నర్సింహానందను వెంటనే అరెస్టు చేయాలి

– ఆవాజ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్‌ అబ్బాస్‌
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
మత విద్వేష ప్రసంగాలతో ప్రజలమధ్య చిచ్చు పెడుతున్న నర్సింహానందను తక్షణమే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని ఆవాజ్‌ తెలంగాణ రాష్ట్ర కమిటీ డిమాండ్‌ చేస్తున్నది. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండీ అబ్బాస్‌ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఉత్తర ప్రదేశ్‌కు చెందిన ఆలయ పూజారీ నర్సింహానంద చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దేశంలో ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఆయనపై ఏకంగా దేశ వ్యాప్తంగా యాభైకి పైగా కేసులు నమోదయ్యాయని తెలిపారు. గతంలో మదర్సాలను కూల్చివేయాలనీ, అలీఘఢ్‌ ముస్లిం యూనివర్సిటీని గన్‌పౌడర్‌ ఉపయోగించి పేల్చివేయాలని పిలుపునిచ్చి మతాల మధ్య చిచ్చు పెడుతున్నందుకు ఆయనపై కేసు నమోదైందని గుర్తు చేశారు. బెయిల్‌పై బయటకొచ్చి తిరిగి అదే తరహాలో మత సామరస్యాన్ని దెబ్బతీసే విధంగా ప్రసంగాలు చేస్తున్నారని విమర్శించారు. బెయిల్‌ను రద్దు చేస,ి ఆయన్ను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. మతోన్మాద సంస్థల, వ్యక్తుల పట్ల కేంద్ర ప్రభుత్వ సానుకూల వైఖరి వల్లనే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని తెలిపారు. మతోన్మాద రాజకీయాలను ప్రజలు తిరస్కరించటం ద్వారానే మతోన్మాదులకు చెక్‌ పెట్టగలమని పేర్కొన్నారు. మత విద్వేషాలు రెచ్చగొట్టే వారిపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.