ప్రకృతి పానీయాలు ఆరోగ్యానికి మేలు

ప్రకృతి పానీయాలు ఆరోగ్యానికి మేలు– ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి
– గడియారం సెంటర్‌లో ఉగాది పచ్చడి పంపిణీ
నవతెలంగాణ-నల్లగొండ టౌన్‌
ప్రకృతిలో లభించే పానీయాల వల్ల ఆరోగ్యాలకు ఎంతో మేలు జరుగుతుందని, కృత్రిమ పానీయాల వల్ల ఆరోగ్యాలు పాడవుతాయని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు. మంగళవారం ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని నల్లగొండ జిల్లా కేంద్రంలోని గడియారం సెంటర్‌లో ‘హానికరమైన కృత్రిమ పానియాలు మానేద్దాం- ప్రకృతి పానియాలు సేవిద్దాం’ అనే నినాదంతో టీఎస్‌యూటీఎఫ్‌, జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఉగాది పచ్చడి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నర్సిరెడ్డి మాట్లాడుతూ.. ప్రకృతిలో జరిగే మార్పులను ఉగాది పండుగ సూచిస్తుందన్నారు. ఉగాది పచ్చడిలో ఉండే షడ్రుచులకు సంబంధించిన పదార్థాలు మానవ ఆరోగ్యానికి మేలు చేస్తాయన్నారు. కార్పోరేట్‌ శక్తుల లాభాలను పెంచేందుకే సీతల పానీయాలు వచ్చాయని, వాటిని తాగడం వల్ల అనారోగ్యమే తప్ప లాభం లేదని అన్నారు. మహేష్‌బాబు లాంటి సినిమా హీరోలు శీతల పానీయాల అడ్వర్టైజ్‌మెంట్‌లు ఇస్తూ యువతను పెడదారి పట్టిస్తున్నారని, అలాంటివారు నిజంగా హీరోలేనా సమాజానికి నిజమైన విలన్స్‌గా భావించాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. టీఎస్‌యూటీఎఫ్‌, జన విజ్ఞాన వేదిక సంయుక్తంగా పదేండ్లుగా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నందున వారిని అభినందిస్తున్నట్టు తెలిపారు. టీఎస్‌యూటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు జంగయ్య మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల కమిటీలు సమాజానికి మేలుకోరే ఇలాంటి కార్యక్రమాలు చేయాలని సూచించారు. శీతల పానియాలు తయారు చేసే కంపెనీలకు ప్రభుత్వాలు ఇబ్బడి ముబ్బడిగా రాయతీలు కల్పిస్తున్నాయని, ఆ రాయితీలను రద్దు చేయాలని కోరారు. టీఎస్‌యూటీఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావ రవి మాట్లాడుతూ.. శాస్త్రీయ ఆలోచనతోనే సమాజం ముందుకు పోతుందని, శాస్త్రీయ వైఖరులను అలవర్చుకునే యువత తమ భవిష్యత్‌ను ఉజ్వలంగా మలుచు కోగలుగుతుందని చెప్పారు. బహుళ జాతీయ సంస్థలు తమ స్వప్రయోజనాల కోసం మార్కెట్లోకి విచ్చలవిడిగా సరఫరా చేస్తున్న శీతల పానీయాలను తాగొద్దని ప్రజలను కోరారు. కార్యక్రమంలో సుమారు 800 మంది ప్రజలు ఉగాది పచ్చడి సేవించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి ఎం.రాజశేఖర్‌రెడ్డి, జీవీవీ రాష్ట్ర కార్యదర్శి వెంకటరమణారెడ్డి, టీఎస్‌యూటీఎఫ్‌ నల్లగొండ జిల్లా అధ్యక్షులు ఎడ్ల సైదులు, ప్రధాన కార్యదర్శి పెరుమాళ్ళ వెంకటేశం, జేవీవీ జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్‌రెడ్డి, టీఎస్‌యూటీఎఫ్‌ కోశాధికారి నర్రా శేఖర్‌రెడ్డి, జిల్లా కార్యదర్శులు జి.అరుణ, గేర నర్సింహ, నలపరాజు వెంకన్న, మురళయ్య, సోషల్‌ మీడియా కన్వీనర్‌ యరనాగుల సైదులు, వీఓ టి.భానుప్రసాద్‌, రవి, సైదులు పాల్గొన్నారు.