జాతీయ మాస్టర్‌ అథ్లెటిక్స్‌ షురూ

– పోటీలను ప్రారంభించిన మాజీ మంత్రి మల్లారెడ్డి
హైదరాబాద్‌: 20 ఏండ్ల తర్వాత హైదరాబాద్‌లో జరుగుతున్న జాతీయ మాస్టర్‌ అథ్లెటిక్స్‌ పోటీలు ఘనంగా ఆరంభమయ్యాయి. గచ్చిబౌలి స్టేడియంలో గురువారం జరిగిన ఈ ఆరంభ వేడుకలకు మాజీ కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై పోటీలు ప్రారంభించారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ మీ అందరిని ఉత్సాహపర్చేందుకు తాను కూడా స్పోర్ట్స్‌ ట్రాక్‌ సూట్‌లో ఇక్కడికి వచ్చానని అన్నారు. ఉత్తరాఖండ్‌, పంజాబ్‌, ఢిల్లీ, గుజరాత్‌, కేరళ నుంచి ఉత్సాహంగా ఈ పోటీల్లో పాల్గొనేందుకు హైదరాబాద్‌ రావడం గొప్ప విషయమన్నారు. వెటరన్‌ అథ్లెట్లను యువత ప్రేరణగా తీసుకోవాలని సూచించారు. వెటరన్‌ అథ్లెట్లు యువతలా మారి క్రీడా స్ఫూర్తితో పోటీల్లో పాల్గొనడంతో గచ్చి క్రీడా ప్రాంగణం కళకళలాడింది. ఈ కార్యక్రమంలో జాతీయ మాస్టర్‌ అథ్లెటిక్స్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మర్రి లక్ష్మణ్‌ రెడ్డి, రాష్ట్ర మాస్టర్‌ అథ్లెటిక్స్‌ కోశాధికారి డి.లక్ష్మి, ప్రధాన కార్యదర్శి ప్రభుకుమార్‌, సంయుక్త కార్యదర్శి లక్ష్మణ్‌రావు తదితరులు పాల్గొన్నారు.