నరుల శ్రమే..కుబేరుల సిరి

నరుల శ్రమే..కుబేరుల సిరిమరో ఆరు సంవత్సరాల్లో (2030 నాటికి) మన భారత్‌ ఏడులక్షల కోట్ల డాలర్ల (ఏడు ట్రిలియన్లు) ఆర్థిక వ్యవస్థగా ఎదిగి ప్రపంచంలో అమెరికా, చైనా తర్వాత తృతీయ శక్తిగా పరిణమిస్తుందని పాలకులతో పాటు ఆర్థికవేత్తలు కొందరు అంచనా వేస్తున్నారు. మరి ఇప్పటివరకు జరుగుతున్న, పెరుగుతున్న ఆర్థిక వ్యత్యాసాలపై వారు పెదవి విప్పరు. పేదరికం తగ్గుతున్నదా? రైతులు, నిరుద్యోగుల ఆత్మహత్యలు ఆగుతాయా? జలవనరులు – కాలు ష్యం మాటేమిటి? విద్యా, వైద్యం అందరికీ అందుబాటులోకి వస్తాయా? పిల్లలు పౌష్టికాహార లేమి లేకుండా హాయిగా ఎదుగుతారా? అన్నిటికన్నా ముఖ్యం శాంతి-భద్రతలు సమకూరుతాయా? సామాన్యుల జీవన ప్రమాణాలు మెరుగ వుతాయా?- ఇలాంటి ప్రశ్నలకు వారు సరైన సమాధానం ఇవ్వలేకున్నారు. వారే కాదు పెట్టుబడిదారీ వ్వవస్థకు బంధీ అయిన ఏ పాలకుడు, ఆర్థికవేత్త ఇందుకు సమాధానం ఇవ్వలేడు. వారి దగ్గర ఉండదు. కారణం కారల్‌ మార్క్స్‌ ఏనాడో తెలిపినట్టు పెట్టుబడిదారీ వ్యవస్థను బతికించేది ఆర్థిక దోపిడీ చట్రం గనుక.
దోపిడీ తాండవించే చోట అవినీతి తారాస్థాయికి చేరుతుంది. ప్రతిచర్యగా పేదరికపు విషఫలాలు శ్రామి కులు భరిస్తుంటారు. ఎంత సర్ధిచెప్పుకున్నా ఈ సత్యం మాత్రం దాగదు గాక దాగదు. కావాలంటే ఈ లెక్కలు చూ డండి. మొత్తం దేశ సంపదలో నలభైశాతం కేవలం ఒక్క శాతం అపరకుబేరుల (శతకోటీశ్వరులు- బిలియనీర్స్‌) చెంతనే ఉన్నది. దిగువనున్న 50 శాతం పేదల వద్ద 15 శాతం జాతీయాదాయం మాత్రమే ఉంటున్నది. తత్‌ ఫలితంగా దాదాపు 23 కోట్లమంది కటిక దరిద్రులు మన దేశంలో పేరుకుపోయారు. ప్రపంచంలో అత్యంత అసమానతలు గల దేశంగా మన భారత్‌ గణతి కెక్కింది. ఈ పరిణామం మన రాజ్యాంగ స్పూర్తికి విరుద్ధం. రాజ్యాంగ ప్రవేశికలో మన దేశాన్ని సామ్యవాద దేశంగా ప్రకటించుకున్నాం. ఆదేశిక సూత్రాల్లోని ఆర్టికల్‌ 39, సంపద కేంద్రీకరణ కాకుండా చూడాలని తెలిపింది.
సంపద కేంద్రీకరణపై తాజాగా ‘ప్రపంచ అసమానతల ప్రయోగశాల’, ‘ఐక్యరాజ్య సమితి అభివృద్ధి సంస్థ’ సంయుక్తంగా విడు దల చేసిన నివేదిక ఈ విషయాన్ని బట్టబయలు చేసింది. దిగువనున్న 50 శాతంలోని పేదల తలసరి ఆదాయం మొదటి పదిశాతంలో ఉన్న సంపన్నుల తలసరి ఆదాయం కంటే 20 రెట్లు తక్కువగా ఉన్నదని తెలిపింది. సంపదను సృష్టించే అధిక శాతం శ్రామికవర్గం వద్దకు సంపద చేరడం లేదని చెప్పకనే చెప్పింది.
బ్రిటీష్‌ పాలనా కాలంలో మొదటి పదిశాతం సంపన్నుల వద్ద 50 శాతం సంపద పోగుపడి ఉన్నది. స్వాతంత్య్రానంతరం అప్పటి ప్రధాని నెహ్రూ ప్రభుత్వం సోషలిస్టు రష్యా స్పూర్తితో పంచవర్ష ప్రణాళికలు ప్రవేశ పెట్టింది. ఫలితంగా కొంతలో కొంత సంపద కేంద్రీకరణ 50 నుండి 35 శాతానికి తగ్గింది. కానీ 1990 నుంచి అమలైన నూతన ఆర్థిక విధానాలు (సరళీకరణ, ప్రయివేటీకరణ, ప్రపంచీకరణ- ఎల్‌.పి. జి) వలన అసమానతలు తగ్గడం కాదు కదా తీవ్రమ వడం మొదలైనాయి. ఈ విధానాలతోనే బిలియనర్‌ల సంపద అమాంతంగా పెరిగింది. పేదల, మధ్య తరగతి ఆదాయా లకు గండిపడింది. చివరకు దిగువ 50 శాతం ప్రజానీకం వద్ద కేవలం ఆరుశాతం సంపద మాత్రమే మిగిలింది.పైనున్న మొదటి పది శాతం సంపన్నుల వద్ద 65 శాతం సంపద పోగుపడింది. మొదటి ఒక్కశాతం బిలియనీర్లవద్దనే 33 శాతం సంపద పోగు పడింది. లాకులు ఎత్తేసినట్టు సిరి అంతా కుబేరుల చెంతకు చేరింది.
అలాగే గతేడాది ఆక్స్‌ఫామ్‌ నివేదిక మొదటి 30శాతం సంపన్నుల వద్దనే 90 శాతం సంపద పోగుపడినట్టు తెలిపింది. 2020లో బిలియనీర్లు 102 మంది ఉంటే 2022 నాటికి ఆ సంఖ్య 166కు చేరుకుంది. మొదటి వంద మంది బిలియనీర్ల సంపద లెక్కవేస్తే 54.12 లక్షల కోట్లు అని తేలింది. మొదటి పదిమంది బిలియనీర్ల సంపద 27.52 లక్షల కోట్లు. 2021 వచ్చే సరికి ఒక ఏడాదిలో ఈ బిలియనీర్ల సంపద 32.8 శాతం పెరిగింది. ఇంతింతై, వటుడింతై అన్నట్టు ఈ సంపద ఇలా కొండలా పెరిగిపోవడం పట్ల ఆర్థిక వేత్తలు ఇప్పుడు గుండెలు బాదు కుంటున్నారు. విరుగుడుగా ఈ సంపన్నులపై అధిక పన్నులు వేసి ఆ వచ్చిన ఆదాయంతో ప్రభుత్వం విద్య- వైద్య- ఉపాధి రంగాలను మెరుగుపర్చాలని సూచిస్తున్నారు.చెవిటివాని ముందు శంఖం ఊదినట్టున్నది ఈ తంతు. పాలకులు తత్‌విరుద్దంగా కార్పోరేట్లకే రాయితీలు ఇవ్వడం, ప్రభుత్వ సంస్థలను కారుచౌకగా కట్టబెట్టడం మనం గమనిస్తున్నాం. మరో పక్క ప్రజలపై మోయలేని పన్నుల భారాన్ని వేయడాన్ని కూడా చూస్తున్నాం.
ప్రజల నిత్య జీవితంలో భాగమైన పెట్రోల్‌, డీజిల్‌, వంటగ్యాస్‌పౖౖె ఎక్సైజ్‌ సుంకం పెంచి 2014-15లో రూ. 99 వేల కోట్లు ప్రభుత్వం ఆర్జిస్తే, 2021కి ఆ సుంకం 3 లక్షల 73 వేల కోట్లకు చేరింది. ప్రధాని మోడీ ప్రభు త్వం చలవ- పెట్రోల్‌ 79 శాతం, డీజిల్‌ 101 శాతం, వంటగ్యాస్‌ 30 శాతం పెరగడం ప్రజల అనుభవంలోకి వచ్చి ంది. శ్రమజీవుల సంపాదనలో అధిక భాగం ఇలా ప్రభుత్వ సుంకాలకు పోతుంటే ఇంక చెప్పేదేముంది? విష యం ఏమిటంటే దిగువనున్న 50 శాతం కష్టజీవులు, పైనున్న పదిశాతం సంపన్నుల కంటే ఆరురెట్లు ఎక్కువ ఈ సుంకాలు చెల్లిస్తున్నారు. ఆహార, ఆహారేతర ఉత్పత్తులపై వసూలయ్యే పన్నుల మొత్తంలో 64.3 శాతం ఈ దిగువ నున్న 50 శాతం పేదలే చెల్లిస్తున్నారు. మొత్తం జీఎస్టీ (వస్తు సేవల పన్ను)లో మూడింట రెండింతలు ఈ పేదలు చెల్లిస్తుంటే పైనున్న పదిశాతం సంపన్నులు చెల్లించేది కేవలం 3-4 శాతం మాత్రమే. పన్నుల విధాన రూపకల్పనే మోడీ ప్రభుత్వం అలా చేసింది. అలాంటప్పుడు ఇది ప్రజాప్రభుత్వమంటే విషయం తెలిసినవారు ఎందుకు నమ్ముతారు? ఎందుకు నమ్మాలి?
కాగా, మన దేశంలో ప్రతి ఏటా పదిహేడు లక్షల మంది పేదలు సరైన తిండి దొరక్క, ఆకలితోనూ, పౌష్టి కాహారలేమితోనూ మరణిస్తున్నారు. బిలియనీర్లపె మూడు శాతం అధికంగా పన్నువేస్తే చాలు. ఆ వచ్చే ఆదాయంలో జాతీయ ఆరోగ్య పథకానికి మూడేండ్లకు సంపద నిధులు సమకూర్చుకోవచ్చట. మొదటి పదిశాతం సంపన్నులపై ఐదు శాతం అధిక పన్ను వేస్తే ఆ వచ్చే ఆదాయంతో ఐదేండ్లపాటు దేశంలోని ఆదివాసులందరికీ చక్కటి ఆరోగ్యాన్ని అందించవచ్చట. అంతెందుకు మొదటి పదిమంది బిలియనీర్లపై ఒక శాతం పన్ను వేసినా, ఆ ఆదాయంతో పద మూడేండ్ల పాటు ప్రాథమిక పాఠశాలలన్నింటా ఉపాధ్యాయ ఖాళీలు నింపి పిల్లలకు నాణ్యమైన విద్య నందించవచ్చు. ఉపాధిరంగ వృద్ధితో పాటు ప్రజల జీవన ప్రమాణాలు మెరుగవుతాయి. కానీ, ఈ ప్రభుత్వం అలా చేయదు. ఎందు కంటే ఇది పక్కా కార్పోరేట్ల ప్రభుత్వం గనుక. అందుకే కార్పోరేట్‌ పన్నులు 30 నుంచి 22 శాతానికి తగ్గించింది.14.5 లక్షల కోట్ల రుణాలను (కార్పోరేట్లవి) ఏకపక్షంగా రద్దు చేసింది.
‘నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు’ అన్న చందాన ఈ ప్రభుత్వం కార్పోరేటర్లతో అలా చెట్టాపట్టాలేసుకు తిరుగు తుంటే సామాన్య ప్రజలగోడు ఎలా వినగలదు? తొండ ముదిరి ఊసరివెల్లి అవుతున్నట్టు, ఇదంతా రాజకీయ అవినీతిగా చెలామణి అవుతున్నది. ఎన్నికల బాండ్ల రూపంలో ఎలా బయటపడిందో మచ్చుకు కొంత మాత్రమే చూడ గలి గాము. కానీ నల్లధనంగా ప్రజల శ్రమశక్తి ఎంతగా పోగుపడుతున్నదో అంతు చిక్కడం లేదు. మరో విషయం, కుడి ఎడమలుగా మన దేశానికి పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌లు ఉన్నాయి.
బంగ్లాదేశ్‌ ప్రభుత్వం ఉన్నంతలో ప్రజా సంక్షేమానికి, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల వృద్ధికి ప్రాధాన్యతనిస్తుంటే, పాకిస్తాన్‌ సైనిక చర్యలకు, ఆయుధ వినియోగాలకు అమితంగా పాల్పడుతన్నది. బంగ్లాదేశ్‌ తలసరి ఆదాయం 2,646 డాలర్లు ఉంటే, పాకిస్తాన్‌ తలసరి ఆదాయంగా 1,471 డాలర్లకు ఘోరంగా దిగజారింది. కాగా భారత్‌ తలసరి ఆదాయం బంగ్లాదేశ్‌ కన్నా తక్కువ అవడం (2,612 డాలర్లు) గమనార్హం. అంటే మనం పాకిస్తాన్‌ దిశగా నడుస్తున్నామా…? అనే భయం వెంటాడు తున్నది. ఇలాంటి నేపథ్యంలో భారత్‌ తృతీయ శక్తిగా ఎదిగితే ఎవరకు గొప్ప? ప్రజల శ్రమశక్తి సంపదంతా కుబేరుల పరమవుతున్నప్పుడు కష్టజీవులకు ఒరిగేదేముంది. నిష్ట దరిద్రం తప్ప.’ఎవరి కష్టఫలితం వారికి దక్కేలా చూడటమే సరైన ప్రభుత్వ లక్ష్యం’ అన్న అబ్రహంలింకన్‌ మాటలకు మన ప్రభుత్వ చేతలకు పొంతనే లేకుండా ఉన్నది కదూ…
కె.శాంతారావు, 9959745723