ఆచార్య సంకసాల మల్లేశ్ (వి.సి.శాతవాహన) చక్కటి ముందు మాట రాశారు. జనవరి 1వ తేది నుండి డిసెంబర్ 31 వరకు నిర్వహించే జాతీయ, అంతర్జాతీయ వేడుకలు, ఉత్సవాలు, ఆయా తేదీల ప్రాధాన్యత చక్కటి వ్యాస రూపంలో విశ్లేషిస్తూ చక్కగా డా||బుర్ర మధుసూదర్‌రెడ్డి రాశారు. ఈ విశ్లేషణాత్మక వ్యాసాలన్నీ ప్రముఖ దినపత్రికల్లో ప్రచురణై పాఠకుల ఆదరణ పొందినవే. ‘మధుపాళీ’ పేరిట రాయడం అభినందనీయం.
మొత్తం 12 నెలలూ 12 విభాగాలుగా రాశారు. అక్కడక్కడా వారి స్వీయ కవితలు ముద్రించడం వల్ల రచయితలోని కవినీ సందర్శించగలం. జనవరి 1 ‘గ్లోబల్ ఫ్యామిలీ డే’ గా ఆ రోజు ప్రాముఖ్యత చెప్పారు. అలాగే 4వ తేదీ జనవరి అంధుల లిపి రూపశిల్పి లూయిస్ బ్రెయిలీ దినంగా ఐరాస తీర్మానం ద్వారా 2019 సం|| నుండి పాటించే తీరు చెప్పారు. ప్రపంచ హిందీ దినోత్సవం జనవరి 10. దాని ప్రధాన్యత ప్రపంచంలో హిందీ మాట్లాడే జనం అధికంగా గల దేశాల గురించి చెప్పారు. లాల్ బహదూర్ వర్ధంతిగా జనవరి 11వ తేదీ వుంది. అక్టోబర్ 2 ఆయన జయంతి కూడా రాస్తే బాగుండేది.
మే 1 కార్మిక దినం. మహామనిషి సుందరయ్య జయంతి, మే 19 సుందరయ్య వర్ధంతి రాస్తే బాగుండేది. జూన్ 12 పాఠశాలలు తెరుస్తారు. ఆ రోజు ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినం. ప్రాముఖ్యత చెప్పడం బాగుంది. మనకు తెలియని ఎన్నో తారీఖులు, వాటి ప్రాముఖ్యత తేదీలు, నెలల వారీగా ఇవ్వడం బాగుంది. తారీఖుల్లో తెలంగాణ అనే పుస్తకం డా||పెన్నా శివరామకృష్ణ గారి పుస్తకం గుర్తుకు వస్తుంది. జాతీయ సుపరిపాలనా దినంగా వాజ్‌పేరు జన్మదినం (పేజీ 411), డిసెంబర్ 25 గురించి రాశారు. అదే రోజు కమ్యూనిస్టు పార్టీ ప్రారంభమైన రోజు. మార్చి 27 ప్రపంచ నాటక రంగ దినోత్సవం. ఇవి కూడా రాస్తే బాగుండేది. ఇది విమర్శ కాదు, సూచన మాత్రమే. మలి ముద్రణల్లో ఆలోచించగలరు. ఏది ఏమైనా జాతీయ, అంతర్జాతీయ దినోత్సవాలు ఎరుక చేసే గొప్ప కరదీపిక.
– తంగిరాల చక్రవర్తి, 9393804472