దేశంలో తొలిఎన్నికల్లో అతిపెద్ద పార్టీ కాంగ్రెస్‌తో పాటు ఇతర చిన్న చిన్న జాతీయ పార్టీలు పోటీ చేశాయి. పోనుపోను చిన్న జాతీయ పార్టీలు ఉనికిలో లేకుండా పోయాయి. రాజకీయంగా అంతరించి పోవడమో లేక ఇతర పార్టీల్లో విలీనం వల్లనో అవి కనుమరుగయ్యాయి. లెఫ్ట్ పార్టీలు మాత్రమే నేటికీ మనుగడలో ఉన్నాయి. ఈ ఎన్నికల్లో సిపిఐ(ఎం) జాతీయ పార్టీగా ఇసి గుర్తింపు పొందింది. 1951-52లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 14 జాతీయ పార్టీలు, 39 ఇతర పార్టీలు పోటీ చేశాయి. లెఫ్ట్ పార్టీలు కాక మిగిలిన వాటిలో అత్యధికంగా కాంగ్రెస్ నుంచి ఏర్పడినవే. 1953లో దేశవ్యాప్తంగా నాలుగు పార్టీలు.. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ (ఐఎన్‌సి), కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (సిపిఐ), ప్రజా సోషలిస్ట్ పార్టీ (పిఎస్‌పి), ఆల్ ఇండియా భారతీయ జన సంఫ్‌ు (బిజెఎస్) వంటివి జాతీయ పార్టీలుగా గుర్తింపు పొందాయి.
తొలి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 364 సీట్లలో విజయం సాధించింది. 16 స్థానాలు గెలుచుకుని రెండో అతిపెద్ద పార్టీగా ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ ఏర్పడింది. జయప్రకాష్ నారాయణ్ ఆధీనంలోని సోషలిస్ట్‌పార్టీ 12 సీట్లను గెలుపొందింది. జె.బి కృపలానీ స్థాపించిన కిసాన్ మజ్దుర్ ప్రజాపార్టీ తొమ్మిది స్థానాలు, పీపుల్స్ డెమొక్రటిక్ ఫ్రంట్ (పిడిఎఫ్) ఏడు స్థానాలను గెలుచుకున్నాయి. హిందూ మహాసభ నాలుగు, ఆర్‌ఎస్‌ఎస్ అనుబంధ రాజకీయ విభాగమైన భారతీయ జనసంఫ్‌ు (బిజెఎస్) మూడు స్థానాలను సాధించింది. మిగిలిన 30లు పార్టీ తమ ఖాతాలను తెరవలేకపోయాయి.
1952 ఎన్నికల్లో సోషలిస్ట్ పార్టీ, కెఎంపిపిలో విలీనమై ప్రజా సోషలిస్ట్ పార్టీ (పిఎస్‌పి)గా ఆవిర్భవించింది. అయితే 1972 వరకే అది ఉనికిలో ఉంది. ఆ ఎన్నికల్లో డా.భీమ్‌రావు అంబేద్కర్‌కు చెందిన షెడ్యూల్డ్ కులాల సమాఖ్య (ఎస్‌సిఎఫ్) ఆరు స్థానాలను గెలుపొందింది. తర్వాత రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా (ఆర్‌పిఐ)గా అది రూపాంతరం చెందింది. 1977 ఎమర్జెన్సీ తర్వాత జయప్రకాశ్ నారాయణ్ జనతా పార్టీని ఏర్పాటు చేశారు. బిజెఎస్, భారతీయ లోక్‌దళ్, కాంగ్రెస్‌లోని ఒక వర్గం ఈ పార్టీలో విలీనమయ్యాయి. తర్వాత బిజెపి ఏర్పడినప్పడు దాని నుంచి బిజెఎస్ విడిపోయింది.
ఓట్ల శాతం లేదా గెలుపొందిన సీట్లను బట్టి జాతీయ పార్టీలుగా ఇసి గుర్తిస్తుంది. ప్రస్తుతం కాంగ్రెస్, సిపిఐ(ఎం), బిజెపి, ఆమ్‌ఆద్మీ, బహుజన్ సమాజ్ పార్టీ, నేషనల్ పీపుల్స్ పార్టీ వంటి పార్టీలను ఎలక్షన్ కమిషన్ జాతీయ పార్టీలు గుర్తింపు పొందాయి.