దేశవ్యాప్త కార్మికుల సమ్మె గ్రామీణ భారత్ బంద్ పోస్టర్ ఆవిష్కరణ

నవతెలంగాణ – డిచ్ పల్లి
తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ నిజామాబాద్ (ఐఎఫ్టియు) జిల్లా ప్రధాన కార్యదర్శి జే.పీ.గంగాధర్ ఆధ్వర్యంలో దేశవ్యాప్త కార్మికుల సమ్మె గ్రామీణ భారత్ బంద్ పోస్టర్ లను  డిచ్ పల్లి మండలంలోని మెంట్రాజ్ పల్లి గ్రామంలో సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికులకు కనీస వేతనం 26 వేలుగా నిర్ణయించాలన్నారు. నాలుగు లేబర్ కోడ్లను, ఎన్ఐపి చట్టం, విద్యుత్ సవరణ బిల్లులను రద్దు చేయాలని,  కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ విధానం రద్దు చేసి ఉద్యోగ కార్మికుల్ని పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. కాల పరిమితి ముగిసిన అన్ని షెడ్యూల్ ఎంప్లాయిమెంట్ల కనీస వేతనాల జీవోలను వెంటనే సవరించాలని, 2021లో విడుదల చేసిన ఐదు కనీస వేతనాల జీవోలను వెంటనే గెజిట్ చేసి అమలు చేయాలని, కనీస పెన్షన్ రూపాయలు పదివేలకు పెంచాలని  డిమాండ్ చేశారు. అన్ని రకాల ఆహార వస్తువులపై జిఎస్టిని తొలగించాలన్నారు. ఈనెల 16 న  డిమాండ్స్ లను నెరవేర్చాలని కోరుతూ ఒకరోజు నిరసనగా దేశవ్యాప్త కార్మికుల సమ్మె గ్రామీణ భారత్ బంద్ లో ప్రతి ఒక్కరు, ప్రతి ఒక్కరంగంలో పనిచేస్తున్న కార్మికులు అందరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సహాయ కార్యదర్శి సుప్రియ, కార్మికులు ప్రమీల, సావిత్రి, అరుణ, రాంబాయి, వీరలక్ష్మి, రమ్య, తదితరులు పాల్గొన్నారు.