నేషనల్‌ హైవే!

గ్రామాల్ని, నగరాల్ని
రాష్ట్రాల్ని, రాజధానుల్ని
సామాన్యుల్ని, రాజుల్ని
సంస్కతీ సంప్రదాయాలను
సమస్త అందాలను పూలమాలగా
ముడివేస్తుంది జాతీయ రహదారి!
ఏదైతేనేం నీ గమ్యం
జాతీయరహదారుల గుండా
ప్రయాణం ఎంతో రసరమ్యం
జాతీయ రహదారి గుండా
పాములనడకలా ఎన్నెన్ని మలుపులో
మనిషిమనిషిలో అన్ని పులకరింతలు…
ఎన్ని నదులు, ఎన్ని వారధులో…
ఎదల్లో అన్ని స్పందనా తరగల జలధులు
చినుకు మురళికి చిగురించిన ఎన్ని కోనలు కొండలో
వాటిపై దోబూచులాడే దోర ఎండలో
వేనవేల రాగాల ఎన్ని పూల వసంత ఋతువులో….
ఎన్నెన్నీ సజీవ సుందర శిల్పాలో….
అలా కథలు కథలుగా కళ్లముందర కదలాడుతుంటారు
భూముల్ని, భుక్తిని కోల్పోయిన అభాగ్యుల
అణగారిన జన వారసులుగా
శప్తమయ నిరుపేదజీవుల
ఎన్ని కన్నీటికావ్యాలో….
నువ్వు కనగలిగితే జాతీయ రహదారి గుండాను
ఎన్ని మైలు రాళ్ళు
ఎన్ని మైమరపించే ఎద పరవళ్ళో…
ఆద్యంతమూ ఆనందమూ, అద్భుతమూ…

జాతీయ రహదారి !
జడమౌన రాయబారి
చరితల, నవనాగరికతల గానమే కాదు
పొరుగు రాష్ట్ర ప్రజలను అనుసంధానమే కాదు
గహస్థవాసికి సంచారిగా మార్గం సుగమం చేస్తుంది
విసిగిన మనిషికి చిన్న తెరిపినిచ్చి బతికిస్తుంటుంది
విరిగిన మనసుని వీసమంత ఆశజిగురు పూసి అతికిస్తుంటుంది
లీటర్ల, కిలోమీటర్ల గుణకార భాగహారాలు
తలకెక్కి తైతక్కమాడితే
నీ ప్రాంతానికే కదా అంకితం ఆశల నీ శేషజీవితం
అది కాదన్ననాడే ఇక ఆరంభం
అసలైన జీవన సంరంభం
మజిలీ పట్ల ముత్యమంత అనురాగం
లవమైన బ్రతుక్కీ కించిత్‌ వేగం
మనసుకు ‘పారవశ్య’ మైలేజినిస్తాయి
జాతీయరహదారి గుండా నీ ప్రస్థానం మొదలైదంటే
అల నీ ఆనందలోక ద్వారాలు తెరుచుకన్నట్టు
ఇంత జ్ఞానానికి, ఇంత ఆనందానికి నువు దోసిలొగ్గినట్టు.

– రమేశ్‌ నల్లగొండ, 8309452179