నవతెలంగాణ-మంగపేట
మండల కేంద్రంలో వరదలకు పలు ప్రభుత్వ కార్యాలయాలు నీట మునగగా గౌరారం వాగు ఉప్పొంగడంతో సమీపంలోని మిరప నారుమల్లు మునిగిపోయి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. మండల కేంద్రానికి ఎగువన ఉన్న అటవీ ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలకు వరదనీరు పొంగి మండల కేంద్రం వైపు రావడంతో రైతువేధిక(వ్యవసాయశాఖ కార్యాలయం) నీట మునిగింది. అదే విధంగా రైతువేధిక ఎదురుగా ఉన్న మంగపేట-ఏటూరునాగారం ప్రధాన రహదారి సైతం వరదకు పూర్తిగా కొట్టుకునిపోయి గండిపడి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. గౌరారం వాగు పాత బ్రిడ్జీ కొత్త బ్రిడ్జీల సమీపంలో రైతులు పోసిన మిరప నారుమల్లు సైతం నీట మునగడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. సుమారు 50 ఎకరాల్లోని కింటాన్నర మిరప గింజలు ఇటీవలే రైతులు నారుమల్లు పోయగా గౌరారంవాగు పొంగి నారుమల్ల మునగడంతో పూర్తిగా పాడైపోయి వంద మంది రైతులకు చెందిన సుమారు కోటిన్నర రూపాయల నష్టం వాటిల్లిందని రైతులు వాపోయారు. ప్రభుత్వం రెవిన్యూ హార్టీకల్చర్ అధికారులతో జాయింట్ సర్వే చేయించి తమను ఆదుకోవాలని లేకుంటే చావే శరణ్యమని వాపోయారు.