ఛత్తీస్‌గఢ్‌లో నక్సల్స్‌ దాడి

–  ముగ్గురు సిఆర్‌పిఎఫ్‌ సిబ్బంది మృతి-14 మందికి గాయాలు
సుక్మా (ఛత్తీస్‌గఢ్‌) : ఛత్తీస్‌గఢ్‌లో సుక్మా-బిజాపూర్‌ జిల్లాల సరిహద్దుల్లో మంగళవారం నక్సలైట్లు చేసిన దాడిలో ఇద్దరు కమాండోలతో సహా ముగ్గురు సిఆర్‌పిఎఫ్‌ సిబ్బంది మరణించారు. మరో 14 మంది సిబ్బంది గాయపడ్డారు. జిల్లాల సరిహద్దులోని టేకులగూడెం అడవుల వద్ద వద్ద భద్రతా సిబ్బంది సంయుక్తంగా తనిఖీలు చేస్తుండగా నక్సలైట్లు ఒక్కసారిగా దాడికి పాల్పడ్డారని బస్తర్‌ రేంజ్‌ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ సుందర్‌రాజ్‌ మీడియాకు తెలిపారు. టేకులగూడెంలో సోమవారమే సిఆర్‌పిఎఫ్‌ సిబ్బంది కొత్తగా ఒక శిబిరాన్ని ఏర్పాటు చేసుకున్నట్లు ఆయన తెలిపారు. మంగళవారం సిఆర్‌పిఎఫ్‌, సిఆర్‌పిఎఫ్‌కు చెందిన కోబ్రా (కమాండో బెటాలియన్‌ ఫర్‌ రిజల్యూట్‌ యాక్షన్‌), స్పెషల్‌ టాస్క్‌ ఫోర్స్‌, జిల్లా రిజర్వ్‌ గార్డ్‌కు సంబంధించిన సిబ్బంది సంయుక్తంగా జోనగూడ-అలిగూడా గ్రామాల్లో తనిఖీలు చేస్తుండగా ఈ దాడి జరిగిందని చెప్పారు.. మరణించినవారిలో ఇద్దరు కోబ్రా 201 బెటాలియన్‌కు, మరొకరు సిఆర్‌పిఎఫ్‌ 150వ బెటాలియన్‌కు చెందినవారుగా చెప్పారు. గాయపడిన సిబ్బందిని ఆసుపత్రులకు తరలించినట్లు చెప్పారు. దాడి చేసిన తరువాత నక్సలైట్లు అక్కడి నుంచి పారిపోయారని, గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. కాగా, ఇదే టేకులగూడెం అడవుల్లో 2021 ఏప్రిల్‌లో నక్సలైట్లు జరిపిన దాడిలో 23 మంది భద్రతా సిబ్బంది మరణించారు.