– రేవంత్‌రెడ్డి సీఎం కావడంతో పథకంపై ఆశలు
– మాట నిలబెట్టుకోని గత ప్రభుత్వం
– జిఓ 69 అమలు చేయాలని కోరుతున్న రైతులు
– పథకం పూర్తయితే పచ్చని పంటలతో సాగు భూములు
నవతెలంగాణ-మహబూబ్‌నగర్ ప్రాంతీయప్రతినిధి
కొడంగల్ ఎమ్మెల్యే ఎనుముల రేవంత్‌రెడ్డి సీఎంగా పగ్గాలు చేపట్టడంతో నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం నిర్మాణంపై మళ్లీ ఆశలు చిగురించాయి. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో నీరందని మెట్ట ప్రాంతాల రైతుల చిరకాల స్వప్నం నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకం. ఆ కలను సాకారం చేయాలని, ఎత్తిపోతల పథకం నిర్మాణం చేపట్టాలని తొమ్మిదిన్నరేండ్ల క్రితం(2014 మే 23న) జీఓ విడుదలైంది. రెండు పర్యాయాలు బీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నా పథకం పూర్తి చేయడానికి పూనుకోలేదు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంతో ఆ ప్రాంతానికి సాగునీరందిస్తామని బీఆర్‌ఎస్ ప్రభుత్వం చెప్పినా అమలుకు నోచలేదు. రేవంత్‌రెడ్డి కొండారెడ్డిపల్లి స్థానికుడు కావడం, సిఎం కావడంతో నారాయణపేట, మక్తల్, కొడంగల్ వాసుల కండ్లల్లో ఆనందం వ్యక్తమవుతోంది.
నారాయణపేట- కొడంగల్ ఎత్తిపోతల పథకం నిర్మాణం కోసం అనేక ఉద్యమాలు, పాదయాత్రలు, బహిరంగసభలు జరిగాయి. సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పాదయాత్ర చేసిన సందర్బంగా ఈ ప్రాజెక్టు నిర్మిస్తేనే సాగు భూములకు నీరు అందుతుందని ఆయన అప్పటి సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. జలసాధన సమితి ద్వారా కూడా పాదయాత్రలు, ఆందోళనలు, సభలు జరిగాయి. పాలమూరు -రంగారెడ్డి ద్వారా కొడంగల్ వికారాబాద్‌కు సాగు నీరు ఇస్తామని బీఆర్‌ఎస్ హామీ ఇచ్చింది. అయినా అడుగుకు ముందుకు పడలేదు. తాము అధికారంలోకి వస్తే.. మక్తల్, నారాయణపేట, కొడంగల్ ప్రాంతాలకు సాగు నీరందిస్తామని రేవంత్‌రెడ్డి ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటారని రైతులు, స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో జూరాల, శ్రీశైలం, నెట్టెంపాడు, బీమా కోయిల్‌సాగర్ ప్రాజెక్టుల ద్వారా పాక్షికంగా సాగునీరు అందుతోంది. మక్తల్ కొడంగల్ నారాయణపేట ప్రాంతాలకు సాగునీరు అందడం లేదు. అందుకే బీమా ఎత్తిపోతల పథకంలో భాగమైన బూత్పూరు జలాశయం నుండి నాలుదు దశల్లో కామకుర్తి వరకు నీళ్లెత్తిపోసి అక్కడి నుండి గ్రావిటీ ద్వారా దౌల్తాబాద్ కొడంగల్ మీదుగా బొమ్మరాసిపేట వరకు చెరువులను నింపి లక్ష ఎకరాలకు సాగునీరు అందించే అవకాశాలు ఉన్నాయి. జయమ్మ చెరువు ఎత్తిపోతల పథకం పూర్తి చేయాలని 2005లో సీపీఐ(ఎం) నేతలు సైకిల్ యాత్ర చేసి అప్పటి సిఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డికి వినతి పత్రం అందజేశారు. అప్పుడే ఏడున్నర టిఎంసీల ద్వారా నారాయణపేట కొడంగల్ లిప్టును పూర్తి చేయాలని ప్రాధమికంగా ఒక అంచనాకు వచ్చారు. 133 కోట్ల 50 లక్షలతో పనులు పనులు ప్రారంభించేందుకు నాటి ప్రభుత్వం సంకల్పించింది. 3.36 కోట్లు ప్రాధమికు సర్వే కోసం,, 130 కోట్లు భూ సేకరణ కోసం కేటాయిం చాలని నిర్ణయించారు. 2014 మే 23న జీవో నెంబరు 69ని తీసుకొచ్చారు. మొదట పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు జూరాల వెనక జలాలను తీసుకురావాలని అంచనాలు సిద్ధమైనాయి. ఆతర్వాత ముంపు అధికంగా ఉందని దిశ మార్పు చేసి.. శ్రీశైలం వెనక జలాల ద్వారానే పాలమూరు, రంగారెడ్డిని నిర్మాణం చేయాలనే నిర్ణయానికి వచ్చారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలను మొదట ఆయిదు రిజర్వాయర్లతోనే నిర్ణయించినా… ఆరో రిజర్వాయరు లక్ష్మిదేవిపల్లిని డిపీఆర్‌లో చేర్చారు. ఇప్పుడు లక్ష్మిదేవిపల్లి ఊసు లేదు. గత ప్రభుత్వంలో పూర్తిగా మరుగున పడింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం కొడంగల్ – నారాయణపేట ఎత్తిపోతల పథకం పూర్తవుతుందన్న ఆశతో రైతులు ఉన్నారు.
కొడంగల్ నారాయణపేట ఎత్తిపోతలను మంజూరు చేయాలి
నారాయణపేట జిల్లా అతి వెనుకబడిన జిల్లా. ప్రతి ఏటా ఇక్కడి నుంచి లక్షల్లో వలసలు ఉంటాయి. కృష్ణానది సమీపాన ఉన్నా.. సాగు నీరు లేదు. ఒక ప్రాజెక్టు అయినా..నిర్మాణం జరగలేదు. ఈ ప్రాంత వలసల నివారణతో పాటు సాగు భూములకు నీరు అందించడానికి ఏకైక మార్గం కొడంగల్ ఎత్తిపోతల పథకం. ఎట్టి పరిస్థితిలోనూ.. ఈ పథకం నిర్మాణం విషయంలో ప్రభుత్వం జాప్యం చేయవద్దు.
వెంకట్‌రాంరెడ్డి, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి, నారాయణపేట జిల్లా