తక్కువ నీటి వినియోగానికి జాతీయ అవార్డు

తక్కువ నీటి వినియోగానికి జాతీయ అవార్డు– సింగరేణి థర్మల్‌ విద్యుత్కేంద్రానికి దక్కిన ఘనత
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
మంచిర్యాల జిల్లా జైపూర్‌లోని సింగరేణి థర్మల్‌ విద్యుత్కేంద్రానికి తక్కువ నీరు వినియోగించినందుకు జాతీయస్థాయిలో అత్యుత్తమ యూనిట్‌గా అరుదైన అవార్డు లభించింది. కౌన్సిల్‌ ఆఫ్‌ ఎన్విరో ఎక్సలెన్స్‌ ఆధ్వర్యంలో ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఈ అవార్డును సింగరేణి థర్మల్‌ విద్యుత్కేంద్రం ప్రతినిధులకు అందచేశారు. జాతీయస్థాయిలో 500 మెగావాట్లకు పైగా సామర్థ్యం కలిగిన దాదాపు 150 ప్రభుత్వ, ప్రయివేటురంగ విద్యుత్కేంద్రాలతో పోటీపడి సింగరేణి ఈ ఘనత సాధించినట్టు ఆ సంస్థ సీఎమ్‌డీ ఎన్‌ బలరాం, డైరెక్టర్‌ (ఈ అండ్‌ ఎం) డీ సత్యనారాయణరావు తెలిపారు. సాధారణంగా థర్మల్‌ విద్యుత్కేంద్రాల్లో ఒక గంటలో ఒక మెగావాట్‌ విద్యుదుత్పాదనకు గరిష్టంగా మూడు ఘనపు మీటర్ల నీటిని వినియోగించడాన్ని ప్రామాణికంగా సెంట్రల్‌ ఎలక్ట్రిసిటీ అథారిటీ సూచిస్తుంది. అయితే థర్మల్‌ కేంద్రాల్లో సహజంగా ఈ ప్రమాణాన్ని దాటే నీటి వినియోగం ఉంటుంది. కానీ సింగరేణి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం తీసుకున్న ప్రత్యేక చర్యలు, వినియోగిస్తున్న సాంకేతికత వల్ల ఒక గంటలో మెగావాట్‌ విద్యుదుత్పాదనకు నిర్దేశించిన ప్రమాణాల కన్నా తక్కువగా, 2.8 ఘనపు మీటర్ల నీటిని మాత్రమే వినియోగిస్తున్నది. దీనివల్లే ఈ కేటగిరిలో సింగరేణికి జాతీయస్థాయి అవార్డు లభించినట్టు వారు తెలిపారు. ఈ అవార్డును సింగరేణి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం తరఫున అధికారులు కే చంద్రలింగం, ఎల్‌జేవీ సుబ్బారావులు ఐఆర్‌ఈడీి మాజీ డైరెక్టర్‌ చేతుల మీదుగా అందుకున్నారు.