ఉక్రెయిన్‌పై మక్రాన్‌ వ్యాఖ్యలతో… గందరగోళంలో నాటో దేశాలు

With Macron's comments on Ukraine... NATO countries in turmoil– నెల్లూరు నరసింహారావు
ఉక్రెయిన్‌ యుద్ధంలో నాటో తన సైన్యాన్ని మోహరించవచ్చని ఈ వారం ఫ్రెంచ్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మక్రాన్‌ చేసిన వ్యాఖ్యలను అనేక నాటో దేశాలు తిరస్కరించాయి. అటువంటి చర్య అమెరికా నేతత్వంలోని నాటో సైనిక కూటమితో ప్రత్యక్ష యుద్ధాన్ని ”అనివార్యం” చేస్తుందని మాస్కో ప్రతిస్పందించింది. ఉక్రెయిన్‌ లో యుద్ధాన్ని ఎలా కొనసాగించాలనే దానిపై నాటో కూటమిలో సమన్వయం లేకపోవడాన్ని మక్రాన్‌ ప్రసంగం ఎత్తిచూపింది. రష్యా – ఉక్రెయిన్‌ యుద్ధం మూడవ సంవత్సరంలోకి ప్రవేశించినందున ఏమి చేయాలో చర్చించడానికి ఉక్రెయిన్‌ మద్దతుదారులు మక్రాన్‌ ఆహ్వానం మేరకు సోమవారం పారిస్‌లో సమావేశమయ్యారు. ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్స్కీ వీడియో లింక్‌ ద్వారా జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఉక్రెయిన్‌ లోని డోనెట్స్‌ పీపుల్స్‌ రిపబ్లిక్‌లోగల అవదీవ్కాపై ఉక్రేనియన్‌ దళాలు తమ పట్టును కోల్పోవటం తోపాటు యుద్ధభూమిలో వరుస పరాజయాలను చవి చూసిన వారం తర్వాత పారిస్‌ నగరంలో నాటో దేశాల నాయకులు సమావేశమయ్యారు. యుద్ధంలో ప్రాణాలను కోల్పోయిన సైనికుల స్థానంలో సైన్యంలో నూతన దళాలను తిరిగి చేర్చుకోవడానికి ఉక్రెయిన్‌ ప్రభుత్వం కష్టపడుతోంది. సైన్యంలో చేరకుండా తప్పించుకుంటే కఠినమైన శిక్షలను ప్రవేశపెట్టే వివాదాస్పద సమీకరణ సంస్కరణ చట్టాన్ని ఉక్రెయిన్‌ పార్లమెంటు ఆమోదించలేదు . ఇంతలో అమెరికన్‌ కాంగ్రెస్‌లోని ప్రతినిధుల సభలో ఉక్రెయిన్‌ కు అదనపు సహాయాన్ని అందించటం కోసం ఉద్దేశించిన బిల్లు తిరస్కరణకు గురైంది. ఎలీసీ ప్యాలెస్లో జరిగిన ఈ సమావేశంలో పాల్గొన్నవారు ”తమ ఐక్యతను పునరుద్ఘాటిం చడానికి”, రష్యాను ఓడించాలనే వారి సంకల్పాన్ని వ్యక్తం చేయడానికి ఒక మార్గంగా పేర్కొన్నారు. ఉక్రెయిన్‌ సంఘర్షణ పట్ల పాశ్చాత్య విధానాన్ని విమర్శిస్తూ కొంతమంది అతిథులు ముందుగా ఆందోళనలను వ్యక్తం చేశారు. స్లోవాక్‌ ప్రధాన మంత్రి రాబర్ట్‌ ఫికో ఈ ఎజెండాతో ”నాకు వణుకు వస్తోంది” అని అన్నాడు.
రష్యా విజయాన్ని నిరోధించడం యూరోపియన్‌ భద్రతా ప్రయోజనాలకు అవసరమని వాదిస్తూ ఉక్రెయిన్‌ను పశ్చిమ దేశాలు బలపరిచే వివిధ మార్గాలను మాక్రాన్‌ మీడియాకు వివరించారు. ”ఉక్రెయిన్‌ యుద్ధంలో పాల్గొనేం దుకు సైన్యాన్ని పంపటానికి అధికారికంగా ఏకాభిప్రాయం లేనప్పటికీ, అతను వివాదాస్పదంగా ”ఏదీ మినహాయించ కూడదు” అని చెప్పారు. యూరోపియన్‌ యూనియన్‌ సభ్యదేశాలు క్రమంగా ఉక్రెయిన్‌కు అధునాతన ఆయుధాలను అందించడానికి సిద్దపడుతున్నాయి. వారు మొదట ”కేవలం స్లీపింగ్‌ బ్యాగ్‌లు మరియు హెల్మెట్‌లను” అందించినప్పటికీ, వారు సుదూర లక్ష్యాలను ఛేదించే క్షిపణులను , ఫైటర్‌ జెట్‌లను అందించడానికి చర్యలు తీసుకున్నారని మక్రాన్‌ చెప్పారు. సైన్యాన్ని మోహరించడం లో కూడా అదే జరగవచ్చు, ఏ దేశాలు తమ మిలిటరీలను పంపడానికి సిద్ధంగా ఉన్నాయో చెప్పడానికి ఆయన నిరాకరించారు.
మక్రాన్‌ ప్రకటనకు ప్రతిస్పందనగా తమ సైన్యాలను ఉక్రెయిన్‌ కు పంపే ఉద్దేశం తమకు లేదని ఐరోపా దేశాల నాయకులు స్పష్టం చేశారు. హంగేరి, స్లోవేకియాల నుండి పోలాండ్‌, జర్మనీల వంటి దేశాల వరకు అలాంటి ప్రణాళికలు ఏవీ అమలులో లేవని నొక్కిచెప్పాయి. అదే సందేశం నాటో సెక్రెటరీ జనరల్‌ జెన్స్‌ స్టోల్టెన్‌బర్గ్‌ , వాషింగ్టన్‌ నుంచి వచ్చింది. జాతీయ భద్రతా మండలి ప్రతినిధి అడ్రియన్‌ వాట్సన్‌ మీడియాతో మాట్లాడుతూ, ”ఉక్రెయిన్‌లో పోరాడేందుకు అమెరికా తన సైన్యాన్ని పంపదని అధ్యక్షుడు జో బిడెన్‌ స్పష్టం చేశారు. ఫ్రెంచ్‌ రాజకీయ నాయకులు మక్రాన్‌ను మందలించారు. మైనర్‌ నేషనలిస్ట్‌ లెస్‌ పేట్రియాట్స్‌ పార్టీకి చెందిన ఫ్లోరియన్‌ ఫిలిప్పోట్‌ ఉక్రెయిన్‌లో జోక్యం చేసుకోవడానికి ప్రయత్నించినట్లయితే అధ్యక్షుడిని ఆపాలని చట్టసభ సభ్యులను కోరారు. ఎమ్‌పి జీన్‌-లూక్‌ మెలెన్‌చోన్‌ మాక్రాన్‌ ఆలోచనను ”పిచ్చి” అని పిలిచారు. ఇది అణ్వాయుధాలు కలిగిన దేశాలను పరస్పరం తలపడేలా చేయటమే అవుతుందని ఆమె పేర్కొంది.
మక్రాన్‌ ప్రకటనకు వ్యతిరేకంగా రష్యా ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. అదే జరిగితే రష్యా-నాటో ఘర్షణ ”సంభావ్యత గురించి కాకుండా దాని అనివార్యత గురించి మాట్లాడవలసి ఉంటుంది” అని క్రెమ్లిన్‌ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్‌ ప్రెస్‌ కాన్ఫరెన్స్‌ లో పేర్కొన్నారు. పాశ్చాత్య నాయకులు తమ జాతీయ ప్రయోజనాలకు అది ఎలా ఉపయోగపడుతుందనే విషయం గురించి తీవ్రంగా ఆలోచించాలని పెస్కోవ్‌ అన్నాడు. ఫ్రెంచ్‌ అధ్యక్షుడు తన దేశీయ విధానాలపై విమర్శలను తిప్పికొట్టేందుకు ఉక్రెయిన్‌ సంక్షోభాన్ని ఉపయోగించుకుంటున్నాడని డూమా చైర్మెన్‌ వ్యాచెస్లావ్‌ వోలోడిన్‌ అన్నాడు.
ఫ్రెంచ్‌ ప్రెసిడెంట్‌ మక్రాన్‌ అమెరికా వదిలిపెట్టిన ”నాయకత్వ శూన్యతను పూరించడానికి ప్రయత్నించాడు”, కానీ అతని ప్రయత్నం ”బెడిసికొట్టింది” అని ది వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌తో విధాన నిపుణుడు జానా పుగ్లీరిన్‌ అన్నాడు. అతను ”అనవసరంగా నాటో లో చీలిక వచ్చేలా చేశాడు. నాటో సభ్య దేశాలు ఈ సమస్యపై చాలా సందేహాస్పదంగా ఉన్నాయి. యూరోపియన్‌ ఐక్యత , బలాన్ని ప్రోత్సహించ డానికి ఇది మార్గం కాదు” అని ఆయన అన్నాడు. ఈ పరాజయం ”నాటో కూటమిలో ఐక్యత గురించి గందర గోళానికి దారితీసిందని, మక్రాన్‌ వ్యాఖ్య కేవలం శుష్క బెదిరింపుగానే మిగిలిపోతుంది” అని న్యూయార్క్‌ టైమ్స్‌ రాసింది. మక్రాన్‌ ప్రతిపాదనను ”వేగంగా పంక్చర్‌ చేయబడిన ట్రయల్‌ బెలూన్‌”గా యుఎస్‌ఏ టుడే అభివర్ణించింది.