
నవతెలంగాణ – కంటేశ్వర్
యువతను, విద్యార్థుల భవిష్యత్తును నిర్వీర్యం చేస్తున్న మాదకద్రవ్యాలు, మత్తు పదార్థాలు నిరోధానికి కలిసికట్టుగా కృషి చేయాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో కలెక్టర్ అధ్యక్షతన బుధవారం జిల్లా స్థాయి మాదకద్రవ్యాల నిరోధక కమిటీ సమావేశం జరిగింది. పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్, అదనపు కలెక్టర్ పి.యాదిరెడ్డి, సంబంధిత శాఖల అధికారులు పాల్గొని జిల్లాలో మాదకద్రవ్యాల తయారీ, వాటి వినియోగం, రవాణా తదితర అంశాలపై క్షుణ్ణంగా చర్చించారు. వాటి నియంత్రణకు చేపట్టాల్సిన చర్యల గురించి కీలక నిర్ణయాలు తీసుకుని సంబంధిత అధికారులకు కలెక్టర్ సూచనలు చేశారు. సమాజానికి పెను ప్రమాదకరంగా మారిన మాదకద్రవ్యాల రవాణా, వినియోగంపై ఉక్కుపాదం మోపేందుకు సంబంధిత శాఖలు సమన్వయంతో మరింత గట్టిగా పని చేయాల్సిన అవసరం ఉందని సూచించారు. మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాలకు అలవాటుపడి వాటికి బానిసలుగా మారిన వారు వ్యక్తిగతంగా, కుటుంబపరంగా నష్టపోవడమే కాకుండా సమాజానికి కూడా హానికారకులుగా మారుతారని అన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని మాదకద్రవ్యాల వినియోగం, రవాణాపై గట్టి నిఘా పెడుతూ, వాటిని పూర్తి స్థాయిలో అరికట్టేందుకు అంకితభావంతో కృషి చేయాలని కలెక్టర్ హితవు పలికారు. మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాల గురించి విద్యార్థులు, యువతకు అవగాహన కల్పించేందుకు విస్తృత స్థాయిలో చర్యలు చేపట్టాలని, కళాశాలలు, ఉన్నత పాఠశాలల్లో మాదకద్రవ్యాల నిరోధక కమిటీలను ఏర్పాటు చేయాలని సూచించారు. ముఖ్యంగా తల్లిదండ్రులకు కూడా అవగాహన ఏర్పరిస్తే, పిల్లలు మాదకద్రవ్యాలు సేవించడం వంటి వ్యసనాల జోలికి వెళ్లకుండా కాపాడుకునేందుకు ఆస్కారం ఉంటుందని అభిప్రాయపడ్డారు. గంజాయి వంటి మత్తు పదార్థాలు ఎక్కడి నుండి జిల్లాకు చేరుతున్నాయి, ఏయే ప్రాంతాల్లో ఎవరు వీటిని విక్రయిస్తున్నారు, ఏ ప్రాంతాలకు జిల్లా మీదుగా రవాణా జరుగుతోంది అనే వివరాలకు పక్కాగా గుర్తిస్తూ, వాటి మూలాలను అడ్డుకోగలిగితే చాలా వరకు మత్తు పదార్థాలు వినియోగాన్ని నియంత్రించవచ్చని సూచించారు. ఈ దిశగా, పోలీస్, ఎక్సయిజ్, రవాణా తదితర శాఖలు సమన్వయంతో ముందుకెళ్లాలని అన్నారు. గంజాయి సాగు, వినియోగానికి సంబంధించి క్షేత్రస్థాయి సిబ్బందిని అప్రమత్తం చేసి, వారి ద్వారా ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరించాలని వ్యవసాయ, అటవీ తదితర శాఖల అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఇంటెలిజెన్స్ ఇతర నిఘా వ్యవస్థల ద్వారా నిషేధిత మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరిస్తూ, పరస్పర సమన్వయంతో వాటి నిరోధానికి సంబంధిత శాఖల అధికారులు కలిసికట్టుగా కృషి చేయాలని సూచించారు. సీ.పీ కల్మేశ్వర్ మాట్లాడుతూ, మాదకద్రవ్యాల నిరోధానికి పోలీస్ శాఖ చిత్తశుద్ధితో కృషి చేస్తోందన్నారు. అయినప్పటికీ జిల్లాలో మత్తు పదార్థాలు వినియోగం ఒకింత ఆందోళన కలిగించే స్థాయిలోనే కొనసాగుతోందని అన్నారు. ముఖ్యంగా అల్ఫాజోలం వినియోగంలో రాష్ట్రంలో మొదటి మూడు స్థానాలలో ఉన్న జిల్లాలలో నిజామాబాద్ ఒకటిగా ఉందని గణాంకాల ఆధారంగా వెల్లడించారు. జిల్లాలో గతేడాది గంజాయి సాగుకు సంబంధించి ఎలాంటి కేసులు నమోదు కాలేదని, అయితే ఇతర ప్రాంతాల నుండి జిల్లాకు గంజాయిని చేరవేస్తూ పలువురు విక్రయాలు జరుపుతున్నారని, అలాంటి వారిపై నిఘా పెడుతూ దాడులు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఒడిశాలో పెద్ద ఎత్తున గంజాయి సాగు అవుతుండగా, ఆంధ్ర ప్రాంతం మీదుగా జిల్లాకు చేరుతున్నట్లు తెలుస్తోందని, ఈ మేరకు జిల్లా సరిహద్దు ప్రాంతాలలో ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేశామన్నారు. మత్తు పదార్థాల నియంత్రణ కోసం ఎక్సయిజ్ తదితర శాఖలకు తమ పోలీసు శాఖ ద్వారా పూర్తి స్థాయిలో సహకారం అందిస్తామని అన్నారు. ఆర్టీసీ బస్సుల ద్వారా కూడా స్మగ్లర్లు గంజాయి రవాణా చేసే అవకాశాలు ఉన్నందున తమ సిబ్బందిచే నిఘా ఉంచామని తెలిపారు. ఈ సమావేశంలో నగరపాలక సంస్థ కమిషనర్ ఎం.మకరందు, అదనపు డీసీపీ జయరాం, ట్రైనీ ఐ.పీ.ఎస్ చైతన్య, ఆర్డీఓ రాజేంద్రకుమార్, రాజాగౌడ్, వినోద్ కుమార్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వాజిద్ హుస్సేన్, డీటీసీ వెంకట రమణ, ఐ.బీ అధికారి ప్రసాద్, విద్య, వైద్య, అటవీ, రవాణా, వాణిజ్య పన్నులు, ఔషధ నియంత్రణ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.