నశీర్‌ అహ్మద్‌ ‘మాగ్నాకార్టా’ ”భారత స్వాతంత్రోద్యమం : తెలంగాణ ముస్లిం యోధులు”

సయ్యద్‌ నశీర్‌ అహ్మద్‌ కలం నుండి వెలువడిన ”భారత స్వాతంత్య్రోద్యమం-తెలంగాణ ముస్లిం యోధులు”అనే 352 పుటల గ్రంథాన్ని ప్రచురించారు. మధ్య యుగాల చరిత్ర గురించి ప్రముఖ చరిత్ర పరిశోధకుడు డాక్టర్‌ రామ్‌ పునియాని, స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న ముస్లింవీరుల గురించి సయ్యద్‌ నశీర్‌ అహ్మద్‌ సాధికారికంగా చెప్పగలరన్నారు. ప్రత్యేకంగా ఈ పుస్తకం తెలంగాణ సమాజం నుండి వచ్చిన వారైనా, ఇతరత్రా వేరే ప్రాంతాల నుండి ఇక్కడకు వచ్చి ఇదే తమ మాతృభూమిగా భావించిన వందలాది ముస్లిం యోధులను మనకు పరిచయం చేసింది. ఆ యోధులు హిందువులైనా, ముస్లింలైనా వారి జ్ఞాప కాలు నేటి తరానికి అందుబాటులో తేవడం పుస్తకం ప్రత్యేకత. తెలంగాణకు సంబంధించినంత వరకు ఈ పుస్తకం ఆ కొరత తీర్చింది. నశీర్‌ అహ్మద్‌ ఈ పుస్తకంలో ముస్లిం వీరులకే పరిమితం కాకుండా ఆయా ఉద్యమాల్లో పాల్గొన్న అనేకమంది హిందూ వీరులను కూడా మనకు పరిచయం చేశారు.
స్వతంత్ర భారతావని చరిత్రలో ముస్లింవీరుల పాత్రకు సరైన ప్రాధాన్యత, గౌరవం దక్కలేదన్న భావం నశీర్‌కుండేది. ఈ విషయంలో వామపక్షాలు, వామపక్షవాదులు కూడా నిర్లక్ష్య వైఖరినే ప్రదర్శించాయని అతను భావించేవాడు. కాంగ్రెస్‌ పార్టీ వంటి లౌకిక పార్టీలన్నీ ముస్లిం సమాజాన్ని ఓటు బ్యాంకుగా పరిగణించటం మొదలు పెట్టాయని భావించాడు. ఇది మెజారిటీ హిందూ సమాజానికి తామే అధినాధులమని చెప్పుకునే ఆరెస్సెస్‌ పరివారానికి అందివచ్చిన అవకాశమైంది. ముస్లిం సమాజం ఆర్థిక స్థితిగతుల మీద, వారి విద్య, ఉపాధి కల్పన మీద ప్రభుత్వ ఉద్యోగాల్లో వారి ప్రవేశం మొదలగు విషయాలను పరిశీలించి వారి పురోభివృద్ధి కోసం తగు సూచనలు చేయడానికి సచార్‌ కమిటీని ఆనాటి కేంద్ర ప్రభుత్వం నియమించింది. కమిటీ రిపోర్టు ప్రకారం కొన్ని రంగాల్లో ముఖ్యంగా, ప్రభుత్వ ఉద్యోగాలలో, ముస్లిం సమాజం దళిత వర్గాల కన్నా వెనుకబడి ఉండటం గమనంలోకి తీసుకోవాలి. విద్య తదితర రంగాలలో కూడా పూర్తి వెనుకబాటుకు గురయ్యారని ఆ నివేదిక పేర్కొంది.
ఈ నేపథ్యంలో నశీర్‌ అహమ్మద్‌కు ముస్లింలలో ఎందరో యోధులు స్వాతంత్య్ర సంగ్రామంలో తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి పోరాడిన విషయాలు ‘టైం మిషన్‌’లోలా కండ్లముందు కదలాడింది. అది అతనిని భారత స్వాతంత్య్ర సంగ్రామ చరిత్ర రచనకు, అందులో ముస్లిం సమాజం చేసిన అసమాన పోరాటాలు, త్యాగాల గురించి రాయడానికి పురికొల్పింది. కొందరు వ్యక్తులు ఒక సమూహంగా లేదా ఆర్థిక, అంగబలమున్న పెద్ద పెద్ద పరిశోధనా/ ప్రచురణ సంస్థలో లేదా విశ్వవిద్యాలయాలలోని చరిత్ర పరిశోధనా విభాగాలో చేయాల్సిన పనిని ఒక్కడే తలకెత్తుకున్నాడు. అతని కుటుంబ ఆర్థిక వనరులు అంతంత మాత్రమే అయినా వెరవలేదు. ఒకసారి తన గమ్యం నిర్ణయించుకున్న తరువాత వెనుతిరిగి చూడలేదు. ఎంత శ్రమకైనా ఓర్చుకున్నాడు. అంతటి కఠోర ధీక్షతో మరుగున పడిన ఎందరో వీరులను మన కండ్లముందు సాక్షాత్కారింపజేసాడు. పలు సంస్థలు, జర్నలిస్టు మిత్రుల సహకారంతో, సహాయంతో ఆ మహానుభావుల వందలాది ఊహ చిత్రాలను సేకరించి మనకు అందించాడు. ఈ విషయ సేకరణ, పుస్తక ప్రచురణ ఒక ఎత్తు అయితే వాటిని ప్రజలకు పరిచయం చేయడంలో కూడా ఒక విధంగా ఒంటరి పోరాటమే చేసాడు. పుస్తక ప్రదర్శనలు, సమయోధుల చిత్రపటాల ప్రదర్శనలు, సెమినార్‌లు, సభలు, సమావేశాలు ఒకటేమిటి అన్ని మార్గాల్లో ఆ రచనలను భారతదేశంలోనే కాదు, విదేశాలలోని ప్రజల వద్దకు తీసుకెళ్లాడు. భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలలోని ప్రధాన నగరాల్లో ఏదో ఒక కార్యక్రమం నిర్వహించి భారత స్వాతంత్య్ర సంగ్రామం చరిత్రను, చారిత్రక సంఘటనలను, అందులో ముస్లిం వీరుల ఘన చరిత్రను ప్రస్తుత తరానికి పరిచయం చేశాడు, చేస్తున్నాడు.
ఇప్పటివరకు భారత స్వాతంత్య్ర పోరాటంలో ముస్లింల పాత్ర గురించి దాదాపు 24 పుస్తకాల వరకు మనకు అందించారు. ఈ గ్రంథాలు చాలావరకు ఆంగ్లం, హిందీ, ఉర్దూ, తమిళం, గుజరాతీ, కన్నడం భాషల్లో అనువదించబడి ప్రచురితమయ్యాయి. ఈ గ్రంథాలు చదివితే ముస్లిం సమాజం నుండి ఎందరు వీరులు మన దేశ స్వాతంత్య్రం కోసం తమ ప్రాణాలను తృణప్రాయంగా అర్పించారో మనకు అర్థం అవుతుంది. ఇదే సమయంలో ఇంకో విషయం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు తామే దేశ భక్తులం మిగతా వారంతా దేశ ద్రోహులు అని రోజూ అబద్ధ ప్రచారాలతో ఊదరగొట్టే సంఘ్ పరివార్‌ స్వతంత్ర పోరాటంలో ఏ ఒక్కరోజు, ఏ ఒక్క నిమిషం పాల్గొనలేదు. అయినా వర్తమాన భారతంలో పరివారం నాయకులు ప్రజలను మతం మత్తులో ముంచి హేతుబద్ధ ఆలోచనలకు ఆస్కారం లేకుండా చేస్తున్నారు. దీనికి తోడు ప్రజలను కులాల వారిగా, ప్రాంతాల వారీగా విడదీసి తమలో తాము కొట్లాడుకునేలా చేస్తున్నారు. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో కుల మత ప్రాంతీయతత్వాలకు అతీతంగా యువతను చైతన్యపరిచేందుకు వాస్తవ చారిత్రక పరిస్థితు లను ప్రజానీకానికి తెలియ పరిచేందుకు నశీర్‌ రచనలు తోడ్పడతాయనడంలో ఎటువంటి సందేహంలేదు. ఈ రోజు రెండు తెలుగు రాష్ట్రాలలోనే కాదు యావత్‌ భారతదేశంలో కూడా మాతృభూమి విముక్తి కోసం సాగిన స్వాతంత్య్ర పోరాటంలో కాని, అన్యాయానికి వ్యతిరేకంగా జరిగిన వందలాది పోరాటాలలో పాల్గొన్న లక్షలాది ముస్లిం వీరుల గురించి గానీ, సాధికారికంగా ఆధారాలతో సహా చెప్పగల వ్యక్తి అనుకోవచ్చు.
”భారత స్వాతంత్రోద్యమం-తెలంగాణ ముస్లిం యోధులు” పుస్తకం గురించి. బీజ రూపంలో ఇంతకు ముందు రాసిన తన పుస్తకాలలో తెలంగాణా ముస్లిం యోధులలో కొందరి గురించి నశీర్‌ అహమ్మద్‌ ప్రస్తావించారు. స్వాతంత్య్రానికి పూర్వం భారత దేశం బ్రిటిష్‌ ఇండియాగా, స్థానిక సంస్థానాలుగా విభజించబడి విభిన్న రాజుల ఏలుబడిలో ఉన్నది. కొన్ని సంస్థానాలు హిందూ రాజుల ఏలుబడిలో, మరికొన్ని సంస్థానాలు ముస్లిం రాజుల ఏలుబడిలో ఉన్నాయి. అప్పటి హైదరాబాద్‌ సంస్థానం (రాజ్యం) ముస్లిం నవాబైన మీర్‌ ఉస్మాన్‌ అలీ ఖాన్‌ ఆధీనంలో ఉంది. ఇది స్వాతంత్ర పూర్వ భారత దేశంలో అతి పెద్ద సంస్థానం. ఆసఫ్‌ జాహి వంశీయులు హైదరాబాద్‌ రాజ్యాన్ని 1724 లో ఏర్పాటు చేసిన తర్వాత భారతదేశంలో అతి పెద్ద సంస్థానంగా అవతరించింది. ఆ తరువాత కాలంలో ఈస్టిండియా కంపెనీ అధికారం బాగా స్థిరపడుతున్న కాలంలో అధికారంలోకి వచ్చిన నిజాం వంశపు రాజులు రకరకాల రాజీల కింద శ్రీకాకుళం నుండి గుంటూరు వరకు, ఆ తర్వాత దత్తమండలంగా ప్రసిద్ధిచెందిన బళ్లారి జిల్లాతో సహా ఇప్పటి రాయలసీమను బ్రిటిష్‌ వారికి ధారాదత్తం చేశారు. అదే సందర్బంలో బ్రిటిష్‌ వారికి నమ్మకమైన మిత్రులుగా నిజాం నవాబులు రూపాంతరం చెందారు. స్వాతంత్య్ర ఉద్యమగాలులు భారతదేశమంతా ఉధృతంగా వీస్తున్నాయి. అవి సంస్థానాల ప్రజలను కూడా ప్రభావితం చేయడం మొదలుపెట్టాయి. నిజాం లొంగుబాటు విధానాలకు వ్యతిరేకంగా కులమతాలకతీతంగా హిందూ ముస్లింలు సమైక్యంగా ఉద్యమించిన చరిత్రను, అందులో కొందరు రాజ కటుంబీకులు కూడా పాల్గొని ధీర్ఘకాలం ఖైధీలుగా బంధించబడిన చరిత్రను నశీర్‌ ఈతరానికి తెలియజేయడం అభినందనీయం.
మరీ ముఖ్యంగా నిజాం దర్బార్‌లో పనిచేస్తున్న నూరల్‌ ఉమ్రా బహదూర్‌, రాజ కుటుంబీకుడైన మీర్‌ గోహర్‌ అలీఖాన్‌, బ్రిటిష్‌ రెసిడెంట్‌ మీద సాహసోపేతమైన దాడి చేసిన పఠాన్‌ తుర్రేబాజ్‌ ఖాన్‌ లాంటి త్యాగధనుల చరిత్ర నేటితరం తెలుసుకోవాలి. ఈ తుర్రేబాజ్‌ ఖాన్‌ సాహసోపేతమైన చర్య కారణంగానే ఇప్పటికీ ”నువ్వేమైనా తురుంఖాన్‌ వా” అనే నానుడి తెలంగాణ ప్రజల నోళ్లలో నానుతూ ఉంది. వీరే కాకుండా స్వాతంత్య్ర పోరాటంలో చురుకుగా పాల్గొన్న సయ్యద్‌ బద్రుల్‌ హసన్‌, మరో నెల రోజుల్లో హైదరాబాద్‌ సంస్థానం భారతదేశంలో విలీనం కావడానికి ముందు రజాకార్‌ మూకల క్రూరమైన దాడిలో మృతి చెందిన ‘ఇమ్రోజ్‌’ ఉర్దూ దినపత్రిక ప్రచురణకర్త, సంపాదకులు షోయబుల్లాఖాన్‌ చరిత్రను మరోసారి గుర్తు చేశారు. సంస్థానంలో జరిగిన బ్రిటిష్‌ వ్యతిరేక ఉద్యమం కానీ, స్వతంత్ర భారతదేశంలో హైదరాబాద్‌ సంస్థానం విలీనం కొరకు జరిగిన ఉద్యమం కానీ, భూమి కొరకు, భుక్తి కొరకు, వెట్టి చాకిరీ విముక్తి కొరకు, జమీందార్ల, జాగీర్‌ దారుల పీడనకు వ్యతిరేకంగా కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో జరిగిన సాయుధ రైతాంగ పోరాటంలో కానీ కుల మతాల ప్రసక్తి లేకుండా అందరు భుజం భుజం కలిపి పోరాడిన సంగతిని సోదాహరణంగా తెలిపారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌ సంస్థానంలో రాజు ముస్లిం మతానికి చెందిన వాడనే విషయం పరిగణనలోకి తీసుకుంటే కానీ మనకు న్యాయం కోసం, స్వాతంత్య్రం కోసం ముస్లిం వీరుల త్యాగాలు అర్థం కావు. కట్టుకథలు, పుకార్లు రాజ్యమేలుతున్న నేటి కలుషిత వాతావరణంలో ”భారత స్వాంత్య్రోద్యమం: తెలంగాణ ముస్లిం యోధులు” చరిత్ర పుస్తకం రావడం ముదావహం.ఈ పుస్తకాన్ని ముఖ్యంగా హిందూ,ముస్లిం తారతమ్యం లేకుండా యువకులంతా చదివి చరిత్రను సరైన రీతిలో అర్థం చేసుకోవాలి.

– ప్రతాపనేని రామ కోటేశ్వరరావు
సెల్‌ : 9490300280