సహజ సిద్ధంగా…

సహజ సిద్ధంగా... కొబ్బరినూనె, నిమ్మరసం సమపాళ్లలో కలిపి మాడుకు పట్టించాలి. 15 నిమిషాల తర్వాత తలను రసాయనాలు తక్కువగా ఉన్న షాంపూతో శుభ్రం చేసుకోవాలి. ఇది చుండ్రును తొలగించటమే కాక జుట్టు సహజంగా నిగనిగలాడేలా చేస్తుంది. ఎ పెరుగులో లాక్టిక్‌ యాసిడ్‌, ప్రొటీన్లు అధికంగా ఉంటాయి. తాజా పెరుగును తలకు పట్టించండి. అది కురులకు రక్షణ కవచంలా సాయపడుతుంది. దీంట్లో కొద్దిగా మిరియాల పొడిని కలిపితే యాంటీ ఫంగల్‌గా పనిచేస్తుంది. 15 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. జుట్టుకు కావాల్సిన తేమ అందుతుంది. ఎ తాజా వేపాకులకు, నానబెట్టిన మెంతులు కలిపి మెత్తగా పేస్టు చేసుకొని తలకు పట్టించాలి. వీటిల్లోని యాంటీ బ్యాక్టీరియల్‌, యాంటీ ఫంగల్‌ గుణాలు శిరోజాలు రాలడం, చిట్లడం వంటి సమస్యలను కూడా తగ్గిస్తాయి. లేకపోతే కొన్ని ఆకులను నీళ్లలో వేసి కాచి చల్లారిన తర్వాత వాటితో తలను కడిగినా చుండ్రు నుంచి పరిష్కారం లభిస్తుంది. ఎ కలబంద ఎన్నో చర్మ సమస్యలతో పాటు దురద, దద్దుర్లు వంటి వాటినీ తగ్గిస్తుంది. కలబంద గుజ్జును తలకు రాసుకోండి. అర్ధగంట తర్వాత గాఢత తక్కువగా ఉన్న షాంపూతో తలస్నానం చేస్తే సరి. మాడుకు చల్లదనాన్నివ్వడమే కాదు చుండ్రునూ తొలగించి, కురులను మెరిసేలా చేస్తుంది.