2 నుంచి జాతీయ స్విమ్మింగ్‌ పోటీలు

– ప్రారంభించనున్న క్రీడా మంత్రి, శాట్స్‌ చైర్మెన్‌
నవతెలంగాణ, హైదరాబాద్‌
హైదరాబాద్‌ మరో జాతీయ స్థాయి స్పోర్ట్‌ ఈవెంట్‌కు వేదికగా నిలువనుంది. గచ్చిబౌలిలోని జిఎంసీ బాలయోగి ఇండోర్‌ స్టేడియం ఆవరణలోని ఈత కొలనులో జులై 2 నుంచి జాతీయ ఆక్వాటిక్‌ చాంపియ న్‌షిప్స్‌ జరుగనున్నాయి. ఈ మేరకు నిర్వాహకులు బుధవారం వెల్లడించారు. 76వ సీనియర్‌ నేషనల్‌ ఆక్వాటిక్‌ చాంపియన్‌షిప్స్‌కు రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందిస్తామని క్రీడాశాఖ మంత్రి వి. శ్రీనివాస్‌ గౌడ్‌ తెలిపారు. ‘ఈతకొలనులో తెలంగాణ స్విమ్మర్లు ఇటీవల వరుసగా పతకాలు సాధిస్తున్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయి వేదికల్లో విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు రాష్ట్ర ప్రభుత్వం భారీ నగదు ప్రోత్సాహకాలు అందజేస్తున్నది. వయసుతో నిమిత్తం లేకుండా స్విమ్మింగ్‌ను అందరూ నేర్చుకోవాలని’ శాట్స్‌ చైర్మెన్‌ డాక్టర్‌ ఆంజనేయ గౌడ్‌ అన్నారు.
నాలుగు రోజుల పాటు సాగే జాతీయ స్థాయి స్విమ్మింగ్‌ పోటీల్లో..42 విభాగాల్లో పోటీలు నిర్వహించనున్నారు. జాతీయ స్థాయిలో 500 మంది స్విమ్మర్లు, 100 మంది అధికారులు పాల్గొననుండగా.. తెలంగాణ రాష్ట్రం నుంచి 22 మంది స్విమ్మర్లు (11 మెన్‌, 11 ఉమెన్‌) పోటీపడనున్నారు. జులై 2న పోటీలను షురూ కానుండగా.. క్రీడాశాఖ మంత్రి వి. శ్రీనివాస్‌ గౌడ్‌, శాట్స్‌ చైర్మెన్‌ డాక్టర్‌ ఆంజనేయ గౌడ్‌లతో కలిసి తెలంగాణ స్విమ్మింగ్‌ సంఘం ఆఫీస్‌ బేరర్లు జాతీయ స్థాయి చాంపియన్‌షిప్స్‌ను ఆరంభించనున్నారు.