– రిజర్వేషన్లపై 50 శాతం పరిమితి తొలగింపు : ‘భారత్ జోడో న్యారు యాత్ర’లో రాహుల్ హామీ
– జార్ఖండ్‌లో నాలుగో రోజు పర్యటన
రాంచీ : రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ప్రతిపక్షాల కూటమి ‘ఇండియా’ను గెలిపిస్తే దేశవ్యాప్తంగా కులగణన చేస్తామని కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ అన్నారు. అలాగే, రిజర్వేషన్లపై 50 శాతం పరిమితిని తొలగిస్తామని హామీ ఇచ్చారు. ‘భారత్ జోడో న్యారు యాత్ర’లో భాగంగా జార్ఖండ్‌లో ఆయన నాలుగో రోజు పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన పై హామీలు ఇచ్చారు. జార్ఖండ్ రాజధాని రాంచీలో బహిరంగ ర్యాలీలో ఆయన మాట్లాడారు.
దళితులు, గిరిజనులు, ఓబీసీలు బాండెడ్ లేబర్లుగా ఉన్నారనీ, పెద్ద కంపెనీలు, ఆస్పత్రులు, స్కూళ్లు, కాలేజీలు, న్యాయస్థానాల్లో వారి భాగస్వామ్యం కొరవడిందని రాహుల్ అన్నారు. ”ఇది భారత్ ముందున్న అతిపెద్ద సవాల్. మా మొదటి అడుగు దేశంలో కుల గణను నిర్వహించటం. ప్రస్తుతం ఉన్న నిబంధనల కింద 50 శాతం కంటే ఎక్కువ రిజర్వేషన్ లభించదు. ‘ఇండియా’ కూటమి అధికారంలోకి వస్తే రిజర్వేషన్లపై పరిమితిని ఎత్తేస్తాం. దళితులు, గిరిజనులు, ఓబీసీలకు వారి హక్కులు అందేలా చూస్తాం. ఆదివాసీ, దళితుల రిజర్వేషన్లలో ఎలాంటి తగ్గింపూ ఉండదు. సమాజంలో వెనకబడిన వర్గాలు వారి హక్కులను పొందేలా నేను హామీ ఇస్తున్నాను” అని రాహుల్ తెలిపారు.
సామాజిక, ఆర్థిక అన్యాయం అతిపెద్ద సమస్య అని ఆయన చెప్పారు. కుల గణనను ప్రధాని మోడీ వ్యతిరేకిస్తున్నారని రాహుల్ ఆరోపించారు. మోడీ ఓబీసీ అని చెప్పుకుంటాడనీ, అయితే కులగణన డిమాండ్‌కు వచ్చేసరికి ‘పేద, ధనిక’ అనే కులాలు మాత్రమే ఉంటాయంటారని రాహుల్ తెలిపారు. కేంద్రంలోని మోడీ సర్కార్ ప్రభుత్వ రంగ సంస్థ (పీఎస్‌యూ) లను క్రమంగా నిర్వీర్యం చేస్తున్నదని రాహుల్ ఆరోపించారు. వీటిని క్రమంగా గౌతమ్ అదాని నేతృత్వంలోని అదానీ గ్రూపునకు కట్టబెడుతున్నారని అన్నారు.