3న దేశవ్యాప్త నిరసన

– పాలస్తీనియన్లపై ఇజ్రాయిల్‌ మారణహోమానికి వ్యతిరేకంగా..
– సీపీఐ(ఎం)తో సహా వామపక్ష పార్టీల సంయుక్త ప్రకటన
న్యూఢిల్లీ : పాలస్తీనియన్లపై ఇజ్రాయిల్‌ మారణహోమానికి వ్యతిరేకంగా ఈ నెల 3న దేశవ్యాప్తంగా నిరసనకు సిపిఎంతో సహా వామపక్ష పార్టీలు పిలుపునిచ్చాయి. ఈ మేరకు బుధవారం సంయుక్తంగా ఒక ప్రకటన విడుదల చేశాయి. సీపీఐ(ఎం), సీపీఐ, రివల్యూషనరీ సోషలిస్ట్‌ పార్టీ, ఆల్‌ ఇండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ మరియు కమ్యూనిస్ట్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా (మార్క్సిస్ట్‌-లెనినిస్ట్‌)-లిబరేషన్‌ నాయకులు ఈ ప్రకటన విడుదల చేశారు. ఈ నిరసనకు దేశంలో అన్ని పార్టీలు మద్దతు ఇవ్వాలని కోరారు. అలాగే ఈ ప్రకటనలో ఐరాస తీర్మానాలను, ఐసీజే తీర్పులను ఇజ్రాయిల్‌ ఉల్లంగిస్త్తూ, అమెరికా మద్దతుతో ఇజ్రాయిల్‌ చేస్తున్న మారణహోమం, దురాగతాలకు వ్యతిరేకంగా తమ సంఘీభావాన్ని తెలియజేయాలని భారత ప్రజలకు పిలుపునిచ్చాయి. తక్షణ కాల్పుల విరమణ, 1967కి ముందు ఉన్న పాలస్తీనా, రాజధానిగా తూర్పు జెరూసలేంను గుర్తించాలని కోరాయి. అలాగే ఇజ్రాయిల్‌ నుంచి ఆయుధాలు, సైనిక పరికరాల దిగుమతి-ఎగుమతులపై తక్షణ సైనిక నిషేధాన్ని విధించాలని, అన్ని రకాల సైనిక సహకారాన్ని నిలిపివేయాలని భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి. అలాగే ఇజ్రాయిల్‌లో పారిశ్రామిక కార్యకలాపాల కోసం భారతీయ కార్మికుల సహకారం, తరలింపుపై వెంటనే ఆంక్షలు విధింంచాలని కోరాయి. అలాగే, దౌత్యపరమైన, ఆర్థిక ఆంక్షలతో సహా ఇజ్రాయెల్‌పై చట్టపరమైన ఆంక్షలు విధించాలని కోరాయి.
ఇజ్రాయిల్‌కు వ్యతిరేకంగా ఐరాస ప్రత్యేక కమిటీని వేయాలని డిమాండ్‌ చేయాలని భారత ప్రభుత్వాన్ని కోరాయి. అలాగే ఇజ్రాయెల్‌కు సైనిక ఆయుధాలు, మందుగుండు సామగ్రి సరఫరా కోసం వివిధ భారతీయ కంపెనీలకు ఇచ్చిన అన్ని ఎగుమతి లైసెన్స్‌లు, అనుమతులను రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరాయి. అలాగే ఇజ్రాయిల్‌ నుంచి అన్ని ఆయుధాల దిగుమతులను నిలిపివేయాలని కోరాయి. స్వాతంత్య్రానికి ముందు నుంచి మన వారసత్వానికి అనుగుణంగా భారత ప్రభుత్వం నిర్వహించిన దౌత్య విధానాలను కొనసాగించాలని కోరాయి.