– 36వ జాతీయ పుస్తక ప్రాంగణానికి గద్దర్ పేరు
– బుక్ ఫెయిర్ అధ్యక్షులు జూలూరు గౌరీశంకర్
నవతెలంగాణ- జూబ్లీహిల్స్
హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియం (తెలంగాణ కళాభారతి)లో ఈ నెల 9 నుంచి 19 వరకు జరగనున్న జాతీయ పుస్తక పుస్తక ప్రదర్శనను విజయవంతం చేయాలని హైదరాబాద్ బుక్ ఫెయిర్ అధ్యక్షులు జూలూరు గౌరీశంకర్ అన్నారు. శనివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రపంచాన్ని మార్చగల శక్తి పుస్తకానికుందన్నారు. హైదరాబాద్ బుక్ ఫెయిర్ దశాబ్ద కాలంగా ముందుకు సాగుతోందన్నారు. జ్ఞానతెలంగాణ నిర్మాణానికి పుస్తక ప్రదర్శనలు ఒక మెట్టుగా ఉపయోగపడాలన్న ధ్యేయంతో ముందుకు సాగటం వల్ల పుస్తక ప్రదర్శనలు భారీగా విజయవంతం అవుతూ వస్తున్నాయన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక పదేండ్లుగా హైదరాబాద్ పుస్తక ప్రదర్శన టీమ్ వర్కుగా ముందుకు సాగటం వల్ల ఇది జాతీయ పుస్తక ప్రదర్శనగా రూపుదాల్చిందని చెప్పారు. తమ టీమ్‌కు గత రాష్ట్ర ప్రభుత్వమే కాకుండా ఇప్పటి ప్రభుత్వం కూడా సంపూర్ణంగా సహకరిస్తుందని చెప్పారు.
రాజకీయాలతో సంబంధం లేకుండా ఈ పుస్తక ప్రదర్శనలకు ప్రభుత్వం దగ్గర్నుంచి అన్ని రాజకీయ పార్టీలు, సంస్థలు, ప్రజాసంఘాలు, ప్రజలు అండదండగా నిలిచారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పుస్తక ప్రదర్శనలకు అండగా నిలిచి ఎన్టీఆర్ స్టేడియం కళాభారతి స్థలాన్ని 20 రోజులు ఉచితంగా ఇవ్వటం పెద్ద ప్రోత్సాహంగా ఉందన్నారు. దినపత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియాల సంపాదకులు, యాజమాన్యాలు, జర్నలిస్టులు సంపూర్ణ మద్దతు తెలిపి అండగా నిలిచారని వారికి ధన్యవాదాలు తెలియజేశారు. 36వ జాతీయ పుస్తక ప్రాంగణానికి ”గద్దర్ ప్రాంగణం”గా పేరు పెట్టామని, పుస్తక ప్రదర్శన వేదికకు ”రవ్వా శ్రీహరి” వేదికగా నామకరణం చేశామని తెలిపారు. అలాగే పుస్తక ప్రదర్శన ప్రాంగణంలో తెలంగాణ అమర వీరుల స్తూపాన్ని నెలకొల్పుతున్నామని చెప్పారు.
బుక్ ఫెయిర్ కార్యదర్శి ఆర్.శ్రీనివాస్ మాట్లాడుతూ.. కవులు, రచయితలను వెలుగులోకి తెచ్చే పనిని బుక్ ఫెయిర్ చేపట్టిందని, విస్తృత కవుల పేరు మీద వేదికలు, ప్రాంగణాలు పెడుతూ వస్తున్నామన్నారు. ఊరూరికి పుస్తకాన్ని తీసుకుపోయే పని చేపట్టామని, రొట్టమాకు రేవు నుంచి చిన్న పట్టణాలు వనపర్తి, కోదాడ, కామారెడ్డిలాంటి పట్టణాలకు విస్తరింపజేశామని తెలిపారు. పిల్లలకు, ఉపాధ్యాయులకు, జర్నలిస్టులకు ఉచిత ప్రవేశం కల్పిస్తున్నామన్నారు. ఈ సమావేశంలో బుక్ ఫెయిర్ ఉపాధ్యక్షులు నారాయణరెడ్డి, కోయ చంద్రమోహన్, కోశాధికారి పి.రాజేశ్వరరావు, సహాయ కార్యదర్శి శోభన్‌బాబు, కార్యవర్గ సభ్యులు కవి యాకూబ్, జనార్థన్ గుప్తా, బాల్‌రెడ్డి, శ్రీకాంత్, మాటూరి సూర్యనారాయణ, కిష్టారెడ్డి తదితరులు పాల్గొన్నారు.