– సీపీఐ(ఎం) తెలంగాణ, ఏపీ కార్యదర్శుల సంతాపం
ఒంగోలు : పీఎల్ఆర్ బ్రదర్స్ వ్యాపార సంస్థల అధినేత, నవతెలంగాణ సీజీఎం పి ప్రభాకర్ సోదరుడు పంగులూరి ప్రసాదరావు (63) అనారోగ్యంతో ఒంగోలులోని కేశవస్వామి నగర్‌లోగల తన స్వగృహంలో బుధవారం కన్నుమూశారు. ఆయనకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. ప్రసాదరావు భార్య సునీత రెండేండ్ల క్రితం మృతి చెందారు. చీమకుర్తి మండలం కెవి పాలేనికి ప్రసాదరావు గ్రానైట్, కంకర, క్వారీయింగు బిజినెస్‌లో గత మూడు దశాబ్దాలుగా మంచి
పేరున్న వ్యాపారవేత్తగా ఎదిగారు. పీఆర్ఎల్ ప్రసాద్‌గా ఆయన అందరికీ చిపరిచితులు. ఆయన భౌతికకాయాన్ని సీపీఐ(ఎం) ఏపీ రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, మాజీ ఎంపీ, సీపీఐ(ఎం) రాష్ట్ర మాజీ కార్యదర్శి పి.మధు సందర్శించి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు వై.సిద్దయ్య, జాలా అంజయ్య, నాయకులు జయరాం, పమిడి వెంకట్రావు, నగర కార్యదర్శి జి.రమేష్, పలువురు గ్రానైట్ రంగ ప్రముఖులు తదితరులు భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. ప్రసాదరావు సోదరుడు పి.ప్రభాకర్, కుటుంబసభ్యులను నేతలు పరామర్శించారు. గురువారం ఉదయం అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు కుటుంబసభ్యులు తెలిపారు. సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి వెంకట్, సీపీఐ(ఎం) రాష్ట్ర నాయకులు చెరుపల్లి సీతారాములు, ఎస్ వీరయ్య, పోతినేని సుదర్శన్, టి జ్యోతి తదితరులు సంతాపం ప్రకటించారు. నవతెలంగాణ ఇన్చార్జి ఎడిటర్ ఆర్ రమేశ్, బోర్డు సభ్యులు, జనరల్ మేనేజర్లు, మేనేజర్లు, సిబ్బంది సంతాపం ప్రకటించారు.