రాజీమార్గమే రాజమార్గమని, పరస్పర ఒప్పందంతో కేసులు పరిష్కరించుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రభాకర్‌రావు సూచించారు. డిసెంబర్ 14వ జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్న నేపథ్యంలో బుధవారం తన ఛాంబర్ లో డీఎల్ఎస్ఏ కార్యదర్శి సౌజన్యతో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రభాకర్‌రావు మాట్లాడుతూ.. కక్షిదారులు లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకుని కేసులు పరిష్కరించుకోవాలని అన్నారు. సమస్యల నుండి శాశ్వతంగా ఉపశమనం పొందాలని సూచించారు. సత్వర కేసుల పరిష్కారంతో సమయం ఆదా కావడంతో పాటు మానసికంగానూ కొంతవరకు ఒత్తిడి తగ్గుతుందని తెలియజేశారు. లోక్ అదాలత్‌లో అన్నిరకాల సివిల్ కేసులు, వైవాహిక కేసులు, బ్యాంకు కేసులు, ఇన్సూరెన్స్ కేసులు, రాజీపడదగిన క్రిమినల్ కేసులను పరిష్కరించుకోవచ్చని తెలిపారు. ఇప్పటికే బ్యాంకు, పోలీస్ అధికారులు, న్యాయవాదులు, ఇన్సూరెన్స్ అధికారులు, కక్షిదారులతో సమావేశాలు నిర్వహించి దిశానిర్దేశం చేసినట్లు వెల్లడించారు.