ఎన్‌సీఈఆర్టీ కమిటీ సిఫారసు ప్రజావ్యతిరేకం

NCERT committee recommendation is anti-public– వాటిని నిర్ద్వందంగా తిరస్కరించాలి : ఎమ్మెల్సీ నర్సిరెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎన్‌సీఈఆర్టీ) నియమించిన కమిటీ పాఠ్యపుస్తకాల్లో ఇండియాకు బదులుగా భారత్‌ అనే పేరును చేర్చా లంటూ సిఫారసు చేయడం ప్రజావ్యతిరేకమని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి విమర్శించారు. ప్రాచీన చరిత్ర స్థానంలో పురాతన చరిత్రను చేర్చాలనీ, హిందూ రాజుల విజయాలను చరిత్రలో ఎక్కువగా చెప్పాలని సిఫారసు చేయడం నయవంచనతో కూడినదని గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. వాటిని పరిశీలిస్తే ఆ కమిటీలో ఒక్కరికీ భారతదేశంపైగానీ, ప్రజల ఆలోచనా విధానంపైగానీ, భారత స్వాతంత్య్రోద్యమ లక్ష్యాలు, రాజ్యాంగంపై అవగాహ న లేని మూక గుంపుగా పరిగణించాల్సి ఉంటుందని విమర్శించారు.
ఇలాంటి వ్యక్తులతో కమిటీ వేసిన ఎన్‌సీఈఆర్టీ చైర్మెన్‌, సభ్యులనూ తప్పుపట్టాల్సి వస్తుందని తెలిపారు. విద్యారంగంలో భారత దేశానికి దిక్సూచిగా పని చేయా ల్సిన సంస్థ నేడు మూర్ఖులతో, అజ్ఞానులతో నిండి పోయిందా?అని అనిపిస్తు న్నదని పేర్కొన్నారు. పాఠశాలల్లో ప్రతిజ్ఞా పాఠంలో ‘భారత దేశం నా మాతృ భూమి’ అంటూ తెలుగులో, ‘భారత్‌ మేరా దేశ్‌హై’ అంటూ హిందీలో, ‘ఇండియా ఈజ్‌ మై కంట్రీ’ ఇంగ్లీష్‌లో ఉన్నదని గుర్తు చేశారు. రాజ్యాంగం లోనూ ఇండియా, భారత్‌ అనే రెండు పదాలున్నాయని వివరిం చారు. ఇప్పటి కిప్పుడు ఇండియా పదం పాఠ్య పుస్తకాల్లో కన్పించకూడదంటే సిఫారసు చేసిన ఆ కమిటీ ఏ స్థాయిలో దిగజారిందనేది భావించాలని తెలిపారు.
సమైక్యతకు భంగం కలిగించే సిఫారసులను వెనక్కి తీసుకోవాలి
గతంలో జరిగిన దాన్ని చెప్పే చరిత్ర అంటారని నర్సిరెడ్డి పేర్కొన్నారు. కల్పించి చెప్పేది పురాణమని వివరించారు. చరిత్ర వాస్తవాలను చెప్పాలిగానీ ప్రస్తుత కేంద్ర పాలకులకు ఇష్టమైన రీతిలో చెప్పేది చరిత్ర కాదని తెలిపారు. అలెగ్జాండర్‌ జీలం నది దాటి పోరస్‌ రాజును ఓడించడానికి సహకరించింది హిందూ రాజని గుర్తు చేశారు. ఘోరీ మహమ్మద్‌ను 17 సార్లు ఓడించింది, రాజపుత్రులనే చరిత్ర చెప్తుందని వివరించారు. మౌర్యుల చరిత్ర, గుప్తుల చరిత్ర, శాతవాహనుల చరిత్ర, విజయనగర సామ్రాజ్య చరిత్ర చెప్తున్న క్రమంలోనే మొగలుల చరిత్రనూ చెప్పాల్సి వస్తుందని తెలిపారు. శివాజీ చరిత్రను చెప్తున్నామని పేర్కొన్నారు.
ప్రస్తుతమున్న పాఠ్యపుస్తకాల్లో జరిగిన చరిత్రనే నేర్చారని వివరించారు. ఏ రాజు విజయం సాధిస్తే వారిపేరే చరిత్రలో ఉందని తెలిపారు. కాకతీయుల చరిత్ర, పాండ్యుల చరిత్ర, చోళుల చరిత్ర, కుతుబ్‌షాహీల చరిత్ర, అసఫ్‌జారుల చరిత్ర అంటూ చదువుకుంటున్నామని పేర్కొన్నారు. ఇది వాస్తవమని వివరించారు. ఎక్కడ హిందూ రాజుల చరిత్ర, ముస్లిం రాజుల చరిత్ర అంటూ ఆనాడు లేదని తెలిపారు. లేనిది చేర్చాలంటూ కమిటీ సిఫారసు చేయడమంటే వారికి పిచ్చి పట్టి ఉండాలనీ, లేదంటే ఆ కమిటీ పిచ్చొళ్ల చేతుల్లోనైనా ఉండాలని విమర్శించారు. దేశ సమైక్యతకు భంగం కలిగించే ఇలాంటి సిఫారసులను వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు.