
జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా జనవరి 19వ తేదీ నుండి 24వ తేదీ వరకు మండలంలోని అన్ని గ్రామాల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు ఐసీడీఎస్ భీంగల్ ప్రాజెక్టు మండల పర్యవేక్షకురాలు సరస్వతి తెలిపారు. సోమవారం మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో చదువుతున్న 8, 9, 10వ తరగతి విద్యార్థినిలతో బేటి పడావో బేటి బచావో కార్యక్రమంపై అవగాహన కల్పించి మాట్లాడారు. విద్యార్థినిలు ఉన్నత చదువులు చదువుకోవడం ద్వారా తమ కాళ్లపై తాము సగర్వంగా నిలబడవచ్చు అన్నారు. బాల్య వివాహాల వల్ల కలిగే దుష్పరిణామాలను వివరించారు. విద్యార్థినిలు శుభ్రతను పాటించడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు అన్నారు. అనంతరం విద్యార్థినిలతో భేటీ పడావో బేటీ బచావో పై ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం ప్రత్యేక అధికారిని గంగామణి కిశోర బాలికలతో సైన్స్ ఫెయిర్, ప్రదర్శనలు చేయించారు. ఈ కార్యక్రమంలో స్థానిక అంగన్వాడీ టీచర్లు యమున, బాలమణి, గంగా జమున,దివ్య, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం ఉపాధ్యాయులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.