కథాసాహిత్యంలో ప్రాంతం కేంద్రంగా ఉన్న రచనలు ఇప్పటికి అనేకం వచ్చాయి. ముఖ్యంగా రచయితలు తమ జ్ఞాపకాలను అక్షరీకరించే క్రమంలో తాము పుట్టిన ప్రాంతం గురించో, తమకు తెలిసిన ప్రాంతం గురించో కథలను రాయడం జరుగుతూ ఉంటుంది. కానీ అటువంటి కథల్లో రచయిత జీవితం నుండి ఆ కథలను విడి చేయడం సాధ్యం కాదు. దాని వల్ల పాఠకుడు ప్రతి కథలోని ఏదో ఒక పాత్రతో, అనేకసార్లు నాయకుని పాత్రను రచయితగా భావించడం జరుగుతూ ఉంటుంది. కథల్లో కల్పన ఉండటం సహజమే కానీ, తన గురించి ఏదో ఒక రూపంలో చెప్పే సాహిత్య ప్రక్రియను రచయిత ఎన్నుకున్నప్పుడు, తాను ఎంతవరకు తన గురించి పాఠకులకు చెప్పదల్చుకున్నాడో అన్న అంశం గురించి స్పష్టత కలిగి ఉండాలి. ఆ స్పష్టత ఆ రచనలో కనిపించాలి. అటువంటి స్పష్టత కలిగిన రచయితే మొగిలి అనిల్ కుమార్ రెడ్డి. తన మొదటి పుస్తకమైన ‘నర్సంపేట కథల్లో’ ఓ విభిన్న ప్రయోగంతో తన జీవితానికి ,తన కల్పనా శక్తి కి మధ్య ఒక రేఖను ఈ పుస్తకంలో గీయగలిగారు.
‘నర్సంపేట కథల్లో’ జరిగే ప్రాంతం నర్సంపేట. ఈ కథల్లో మొదట పది కథలు ఒక భాగం, రెండో భాగం ‘జ్ఞాపకాలు’పేరుతో ఉన్నాయి. రచయిత ఈ కథల్లో మొదటి భాగంలో కథల కేంద్రం తను,పుట్టి పెరిగిన ‘నర్సంపేట’లో జరిగినా,అవి కల్పనతో కూడినవి అయితే ‘జ్ఞాపకాలు’లో మాత్రం తన పుట్టి పెరిగిన ‘నర్సంపేట’తో తనకు ఉన్న అనుబంధాన్ని గురించి అనేక కోణాల్లో రాశారు. ఈ విభజన రేఖ వల్ల రచయిత ముందు రాసిన కథల ప్రేరణకు, ‘నర్సంపేట’తో ఆయనకున్న అనుబంధానికి ఉన్న సంబంధం పాఠకులకు స్పష్టం అవుతుంది.మామూలు కథల్లో ఈ స్పష్టత అవసరం లేదు కానీ, ప్రాంతం లేదా వ్యక్తి చుట్టూ తిరిగే కథల్లో ఈ స్పష్టత ఉండటం అన్నది ఆ రచనలకు,పాఠకులకు మధ్య ఒక ‘ఎమోషనల్ బాండింగ్’ ఏర్పడేలా చేస్తుంది.
”పులి తరుముకొస్తున్నవాడు తాను ఎక్కదల్చుకున్న చెట్టు దగ్గరకు ఎలా పరిగెత్తుతాడో అలా కథకుడు సూటిగా తన కథాంశం వద్దకు పరిగెత్తాలి”,అన్నాడు హెచ్.జి.వెల్స్. ఈ సూత్రం అంతర్లీనంగా ఈ కథల్లో కనిపిస్తూ ఉంటుంది. ఎవరీ అనిల్ కుమార్? ఈ నర్సంపేట గురించి రాసేంత ఏముంది? అని పాఠకులు మొదట పుస్తకం తెరవబోయే ముందు అనుకునే ప్రశ్నకు సమాధానంలో ఒక భాగాన్ని మొదటి మూడు పేజీల్లో ఈ కథలకు ఆరంభ స్థానాన్ని ఎన్నుకోవడానికి ఉన్న ‘ఎమోషనల్ ఇంటెన్సిటీ’ని, తన జననం వెనుక ఉన్న యుద్ధాన్ని రాయడంతో స్పష్టం చేశారు. ఈ ఆరంభ ఘటనను రచయిత రాసిన తీరు, ఈ రచన వెనుక ఉన్న గంభీరతను స్పష్టం చేస్తుంది.
మొదటి కథ ‘లైన్ క్లియర్’ లో మల్లయ్య గురించి చెప్తున్నప్పుడు, ఆ శీర్షికతో ముడిపడి ఉన్న అతని జీవితాన్ని నిర్మించి, దానిలోనే అతని వ్యక్తిగత కుటుంబాన్ని,వత్తి జీవితాన్ని తన కథల్లో కేంద్రంగా ఉండే ‘అనుభూతి చిత్రణ’ను వదలకుండా కథ మొదటి నుండి చివరి వరకు, వ్యక్తిగా అతని మంచితనాన్ని, బాధ్యతల వలయంలో ఒక అసహాయుడిగా మారిన క్రమాన్ని,మారుతూ ఉన్న భావోద్వేగాల మధ్య కూడా నడిపించగలిగారు.
మిగిలిన కథల్లో ముఖ్య అంశం స్త్రీ-పురుషుల మధ్య ఉండే ప్రేమ. ఈ ‘ప్రేమ’ చుట్టూ ఉన్న జ్ఞాపకాలను అల్లే క్రమంలో ఉన్న విభిన్నత వల్ల ఇవి చదివింపజేస్తాయి. ఈ ప్రేమలో వాస్తవికత ఉంది. ప్రేమ అంటే ప్రేమించుకోగానే, పెళ్ళి చేసుకోవడం కాదు, అది ఒక అందమైన భావన. ఆ భావన మనిషి జీవితంలో ఓ వింతైన మాధుర్యాన్ని అనుభవించేలా చేస్తుంది. దాని పరిణామాలు ఎలా దారితీసినా సరే, ‘ప్రేమిస్తున్న భావన, ప్రేయసి లేదా ప్రియుడి ఆలోచనలు’ యవ్వనంలో మనుషులను ఓ కొత్త లోకంలో విహరించేలా చేస్తాయి.
రచయిత స్వయంగా గొప్ప చదరంగ ఆటగాడు కావడం వల్ల, ఆ చమక్కు ‘నల్లంచు తెల్ల చీర’కథలో కనిపించినట్టు అనిపిస్తుంది. ఇది కొంత ఆహ్లాదమైన అలాగే అసభ్యతకు తావు లేని, చక్కటి ప్రేమ కథ. ‘బవురూపులది’ కథ కూడా ఓ విచిత్రమైన ప్రేమ కోణాన్ని చెప్పే కథ. అలాగే ‘నాగమల్లి’ కథలో వయసుతో సంబంధం లేకుండా యవ్వనంలో ఉన్నప్పుడు కలిగే ఆకర్షణ కనిపిస్తుంది. ‘మాట తప్పని మనిషి’ కథలో ప్రేమ కేవలం ఎదుటి వ్యక్తి ప్రేమించినప్పుడు మాత్రమే కాదని, ఆ మనిషి మారినా ఆ ప్రేమ మారనిది అని, ప్రేమ అనే భావం వ్యక్తికి మించినది అని చెప్పే కథ. ‘అమ్ములు అట్లా చేయకుండా ఉంటే బాగుండు’ అనే కథలో ప్రేమలో అనుమానం వల్ల ఎలాంటి అపార్థాలు తలెత్తుతాయో అన్న అంశాన్ని భార్యాభర్తల మధ్య ఉన్న ప్రేమ రూపంలో చిత్రించారు. ‘చివరి కథ’లో ప్రేమ కథల్లో ఉండే ఊహించని మలుపు ఎదురైతే ఎలా ఉంటుందో అన్నదాన్ని స్పశించారు.
ఇక ‘జ్ఞాపకాలు’ విషయానికి వస్తే, రచయిత ‘నర్సంపేట’లో గడిపిన కాలంలో తనను బలంగా ప్రభావితం చేసిన అంశాల గురించి, తనను ఆకట్టున్న మనుషుల గురించి, తన కుటుంబంతో కలిసి అక్కడ ఉన్నప్పుడు, అక్కడ ఉన్న ప్రదేశాలతో ఏర్పడిన అనుభవాల గురించి ఇదంతా బాల్యం జ్ఞాపకాలు కనుక ఆ అనుభూతులను చాలా సూక్ష్మంగా, హృదయానికి హత్తుకునేలా రాశారు.
సాహిత్యానికి, జీవితానికి మధ్య ఉన్న అనుబంధాన్ని ‘నర్సంపేట కథలు’ గుర్తు చేస్తాయి అనడం అతిశయోక్తి కాదు. ‘జ్ఞాపకాలు’ మనల్ని కొన్ని సార్లు ఏడిపిస్తాయి, ఇంకొన్ని సార్లు పశ్చాత్తాపపడేలా చేస్తాయి, మరికొన్ని సార్లు సంతోషపడేలా కూడా చేస్తాయి.ఏ రకమైన భావాన్ని అవి మనలో కలిగించినా సరే,ఆ ‘భావోద్వేగ తీవ్రత’ మాత్రం మనల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. అటువంటి జ్ఞాపకాలు మీ జీవితంలో కూడా ఒక భాగమే కనుక తప్పక ఈ ‘నర్సంపేట కథలు’ చదవండి.
– శృంగవరపు రచన