నీహారిణి కవిత్వం – మెత్తని స్త్రీవాదం

Neeharini's Poetry - Soft Feminismకవిత్వ శైలి కవి వ్యక్తిత్వానికి అద్దంలాంటిది. కొందరి కవితలు ఒక పోతపోసిన శిల్పంలా వుంటాయి. శిల్పేతరమేది వెతికినా కనిపించనంతటి సునిశిత కార్వింగ్‌ వుండే పోయెమ్స్‌ అవి. అయితే అవి రూపవాదుల కవిత్వం ఎంత మాత్రం కాదు. రూప స్పృహ వున్న వస్తువాదుల కవితలే అలా వుంటాయి. అమ్మంగి వేణుగోపాల్‌ ‘బాలన్స్‌ ఇరవై’ అనే కవితలో వస్తువు చాలా స్పష్టం. ‘ఇంకా ఇరవై ఏళ్ల ఆయువుంది నాకు’ అని శీర్షికలోనే స్పష్టం చేస్తూ రాసిందది. కవితా నిర్వహణ శిల్పాన్ని భౌతికంగా చెక్కినట్లు ఒక్క వ్యర్థ పదం లేకుండా జాగ్రత్తపడ్డారు.
”దేహానికి డెబ్పై/ కలానికి యాభై/ తీసివేతను నమ్మినా/ బాలన్స్‌ ఇరవై/ చెక్‌ బౌన్సయ్యేదాకా/ చూద్దాం” అనడం ఎలా వుందో, పాదాలూ అలానే బ్లేడ్‌తో కట్‌ చేసినట్లుంటాయి. కొందరు కవులు వస్తువును వాచ్యం చేస్తూ రాసినా ఎఫెక్టివ్‌గా రాస్తారు. అలా రాయడంలో కవితంతా మనసుకు హత్తుకోదు కానీ ఆ కవితలోని కొన్ని పాదాలు/ పాదం పాఠకుడిని అబ్బురపరుస్తాయి. సమాజంలోని మంచీచెడులను తులనచేస్తూ ఒక కవితలో ఇమడ్చడం డా||సి.నారాయణరెడ్డికి బాగా తెలిసిన విద్య. ఒక చోట కవితలో మధ్య భాగంగా ”బియ్యంతో వియ్యమందే పలుగురాళ్లు/ పాలతో తాదాత్మ్యంచెందే పంపునీళ్లు” అంటారు. ఈ పాదాలు కవిత నుండి విడదీసినా స్వతంత్ర అస్థిత్వం కలిగి వుంటాయి. ఇలాంటి కవిత్వం కొండపల్లి నీహారిణి సంపుటిలో చాలా దొరుకుతుంది.
డా||కొండపల్లి నీహారిణి కవిత్వం వస్తువు చుట్టూనే తిరుగుతుంది కానీ మరికొన్ని వస్తువులు అందులో వచ్చి చేరతాయి. చాలా కవితల్లో అవి మరో వస్తువు మీద రాయదలిచి ప్రారంభించినదైనా అన్‌కాన్షియస్‌గా స్త్రీ పక్షపాత స్వరం వచ్చి చేరుతుంది. అయితే అది రాడికల్‌ ఫెమినిజం కాదు. భారతీయ సంప్రదాయం మీద స్పష్టమైన ప్రేమ కూడా వుంటుంది. దేశీయ తాత్విక చింతనతో కూడిన ఆర్థ్రత ఆమె కవిత్వంలో గుర్తించదగిన మరో విలక్షణత. అన్ని సందర్భాలతో వ్యక్తీకరణలో సారళ్యతే వుంటుంది.
2011లో వచ్చిన ‘అర్ర తలుపులు’లో ప్రధానంగా నోస్టాల్జియా పాఠకుడిని ఆకర్షిస్తుంది. 2012లో వచ్చిన ‘నిర్నిద్రగానం’లో తెలంగాణ ఆకాంక్ష బలంగా వినిపిస్తుండగా, 2017లో ప్రచురించిన ఎనిమిదో అడుగులో రాష్ట్ర సాకారానంద అనే కవితల్లో వ్యక్తమవుతుంది. 2021 కాలప్రభంజనంలో కరోనా విధ్వంసం ప్రధాన వస్తువయింది.
ఒక కవితలో అనేక విషయాలను, భిన్న వస్తువులను నీహారిణిగారి కవిత్వంలో తరచూ గమనించవచ్చు. ‘అర్ర తలుపులు’ సంపుటిలోని ‘అర్ర తలుపుల అల్లాట’ను ”పట్నం నుండి పల్లెకు పోయిన దారిలా/ సర్రుమంటుంది నా మనసు!/ డాబయిన డాంబరు రోడ్డుపై బరువైన గుండెతో/ నా కాలి నడక!/ గుడిసెలోని గుడ్డిదీపం లైట్‌గా బుగ్గగా మారినట్టు/ అనుకరణ జీవితం విచ్చుకుంంది” అని ప్రారంభిస్తారు. ఇక్కడ పల్లెలో వచ్చిన మార్పులు సూచిస్తూ ‘అనుకరణ’ అనే మాట వాడారు. నిజానికి నిర్ద్వందంగా రోడ్లు, లైట్లు అభివృద్ధి చిహ్నాలే. అయితే ఇదంతా పల్లె ముచ్చట. కవిత ఇలా కొనసాగుతుంది… ”పెళ్లిదాకా రాని ప్రేమలు, హత్యలు, ఆత్మహత్యలు/ జాయింట్‌ ఫ్యామిలీలు కనుమరుగైన పాపానికి/ గర్భశోకాలే మిగులుతున్నాయి” ఇంది ఇంకో వస్తువు. ముగింపులో ఇంకో భిన్నమైన విషయాన్ని చెబుతూ… ”వ్యసనాల తిమింగలాలకు చిక్కొద్దన్న/ సంసారుల ప్రయత్నాలు/ పండుగకు కొన్న బట్టల్లా మెరుస్తున్నాయి” అంటారు. అయితే సమాజంలో జరిగే ఇన్ని రకాల అస్తవ్యస్థతలు నా మనసు అర్రలో బందీ అయ్యాయంటూ ముగిస్తారు. ఈ ముగింపులో భిన్నవస్తువులను ఏకసూత్రతతో బంధిస్తారు. ఇదే కవయిత్రి విలక్షణత.
‘బంధిస్తే గాలినో వెలుతురునో బంధించండి అర్ర మందారాలను బంధించవద్దని’ కాలప్రభంజనంలో ఒక కవిత వుంది. ఆడోళ్ల బతుకమ్మ ప్రత్యేకంగా సంస్కృతిలో సగానికన్నా ఎక్కువైన స్త్రీ గురించి రాస్తారు. ఇదంతా స్త్రీ పక్షపాతం వహించగలిగే కవితలు. కానీ వ్యవసాయ దైన్యం గురించి హాలిని హాలికుడు రాశారు… ”ఏరువాక దుక్కిదున్నే నాగలౌతూ అతడు/ ఎండపూట సద్దిమూటలు గంపలైతూ ఆమె” అన్న పాదాలు ఆమెలో వస్తువు ఏదైనా అన్‌కాన్షియస్‌గా స్త్రీ స్పృహ అగ్రీకరణం చెందుతుందని చెప్పడానికి ఉదాహరణగా నిలుస్తాయి. అయితే పురుషాహంకార విమర్శలో కాఠిన్యం కానీ, దురుసుతనం కానీ ఏ కవితలోనూ కనిపించదు.
భారతీయ సంప్రదాయ ముద్ర నీహారిణిగారి మీద బలంగా వుంది. అది కవిత్వం అధ్యయనం లోతుగా చేసిన వాళ్లకే కాకుండా శీర్షికల ద్వారా కూడా ధ్వనిస్తుంది. మొదటి సంపుటి ‘అర్ర తలుపులు’ గ్రామీణ జీవితానికి ఒక సంకేతాత్మకమైన వ్యక్వీకరణ లాంటి పేరు. నిర్నిద్రగానంలో సంస్కృత భాషాప్రేమతో పాటు, తాత్వికత కూడా వుంది. ఎనిమిదో అడుగు అనివార్యంగా సప్తపదిని గుర్తుకు తెస్తుంది. కాలప్రభంజనం మనిషి జీవిత అశక్తత, పరిమితత్వం వ్యక్తపరుస్తుంది. ఈ సంపుటాలలో కవిత్వం కూడా శీర్షికాంశాలను విస్తరిస్తూ పోతుంది.
రాసే వస్తువులతో తాదాత్మ్యం చెందడం వల్ల నీహారిణి కవితల్లో మెరుపులాంటి ఆర్ధ్ర వాక్యాలు సృష్టింపబడతాయి. నిర్నిద్రగానంలోని కల్తీలో ఒక జీవితంలో ముంగింపు వాక్యంలో ”నువ్వు సీసాలు ఖాళీ చేస్తుంటే/ కన్నీటితో నింపుతుంది ఆమె!” అంటారు. ఇంకో చోట కాలం ఎంత శక్తివంతమైనదో చెపుతూ… ”నేను కాలాన్ని/ ఎంతకూ వెనక్కి తిరిగిరాని దాన్ని/ నిస్తేజాన్ని అసలే సహించని అమ్ముల పొదిని” అంటారు. మరోచోట నగరం గురించి రాస్తూ ఇలా చెబుతారు… ”బర్ముడా ట్రయాంగిల్‌కున్నంత/ ఆకర్షణతో/ అందర్నీ తనలో ఇముడ్చుకుంటుంది/ శోధనకు అందని గుండం/ పరిశోధనకు దొరకని సంద్రం/ పట్నం”.
ఇక వర్తమాన రాజకీయ నాయకుల వ్యవహార శైలిని విమర్శిస్తూ విలక్షణ వ్యక్తీకరణ చేస్తారు చూడండి… ”నాలుకకు నరం లేనోడే/ నాయకుడీనాడు/ లోభులను ప్రలోభపెట్టడం/ అతని క్రీడ”.
సాహిత్యంలోని వివిధ ప్రక్రియలను అర్థవంతంగా సృజిస్తున్న నీహారిణి గారి కవిత్వంలో సంప్రదాయ స్త్రీవాదం, పురోగామి దృక్పథం జమిలిగా కనిపిస్తాయి. వీరి కాల ప్రభంజనం టెంపెస్ట్‌ ఆఫ్‌ టైమ్‌గా డా||ఎలనాగ చేత అనువాదం చేసి ప్రచురించడం వారి కవిత్వ అభివ్యక్తికి సూచిక.
– ఏనుగు నరసింహారెడ్డి, 8978869183