ఆద్యంతం భావోద్వేగ భరితంగా నరుడి బ్రతుకు నటన

Narudi's performance is emotionally charged throughoutప్రస్తుతం పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ వరుస చిత్రాలతో సందడి చేస్తోంది. కంటెంట్‌ ఓరియెంటెడ్‌ సబ్జెక్టులతో పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ వరుస ప్రాజెక్ట్‌లను తెరకెక్కిస్తోంది. మంచి చిత్రాలను అందించే క్రమంలో పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ ‘నరుడి బ్రతుకు నటన’ అనే సినిమాను మన ముందుకు తీసుకొస్తోంది. ఈ మూవీ చిత్రీకరణ అంతా కూడా కేరళలో జరిగింది. ఇక కేరళ ప్రకతి అందాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ సినిమాలో కేరళ అందాలే హైలెట్‌ కానున్నాయి. శివ కుమార్‌ రామచంద్రవరపు, నితిన్‌ ప్రసన్న, శతి జయన్‌, ఐశ్వర్యా అనిల్‌ కుమార్‌, వైవా రాఘవ వంటి వారు ప్రముఖ పాత్రల్లో నటించిన ఈ మూవీని రిషికేశ్వర్‌ యోగి తెరకెక్కిస్తున్నారు. నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్‌, సుకుమార్‌ బొరెడ్డి, డా.సింధు రెడ్డి సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి వివేక్‌ కూఛిబొట్ల సహనిర్మాతగా వ్యవహరిస్తున్నారు. విడుదలకు ముందే దాదాపు అరవైకి పైగా అంతర్జాతీయ అవార్డులను గెలుచుకున్న ఈ చిత్రాన్ని పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌ ఈనెల 26న ప్రేక్షకుల ముందుకు తీసుకురావటానికి సన్నాహాలు చేస్తున్నారు. ‘ఆద్యంతం భావోద్వేగ భరితంగా సాగే ఈ సినిమా కేరళ అందాలకు ప్రతిబింబంగా నిలుస్తుంది. అలాగే ప్రేక్షకుల ప్రశంసలతోపాటు విమర్శకుల అభినందల్ని పొందిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకుల్ని సైతం అలరిస్తుందనే నమ్మకంతో ఉన్నారు.