అంగన్‌వాడీల దేశవ్యాప్త ఉద్యమం… ప్రభుత్వాలకు ఓ హెచ్చరిక!

నేడు దేశంలో ప్రతీ గ్రామంలో అంగన్‌వాడీ టీచర్స్‌, హెల్పర్స్‌, మినీ టీచర్స్‌ మహిళలు, చిన్న పిల్లల అభివృద్ధిలో నిరంతర కృషి సాగిస్తున్నారు. మాతా, శిశు మరణాలను, పౌష్టికాహార లోపాన్ని తగ్గించటంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. 10వ తరగతి నుండి పి.జి. వరకు చదువుకున్న వీరు అతి తక్కువ వేతనం పైన పని చేస్తున్నారు. 40రకాల రిజిష్టర్స్‌, అనేక ఆన్‌లైన్‌ యాప్స్‌, ఐసిడిఎస్‌కు సంబంధంలేని అనేక అదనపు పనులు, ఎలక్షన్‌కు సంబంధించిన బి.ఎల్‌.ఓ తదితర అనేక పనులు, సేవల్లో ఉన్నారు. అయినా పాలకులు వీరి శ్రమను గుర్తించకుండా మరింత వెట్టిచాకిరీ చేయించుకుంటూ వీరిని పీడిస్తున్నారు. సమగ్ర శిశు అభివృద్ధి సేవ కేంద్రం (ఐసిడిఎస్‌)ను దాదాపు 47సంవత్సరాలు అవుతున్నది. అయినప్పటికీ ప్రభుత్వాలు అంగన్‌వాడీ ఉద్యోగులను పర్మినెంట్‌ చేయలేదు. కనీస వేతనం ఇవ్వడం లేదు. ఇంకా గౌరవ వేతనాలనే చెల్లిస్తున్నాయి. ఇప్పుడు కేంద్రం ఐసిడిఎస్‌కు తన వాటా బడ్జెట్‌ని తగ్గించి ఐసిడిఎస్‌ను నిర్వీర్యం చేయాలని చూస్తున్నది. నూతన జాతీయ విద్యా విధానం చట్టం ద్వారా ఈ రంగాన్ని మూసివేసి పేద ప్రజలకు పౌష్టికాహారాన్ని దూరం చేసే దుష్ట ప్రయత్నం చేస్తున్నది. ఇందులో పనిచేస్తున్న 26లక్షల మంది అంగన్‌వాడీ ఉద్యోగులను ఇంటికి పంపించాలని కుటిలయత్నం కనపడుతున్నది. ఈ విధానాలను నిరసిస్తూ ఐసిడిఎస్‌ను రక్షించుకోవడంతో పాటు, అంగన్‌వాడీ ఉద్యోగుల హక్కుల కోసం నేడు దేశవ్యాప్తంగా ఉద్యమం నడుస్తున్నది. అంగన్‌వాడీ ఉద్యోగులు ప్రభుత్వాలను కోరుతున్న అంశాలలో మొదటిది ఐసిడిఎస్‌కు బడ్జెట్‌ పెంచి బలోపేతం చేయాలని. ఎందుకంటే అన్ని సమస్యలు ఈబడ్జెట్‌తోనే ముడిపడి ఉంటాయి కాబట్టి. పక్కా భవనాలు కట్టాలన్నా, కట్టిన భవనాలకు రిపేర్లు చేయించాలన్నా, అంగన్‌వాడీ కేంద్రాలలో అవసరమైన సౌకర్యాలు, నాణ్యమైన పౌష్టికాహారం, వంట సామాగ్రి, ప్రీస్కూల్‌ పిల్లల మెటీరియల్‌ ఇందులో పనిచేస్తున్న అంగన్‌వాడీ ఉద్యోగులకు కనీస వేతనాలతో పాటు ఇతర సౌకర్యాలు కల్పించాలన్నా, ఈ ఖర్చులకు సరిపడా బడ్జెట్‌ పెంపుదల ఉంటేనే ఐసిడిఎస్‌ సేవలు ముందుకుపోయే అవకాశం ఉంటుంది. కానీ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఈ దృష్టితో ఆలోచించటం లేదు. 2021-22కి గాను రూ.18,382 కోట్లు మాత్రమే కేటాయింపులు చేసింది. 2022-23కు గాను రూ.20,263 కోట్లు, 2023-24కు రూ.20,554 కోట్లు. ఈ బడ్జెట్‌లో గత సంవత్సరంపై 1.4శాతం మాత్రమే పెరు గుదల చూపారు. దీనికంటే కూడా ఈ రోజు ఐసిడిఎస్‌ ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య కేంద్రం ఐసిడిఎస్‌కు పెట్టే ఖర్చుల వాటాను 100 నుండి 60శాతానికి తగ్గించటం. అంటే ఉదాహరణకి రూ.100 ఖర్చయితే కేంద్రం కేవలం రూ.60 మాత్రమే ఇస్తుంది. మిగిలిన 40శాతం ఖర్చులు బడ్జెట్‌ను రాష్ట్ల్రాలు ఇవ్వాలని కేంద్రం చెపుతున్నది. రాష్ట్రాలేమో సాధ్యం కాదని చెపుతున్నాయి. ఈ విధానం ఐసిడిఎస్‌ ముందుకు పోవడానికి ఆటంకంగా మారింది. పక్షవాతం వచ్చిన మనిషి శరీరం సగం బాగుండీ, సగం బాగాలేక ఎలా ఉంటుందో కేంద్రం విధానాల వలన ఐసిడిఎస్‌ పరిస్థితి కూడా దేశవ్యాప్తంగా అలాగే ఉంది.
అంగన్‌వాడీలపై కేంద్రం ఆర్థిక భారం
బడ్జెట్‌ తగ్గింపుతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అంగన్‌వాడీ ఉద్యోగులు నలిగిపోతున్నారు. 2017 నుండి అంగన్‌వాడీ ఉద్యోగులకు టిఎ, డిఎ లు, ఇంక్రిమెంట్‌, ఇన్‌చార్జ్‌ అలవెన్స్‌లు ఇవ్వట్లేదు. 2018 నుండి పెంచిన వేతనాలూ కేంద్రం చెల్లించటం లేదు. 8 ఏండ్లు గడిచినా ఆరోగ్య లకిë మెనూ చార్జీలు పెంచటం లేదు. ఖాళీ పోస్టులు భర్తీ చేయటం లేదు. ఈవెంట్స్‌ తదితర అనేక కార్యక్రమాలకు ప్రభుత్వాలు డబ్బులు ఇవ్వడం లేదు. ఈ ఆర్థిక భారమంతా అంగన్‌వాడీ ఉద్యోగులే భరించాలని చెపుతున్నారు. లేకపోతే ఉద్యోగాల నుండి తొలగిస్తామని అధికారులు బెదిరిస్తున్నారు. దీనివల్ల కేంద్రం తగ్గించిన బడ్జెట్‌ భారమంతా అంగన్‌వాడీ ఉద్యోగులపైన పడుతుంది. అంగన్‌వాడీ ఉద్యోగులు పొందుతున్న వేతనంలో సగం వేతనం వారు నడిపే కేంద్రాలకే ఖర్చు పెడుతున్న దుర్భర పరిస్థితికి అంగన్‌వాడీ ఉద్యోగులు నెట్టబడుతున్నారు. రెండవది నూతన జాతీయ విద్యావిధానం. కరోనా సమయంలో ప్రజలందరూ చావుబతుకుల మధ్య ఉన్నప్పుడు చర్చలు లేకుండానే కేంద్రం ఈ చట్టం చేసింది. ఇది అమలైతే ఐసిడిఎస్‌ను పూర్తిగా మూసివేసి విద్యాశాఖలో కలుపుతారు. ఈ చట్టంలో ఐసిడిఎస్‌ ద్వారా పేద ప్రజలకు అందుతున్న సేవలకు గ్యారంటీ లేదు. ఏండ్లుగా పనిచేస్తున్న అంగన్‌వాడీల ఉద్యోగానికి గ్యారంటీ లేదు. నేడు ప్రపంచంలో 142కోట్లతో జనాభాలో చైనాను అధిగమించి మొదటి దేశంగా భారత్‌ అవతరించిందనే వార్తలు వస్తున్నాయి. దీన్నిబట్టి చూస్తే ఈ జనాభాలో 80శాతం మంది ప్రజలు అత్యధిక పేదరికంలో ఉన్నారు. 40కోట్ల మంది కనీస ఆహారం కూడా తీసుకోగలిగిన స్థితిలో లేరు. ప్రపంచంలో ఆకలితో అలమటించే దేశాలలో మనది 107వ స్ధానం. మహిళల్లో రక్తహీనత, పిల్లల్లో పౌష్టికాహార లోపం, సరైన ఎత్తు, బరువు లేని పిల్లల సంఖ్య దేశంలో అత్యధికం. కనీసం ఉద్యోగం లేని వారి సంఖ్య 45ఏండ్ల కాలంలో ఎప్పుడూలేనంత పెరిగింది. ఈ అంశాలన్నీ దేశంలో ఐసిడిఎస్‌ అవసరాన్ని నొక్కి చెపుతున్నాయి. గతంలో సుప్రీంకోర్టు కాగ్‌ నివేదిక, యూనిసెఫ్‌ లాంటి జాతీయ అంతర్జాతీయ సర్వేలు కూడా ఐసిడిఎస్‌ను బలోపేతం చేయాలని సూచించాయి. కానీ కేంద్రం ఈ అంశాలను వేటిని పరిగణనలోకి తీసుకోవటం లేదు. పేద ప్రజలతో పాటు అంగన్‌వాడీ ఉద్యోగులకు నష్టం కలిగించే చర్యల్నే వేగవంతం చేస్తున్నాయి. మూడవది 45 ఐఎల్‌సి ప్రకారం కనీస వేతనం రూ.26వేలు, ఇతర చట్టబద్ధ సౌకర్యాలు కల్పించాలని కేంద్రాన్ని అంగన్‌వాడీలు డిమాండ్‌ చేస్తున్నారు. 2013 మే నెలలో 45వ ఇండియన్‌ లేబర్‌ కాన్ఫరెన్స్‌ సమావేశం జరిగింది. దేశవ్యాప్తంగా స్కీం వర్కర్లలో భాగమైన అంగన్‌వాడీ ఉద్యోగుల సమస్యలు చర్చకు వచ్చాయి. స్కీం వర్కర్లను కార్మికులుగా గుర్తించాలని, కనీస వేతనం, పి.ఎఫ్‌., ఇ.ఎస్‌.ఐ, ఉద్యోగ భద్రత కల్పించాలని సమావేశం తీర్మానం చేసింది. పదేండ్లు గడుస్తున్నా నేటికి కేంద్రం ఈ నిర్ణయాలను అమలు చేయడం లేదు. జరిగిన నిర్ణయాలు అమలు కాకపోవటం వల్ల పదేండ్లుగా చట్టబద్ద సౌకర్యాలు లేక నష్టపోతున్నామని అంగన్‌వాడీ ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు. మరొక అంశం సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ చెల్లింపు. గుజరాత్‌ రాష్ట్రంలో అంగన్‌వాడీ ఉద్యోగులు గ్రాట్యుటీ కోసం ఏండ్లుగా న్యాయపోరాటం చేశారు. ఫలితంగా 2022 ఏప్రిల్‌ 25న దేశవ్యాప్తంగా అంగన్‌వాడీ ఉద్యోగులు కార్మికులేనని, 1972 గ్రాట్యుటీ చట్టం ప్రకారం లెక్కగట్టి రిటైర్మెంట్‌ అయిన వారికి చెల్లించాలని సుప్రీంకోర్టు జడ్జిమెంట్‌ ఇచ్చింది. తీర్పు వచ్చి ఏడాది గడిచినా దీనికి కేంద్రం బడ్జెట్‌ కేటాయింపులు ఇంకా చేయలేదు. దీనివల్ల ఒకవైపు వయస్సు పైబడి, మరోవైపు పనిభారం పెరిగి, వట్టి చేతులతో ఇంటికి పోలేక వృద్ధాప్యంలో అనేక అవస్థల మధ్య వారి జీవితాలు కునారిల్లుతున్నాయి.
సమస్యలపై దృష్టి సారించని రాష్ట్ర ప్రభుత్వం
కేంద్రంతో పాటు రాష్ట్రం కూడా అంగన్‌వాడీ ఉద్యోగుల సమస్యలను పట్టించుకోవటం లేదు. కేంద్రం ఐసిడిఎస్‌కు బడ్జెట్‌ 60శాతానికి తగ్గించినా సరే అనేక రాష్ట్రాలు అదనంగా బడ్జెట్‌ కేటాయించి అంగన్‌వాడీ ఉద్యోగులకు అనేక సౌకర్యాలు కల్పిస్తున్నాయి. మన పక్కనే ఉన్న తమిళనాడు, పాండీచేరిలో అంగన్‌వాడీలను పర్మినెంట్‌ చేశాయి. కర్నాటక, తమిళనాడు రాష్ట్రాలలో అంగన్‌వాడీ ఉద్యోగులకు 5లక్షల హెల్త్‌ కార్డులు అందజేశాయి. అస్సాం రాష్ట్రంలో రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ అంగన్‌వాడీలకు రూ.4 లక్షలు, మినీ టీచర్లకు 3లక్షలు, హెల్పర్లకు 2లక్షలు ఇస్తున్నాయి. కేరళ అంగన్‌వాడీ ఉద్యోగులకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసింది. దీనిద్వారా పిల్లల చదువులు, వివాహాలు, గృహ నిర్మాణం తదితర అనేక అవసరాలకు ప్రభుత్వం డబ్బులు చెల్లిస్తున్నది. పశ్చిమ బెంగాల్‌, కేరళ రాష్ట్రాలుపండగ బోనస్‌లు అందిస్తున్నవి. ఇంకా అనేక రాష్ట్రాలు రిటైర్‌మెంట్‌ అయిన వారికి ప్రతి నెలా పెన్షన్‌ ఇస్తున్నాయి. కానీ తెలంగాణలో మాత్రం అంగన్‌వాడీలకు ఒక్క వేతనం తప్ప ఏమీ చెల్లించటం లేదు. పర్మినెంట్‌, కనీస వేతనం, పి.ఎఫ్‌., ఇ.ఎస్‌.ఐ, ఉద్యోగ భద్రత లాంటి ఏ సౌకర్యాలు లేవు. కనీసం వారు చనిపోతే అంత్యక్రియల ఖర్చులు కూడా ఇవ్వడం లేదు. అరవై సంవత్సరాలు నిండి రిటైర్మెంట్‌ బెనిఫిట్‌ టీచర్లకు రూ.5 లక్షలు, హెల్పర్లకు రూ.3లక్షలు ప్రస్తుత వేతనంలో సగం పెన్షన్‌ ఇవ్వాలని పదివేల మందికి పైగా అంగన్‌వాడీ ఉద్యోగులు ఎప్పటినుంచో ప్రభుత్వానికి విన్నవిస్తున్నా ఉలుకు, పలుకు లేదు. గత ఏడేండ్ల నుండి రాష్ట్రంలో టిఎ, డిఎ లు, ఇంక్రిమెంట్‌, ఇన్‌చార్జ్‌ అలవెన్స్‌లు చెల్లించటం లేదు. ఆరేండ్ల నుండి కేంద్రం పెంచిన వేతనాలు చెల్లించటం లేదు. ఆరోగ్య లకిë మెనూ చార్జీలు గత ఎనిమిదేండ్ల నుండి పెంచటం లేదు. పక్కా భవనాలు లేవు. ఖాళీ పోస్టుల భర్తీ లేదు. సెంటర్‌ అద్దెలు లేవు. గ్యాస్‌ బిల్లులివ్వట్లేదు. ఈవెంట్స్‌ డబ్బులు అంతకన్నా లేవు. కేంద్రం పోషన్‌ ట్రాకర్‌ యాప్‌ను తీసుకు వస్తే రాష్ట్రం దీంతో ఆగకుండా అదనంగా ఎన్‌హెచ్‌టిఎస్‌, ఇసిసిఇ అని అనేక యాప్స్‌ను తెచ్చి పనిభారాన్ని పెంచుతున్నది. రాష్ట్రంలో అంగన్‌వాడీ ఉద్యోగులకు కనీసం సంక్షేమ పథకాలు కూడా అమలు చేయట్లేదు. పైగా అంగన్‌వాడీ ఉద్యోగులకు వేతనాలు పెంచామని, బాగా చూసుకుంటున్నామని రాష్ట్ర ప్రభుత్వం పచ్చి అబద్దాలు చెబుతున్నది. కేంద్రం వాటాతో కలిపి రాష్ట్రం అంగన్‌వాడీ టీచర్లకు రూ.13,650లు, మినీ టీచర్లకు, హెల్పర్లకు రూ.7,800లు చెల్లిస్తున్నది. అనేక రాష్ట్రాల్లో పర్మినెంట్‌ చేసి సకల సౌకర్యాలు కల్పిస్తుంటే తెలంగాణలో మాత్రం ఉన్న ఉద్యోగాలకు కూడా భద్రత లేకుండా చేసే జిఓ 14ను తెచ్చింది.
అందుకే అంగన్‌వాడీ ఉద్యోగులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు నిరసనగా దేశ వ్యాప్తంగా జూన్‌, జులై నెలల్లో పెద్దఎత్తున పోరాటాలు నిర్వహించారు. జూన్‌ నెలలో అంగన్‌వాడీ ఉద్యోగుల రాష్ట్ర జాతాకు అన్ని జిల్లాల్లో పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. జులై 10న అంగన్‌వాడీ ఆలిండియా డిమాండ్స్‌ డేలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో నల్లచీర, నల్ల బ్యాడ్జీలు ధరించి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో 10కిలో మీటర్ల పాదయాత్ర ద్వారా తమ బాధలను నిరసనల ద్వారా తెలియజేశారు. ప్రధానంగా ఐసిడిఎస్‌కు బడ్జెట్‌ పెంచాలని, ఎన్‌ఇపిని రద్దు చేయాలని, 45 ఐఎల్‌సి ప్రకారం కనీస వేతనం రూ.26వేలు ఇవ్వాలని, ఇతర చట్టబద్ధ సౌకర్యాలు కల్పించాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి సమస్యలు పరిష్కరించాలని, లేని పక్షంలో దేశవ్యాప్తంగా మరిన్ని పోరాటాలు చేపడతామని వారు హెచ్చరిస్తున్నారు.
పి. జయలక్ష్మి
9490098605