– ఉత్తర్వులు జారీ చేసిన అదనపు కలెక్టర్ శ్రీనివాస్
– ఫలించిన జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ పోరాటం
– చట్టాలపై గౌరవం పెంచిన అధికారులు
– హర్ష వ్యక్తం చేస్తున్న జిల్లా ప్రజలు, జర్నలిస్టులు
నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్
చట్టం ముందు అందరూ సమానులే.. తప్పు చేస్తే ఎంతటి పెద్దవారినైనా శిక్షించాల్సిందే. కానీ చాలాసార్లు ఇది జరిగే అవకాశం లేదు. కానీ నల్లగొండ జిల్లా అధికార యంత్రాంగా మాత్రం ఇది చేసి చూపించింది. నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఎనిమిది మంది జర్నలిస్టులు జీవో నెంబర్ 59 లోని లొసుగులను ఆసరా చేసుకొని ఇరిగేషన్ శాఖకు చెందిన కోట్ల విలువ చేసే భూమిని గత ఏడాది అక్రమంగా చేసుకున్న రిజిస్ట్రేషన్ లను రద్దుచేసి పారేశారు. వివరాల్లోకి వెళితే నల్లగొండ జిల్లా కేంద్రంలో న్యాయం, ధర్మం కాపాడే నాలుగవ స్తంభం ముసుగు వేసుకున్న ఎనిమిది మంది జర్నలిస్టులు తప్పుడు ధృవీకరణ పత్రాలను సృష్టించి వారికున్న బలంతో.. రాజకీయ నాయకులతో ఒత్తిడి తీసుకువచ్చి అధికారులను తప్పుదోవ పట్టించి కోట్ల విలువ చేసే ప్రభుత్వ స్థలాన్ని దోచుకున్నారు. జీవోనెంబర్ 59 ప్రకారం జర్నలిస్టులు నకిలీ పత్రాలను సృష్టించి గత ఏడాది జూలై 28న నలగొండ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఇరిగేషన్ ల్యాండ్ ను రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. దీనిపై జిల్లాలోని జర్నలిస్టు సంఘాలు ఒక్కతాటిపైకి వచ్చి అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసి నల్లగొండ జిల్లా జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ ని ఏర్పర్చి ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. కాగా అక్రమ రిజిస్ట్రేషన్ల విషయాన్ని మొట్టమొదటిసారిగా నవతెలంగాణ పత్రికలో గత ఏడాది అక్టోబర్ 13 తేదీన దోచుకున్నోనికి దోచుకున్నంత కథనాన్ని ప్రచురితం చేసింది. ఆ తర్వాత నల్లగొండ జిల్లా జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ ఆధ్వర్యంలో జర్నలిస్టులు నల్లగొండ పట్టణం బస్టాండ్ నుండి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించి అప్పటి కలెక్టర్ ఆర్వి. కర్ణన్ ను కలిసి అక్రమ పట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తదనంతరం నల్లగొండ జిల్లా జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ ఆధ్వర్యంలో వరుసగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. నల్లగొండ జిల్లా జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ కి మద్దతుగా, అక్రమ రిజిస్ట్రేషన్ లను రద్దు చేయాలని కోరుతూ నవతెలంగాణ పత్రికలో వరుస కథనాలు ప్రచురితమయ్యాయి. విలేకరుల ముసుగులో ప్రభుత్వ భూమి క్రమబద్ధీకరణకై చర్యలు, రద్దు చేయాల్సిందే చర్యలు తీసుకోవాల్సిందే, స్థలాలు కాపాడుకునేందుకు యత్నాలు.. ఇప్పటికే ప్రభుత్వ పెద్దలను కలిసిన అక్రమ పట్టాదారులు, భూ ఆక్రమణపై చర్యలు తీసుకోవాలి, జిల్లా ప్రధాన అధికారి ఆదేశాలు అమలయ్యేనా, భూ కుంభకోణం పై కొనసాగుతున్న విచారణ, వంటి వరుస కథనాలు ప్రచురితమయ్యాయి.

జిల్లా మంత్రి ప్రత్యేక చొరవ..
అక్రమ భూ రిజిస్ట్రేషన్ల పట్టాలను రద్దు చేసే విషయంలో రాష్ట్ర రోడ్డు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రత్యేక శ్రద్ధ కనబరిచారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి నల్లగొండ జిల్లా జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ ఆధ్వర్యంలో పలుమార్లు విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో స్పందించిన మంత్రి విషయంపై ప్రత్యేక చొరవ తీసుకొని అక్రమ రిజిస్ట్రేషన్లు రద్దు అయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం అక్రమ రిజిస్ట్రేషన్లు రద్దు కావడంతో అక్రమ రిజిస్ట్రేషన్లకు పాల్పడ్డ వారిపై, అదేవిధంగా వారికి సహకరించిన అధికారులపై చట్టపరమైన, శాఖ పరమైన చర్యలు తీసుకునేలా అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని నల్లగొండ జిల్లా జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ సభ్యులు మంత్రి కోమటిరెడ్డి ని కోరుతున్నారు.