నవతెలంగాణ – నార్సింగి
వాహన చోదకుల అతివేగం.. అజాగ్రత్త పలువురిని బలి తీసుకుంటున్న సంఘటనలు జాతీయ రహదారి 44పై కలవరపెడుతున్నాయి. ఒక దుర్ఘటన మారవకముందే మరొకటి జరుగు తోంది. అన్ని సంఘటనల్లో అతివేగం, నిర్లక్ష్యమే కనిపిస్తున్నాయి. మెదక్ జిల్లా నార్సింగి మండల శివారు గ్రామమైన వల్లూరు సమీపంలో ఆదివారం ఉదయం 7.30 ప్రాంతంలో ఆటోను కారు ఢకొీన్న దుర్ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఒకరు తీవ్రంగా గాయపడి కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నారు. ఒకరికి స్వల్పంగా గాయాలయ్యాయి.
నార్సింగి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…
నిజామాబాద్ జిల్లా ఆలూరు గ్రామం నుంచి గజ్వేల్ మండలం జగదేవపూర్‌లో బంధువుల దశదినకర్మకు జాతీయ రహదారిపై ఆటోలో ప్రయాణిస్తుండగా, వల్లూరు గ్రామ శివారుకు సమీపంలో వెనుక వైపు నుంచి అతివేగంగా వచ్చిన కారు వీరు ప్రయాణిస్తున్న ఆటోను ఢకొీట్టింది. వేగంగా ఢకొీట్టడంతో ఆటో రోడ్డు పక్కకు ఎగిరి పడటంతో వారంతా చెల్లాచెదురుగా పడిపోయారు. ఆటోలో ప్రయాణిస్తున్న ఇప్ప శేఖర్(45), ఇప్ప యశ్వంత్(9), గుంటక బాల నరసయ్య(70), గుంటక మణెమ్మ(62) తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందారు. అవినాష్‌కు స్వల్ప గాయాలు కాగా, కవిత తీవ్ర గాయాలతో ప్రాణాపాయ స్థితిలో ఉంది. పోలీసులు వారిని రామాయంపేట ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యం కోసం చేర్పించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం రామాయంపేట ఆస్పత్రికి తరలించారు. కారు డ్రైవర్ శ్రీనివాస్‌ను అదుపులో తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు నార్సింగి ఎస్‌ఐ నర్సింలు తెలిపారు.