిర్దేశం చేశాయి. అనేక విషయాల్లో సాంప్రదాయక ”యధాతధ స్థితి”, సామాజిక ప్రగతిని ఆటంకపరుస్తుంది.
(”న్యూస్ క్లిక్ ” సౌజన్యంతో)
అనువాదం : బోడపట్ల రవీందర్, 9848412451
రామ్ పునియానీ