నస్రత్‌ శరణార్థి శిబిరంపై దాడి

Nasrat refugee camp attacked– ఐదుగురు చిన్నారులతో సహా 17మంది మృతి
– 20వ రోజుకు చేరిన ఉత్తర గాజా దిగ్బంధనం
– ఆక్రమణలను అడ్డుకుంటాం : హమాస్‌
– బీరుట్‌పై వరుస దాడులు
– హిజ్బుల్లా ఆయుధ ఫ్యాక్టరీలే లక్ష్యమన్న ఇజ్రాయిల్‌
గాజా, బీరుట్‌ : గాజాలోని నుస్రత్‌ శరణార్ధ శిబిరంపై ఇజ్రాయిల్‌ జరిపిన దాడిలో 11నెలల చిన్నారితో సహా 17మంది పాలస్తీనియన్లు మరణించారు. 32మంది గాయపడ్డారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా వుంది. నస్రత్‌లోని పాఠశాలలన్నీ వేలాదిమంది నిర్వాసితులకు ఆవాస కేంద్రాలుగా మారిపోయాయి. మహిళలు, పిల్లా పాపలతో కిక్కిరిసిపోయిన ఆ శిబిరాలను కూడా ఇజ్రాయిల్‌ బలగాలు వదిలిపెట్టడం లేదు. మృతుల్లో ఐదుగురు పిల్లలు, ఇద్దరు మహిళలు వున్నారు. నిర్వాసిత కుటుంబాలు తలదాచుకున్న స్కూళ్లను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయిల్‌ దాడులు జరపడం ఇదే మొదటిసారి కాదు. వారికి అవసరమైన చికిత్సనందించడానికి కావాల్సిన మందులు, ఇతర వైద్య సరఫరాలు కూడా సరిగా లేవు. ఈ పరిస్థితుల్లో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశాలు వున్నాయని ఆందోళన చెందుతున్నారు. స్థానిక మార్కెట్‌కు సమీపంలో వుండే ఈ స్కూలుపై ఒక క్షిపణి కన్నా ఎక్కువే ప్రయోగించినట్లు తెలుస్తోంది.
ఇదిలావుండగా, ఉత్తర గాజా దిగ్బంధనం 20వ రోజుకు చేరింది. జాబాలియా శరణార్ధ శిబింపై జరిగిన సైనిక దాడిలో ఇప్పటివరకు 770మంది పాలస్తీనియన్లు మరణించగా, వెయ్యి మందికి పైగా గాయపడ్డారని గాజా ప్రభుత్వ మీడియా కార్యాలయం తెలిపింది. ఇప్పటివరకు గాజా మృతుల సంఖ్య 42,847కి చేరగా, గాయపడిన వారి సంఖ్య 1,00,544కి చేరింది.
జాతి నిర్మూలన ప్రణాళికను భగం చేస్తాం : హమాస్‌
ఉత్తర గాజా నుండి పాలస్తీనియన్లను మొత్తంగా తుడిచిపెట్టాలన్న ఇజ్రాయిల్‌ జనరల్స్‌ ప్రణాళికలను భగం చేస్తామని హమాస్‌ పేర్కొంది. పాలస్తీనియన్ల జాతిని నిర్మూలించేందుకు చేపట్టిన ఈ దాడులను, అందులో భాగంగా ఆక్రమణలను అమలు చేయాలన్న వారి పథకాలను అమలు కానివ్వబోమని స్పష్టం చేసింది. ఈ దిశగా ఇప్పటికే ఉధృతంగా రాజకీయ, దౌత్య ప్రచారాలను నాయకత్వం చేపట్టినట్లు హమాస్‌ ఒక ప్రకటనలో తెలిపింది. టర్కీ, కతార్‌, రష్యాల్లో తమ నాయకత్వం పర్యటిస్తోందని, ఈజిప్ట్‌, ఇరాన్‌ నాయకత్వంతో, ఐక్యరాజ్యసమితి ప్రతినిధులతో కూడా మాట్లాడుతున్నామని పేర్కొంది. మరోవైపు గాజా కాల్పుల విరమణ కోసం తాజా ప్రయత్నాల్లో భాగంగా అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌ కతార్‌ అమీర్‌ షేక్‌ తమిన్‌ బిన్‌ హమద్‌తో భేటీ అయ్యారు.
బీరుట్‌ శివార్లలో 17కి పైగా వరుస దాడులు
మరోవైపు బీరుట్‌లోని దక్షిణ శివార్లలో బుధవారం రాత్రంతా 17కి పైగా వరుస దాడులు జరిగాయి. ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా ప్రారంభమైన ఈ దాడుల్లో ఆరు భవనాలు నేలమట్టమయ్యాయి. ఒకరు మరణించారని, ఐదుగురు గాయపడ్డారని లెబనాన్‌ ఆరోగ్య శాఖ వెల్లడించింది. హిజ్బుల్లాకు గట్టి పట్టు వున్న దక్షిణ బీరుట్‌లో పలు ఆయుధ ఫ్యాక్టరీలపై దాడులు చేసినట్లు ఇజ్రాయిల్‌ మిలటరీ గురువారం వెల్లడించింది. నిఘా వర్గాల సమాచారం మేరకే తాము ఆయుధ నిల్వల కేంద్రాలు, తయారీ కేంద్రాలపై దాడి చేశామని తెలిపింది.
లెబనాన్‌కు ఫ్రాన్స్‌ సాయం
లెబనాన్‌కు మద్దతుగా 10.8కోట్ల డాలర్ల సహాయ ప్యాకేజీని అందిస్తామని ఫ్రాన్స్‌ హామీ ఇచ్చింది. దాడుల కారణంగా అక్కడ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందని, తక్షణావసరంగా ప్రజలకు పెద్ద ఎత్తున సాయమందించాల్సి వుందని ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మాక్రాన్‌ తెలిపారు. పారిస్‌లో గురువారం లెబనాన్‌పై అంతర్జాతీయ సదస్సు జరిగింది. ఆ సదస్సులో మాక్రాన్‌ సాయంపై ప్రకటన చేశారు. ఇప్పటికే ఇటలీ, జర్మనీలు సాయాన్ని ప్రకటించాయి. లెబనాన్‌ సార్వభౌమాధికారాన్ని పునరుద్ధరించి, సంస్థలను మరింత బలోపేతానికి సాయపడాల్సిందిగా మాక్రాన్‌ కోరారు.