భారత దేశమంటేనే వ్యవసాయానికి పుట్టినిల్లు అంటాం. అలాంటి దేశంలో ఒకవైపు వ్యవసాయ రంగం సమస్యలు, సంక్షోభాలను ఎదుర్కొంటుంది. అయితే ప్రజలకిప్పుడు ప్రకృతి వ్యవసాయమే వరప్రదాయిని అని చాలామంది రచయితలు కొత్త కొత్త పద్ధతులను చెప్తున్నారు.
గత మూడు దశాబ్దాలుగా సామ్రాజ్యవాద, ప్రపంచీకరణ విధానాలు వల్ల దేశంలో అధిక నష్టానికి గురైంది వ్యవసాయ రంగం. బహుజన బతుకమ్మ పదవ ఏడులోకి ప్రవేశిస్తూ వ్యవసాయ రంగాన్ని విధ్వంసకర సంస్కరణల ఊబిలోంచి బయటకు తీసుకువచ్చే అంశాన్ని భుజానికెత్తుకోవడం ఎంతో సరైందని, ఈ కృషిని అభినందించడం ఈ పుస్తకం ముందుమాటగా చూడవచ్చు.
ప్రముఖ రచయిత్రి కొల్లాపురం విమల ‘మట్టితో చెలిమి – ప్రకృతి మాలిమి’ అనే శీర్షికలో మారిన పంటల విధానాలు, ఆహారపు అలవాట్లు ఎలా భూమిని నిర్వీర్యం చేస్తున్నాయో వివరించారు. ఆధునిక సమాజంలో వ్యవసాయానికి తగినంత ప్రాధాన్యత లేదని, అధిక దిగుబడి కోసం వాడే ఎరువులు మనిషి శరీరంలోకి ప్రవేశించి అనూహ్య రోగాలకు కారణమవుతున్న విధానాన్ని మోహన్ పొడుపుగంటి తన వ్యాసంలో విశదీకరించారు. ఇమ్మిడి మహేందర్ అనే పరిశోధక విద్యార్థి తన వ్యాసంలో నాకిష్టమైన టమాటా కూర సరిగా ఉడకడం లేదని, ఎక్కడికిపోయినా ఆ సమస్య తీరడం లేదని చెప్తూ దానికి కారణం జన్యులోపం వున్న హైబ్రిడ్ టమాటా విత్తనం అంటూ ఉడికే టమాట విత్తనం నేటి వ్యవసాయంలో కనుమరుగైందని చెప్పాడు.
పెట్టుబడిలేని ప్రకృతి వ్యవసాయం వల్ల అధిక లాభం వస్తుందని ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్‌లో గుర్తించడం వల్ల రసాయనాలు వాడకుండా అతి తక్కువ సొమ్ముతో లాభాలు వచ్చే పంటలు పండిస్తున్నారని విశ్రాంత ఆచార్యులు డాక్టర్ లక్ష్మి అన్నారు.’లాభం’ ప్రధానంగా భావించే పెట్టుబడిదారి వర్గం చేతుల్లోకి వ్యవసాయ రంగం పోయాక రసాయనాలతో పండించుకొని తింటున్న తిండితో మన శరీరాలు రోగాల పుట్టలౌతున్నాయని కార్పొరేట్ వ్యవసాయ విధానాన్ని దూరం చెయ్యడమే తక్షణ పరిష్కారమని ఎనిశెట్టి శంకర్ వివరిస్తున్నాడు. వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ ఇనుప కౌగిళ్లలోకి పోకుండా కాపాడుకోవాలని, వ్యవసాయాన్ని సామాజీకరించి ప్రపంచానికి అన్నం పెట్టే రైతుకు సమున్నత స్థానం కల్పించడం కోసం సమస్త జనావళి ఉద్యమించాలంటారు జిల్లెళ్ల అనసూయ.
– ఎనిశెట్టి శంకర్, 9866630739