– ఏఐఎస్‌జీఈఎఫ్ అధ్యక్షులు సుభాష్ లంబ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సీపీఎస్)ను రద్దు చేయాలని కోరుతూ వచ్చేనెల 16న జాతీయ సమ్మెను విజయవంతం చేయాలని అఖిల భారత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య (ఏఐఎస్‌జీఈఎఫ్) జాతీయ అధ్యక్షులు సుభాష్ లంబ ఉద్యోగులకు పిలుపునిచ్చారు. బుధవారం హైదరాబాద్‌లోని టీఎన్జీవో రాష్ట్ర కార్యాలయంలో సమ్మె సన్నాహక సమావేశాన్ని ఆ సంఘం ప్రధాన కార్యదర్శి మారం జగదీశ్వర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా సుభాష్ లంబ మాట్లాడుతూ గతనెల 28, 29, 30 తేదీల్లో కలకత్తాలో నిర్వహించిన ఏఐఎస్‌జీఈఎఫ్ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో తీర్మానాన్ని అనుసరించి సీపీఎస్ రద్దు, ఉద్యోగుల ఆదాయపు పన్ను రూ.10 లక్షలకు పెంపు, పెండింగ్‌లో ఉన్న డీఏలను మంజూరు డిమాండ్ చేశారు. ప్రభుత్వ శాఖల్లో ఖాళీలను భర్తీ చేయాలని కోరారు. ప్రయివేటీకరణ విధానాలను ఉపసంహరించుకోవాలని చెప్పారు. కార్మిక చట్టాల రద్దును వ్యతిరేకిస్తున్నామని అన్నారు. కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలన్నారు. మారం జగదీశ్వర్ మాట్లాడుతూ జాతీయ కౌన్సిల్ తీర్మానం మేరకు వచ్చేనెల 16న ఒక రోజు జాతీయ సమ్మెను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీవో కేంద్ర అసోసియేట్ అధ్యక్షులు కస్తూరి వెంకట్, జాతీయ కార్యవర్గ సభ్యులు లక్ష్మణ్‌తోపాటు 33 జిల్లాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.