ఘనంగా జాతీయ చేనేత దినోత్సవ వేడుకలు 

National Handloom Day celebrations– నేతన్న విగ్రహానికి పూలమాల వేసిన నేతన్నలు
నవతెలంగాణ – గంగాధర 
గంగాధర మండలం గర్శకుర్తి గ్రామంలో బుధవారం జాతీయ చేనేత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మండల పద్మశాలి సంఘం, వస్త్రోత్పతి వ్యాపారుల సంఘం, కార్మిక సంఘం ఆధ్వర్యంలో జాతీయ చేనేత దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. చేనేత పవర్ లూమ్స్ వస్త్ర పరిశ్రమకు ప్రభుత్వం గుడ్డ ఉత్పత్తి ఆర్డర్లు ఇవ్వాలని, కార్మికులకు చేతినిండా పనులు   కల్పించాలని డిమాండ్ చేస్తూ నేతకార్మికులు పలు నినాదాలు చేశారు. మండల పద్మశాలి సంఘం అధ్యక్షుడు బత్తిని సత్యనారాయణ, వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల ప్రసాద్, మండల ప్రధాన కార్యదర్శి చిందం రాజమౌళి, వస్త్రోత్పత్తి వ్యాపారుల సంఘం అధ్యక్షుడు అలువాల విఠోభ, ప్రధాన కార్యదర్శి అన్నల్ దాస్ శ్రీనివాస్, కార్మిక సంఘం అధ్యక్షుడు గడ్డం నారాయణ, కార్మికులు నేతన్న విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మండల పద్మశాలి సంఘం అధ్యక్షుడు బత్తిని సత్యనారాయణ, వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల ప్రసాద్ మాట్లాడుతూ నేతకార్మికుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు. గర్శకుర్తితోపాటు పలు గ్రామాల్లో ప్రభుత్వం గుడ్డ ఉత్పత్తికి ఆర్డర్లు ఇవ్వక, పనులు లేక కార్మికులు అనేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. గత ప్రభుత్వం తరహాలో ప్రభుత్వం వస్త్రోత్పత్తికి ఆర్డర్లు కల్పించి నేతకార్మికులను ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల, గ్రామ పద్మశాలి సంఘం నాయకులు లచ్చయ్య, నర్సయ్య, మల్లేశ్, గణేశ్, కార్మిక సంఘం నాయకులు, పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు.