నీరజ్‌ వస్తున్నాడు..!

నీరజ్‌ వస్తున్నాడు..!– జావెలిన్‌ త్రో అర్హత రౌండ్‌ నేటి నుంచి
– జర్మనీతో హాకీ ఇండియా సెమీస్‌ నేడు
పారిస్‌ : భారత సూపర్‌స్టార్‌ అథ్లెట్‌, టోక్యో ఒలింపిక్స్‌ గోల్డ్‌ మెడలిస్ట్‌ నీరజ్‌ చోప్రా నేడు పారిస్‌ బరిలోకి దిగుతున్నాడు. మెన్స్‌ జావెలిన్‌ త్రో విభాగం అర్హత రౌండ్‌లో కిశోర్‌ కుమార్‌ జెనాతో కలిసి నీరజ్‌ చోప్రా పోటీపడనున్నాడు. నేడు మధ్యాహ్నాం 1.50 గంటలకు జావెలిన్‌ త్రో అర్హత రౌండ్‌ ఆరంభం కానుంది. టాప్‌-12 అథ్లెట్లు లేదా 84 మీటర్లు అందుకున్న అథ్లెట్లు ఫైనల్స్‌కు అర్హత సాధిస్తారు. గ్రూప్‌-బిలో ఉన్న నీరజ్‌ చోప్రా 3.20 గంటలకు బల్లెం విసరనున్నాడు. ఇక భారత గుండెచప్పుడు హాకీ ఇండియా కీలక సెమీఫైనల్‌ సైతం నేడే. వరల్డ్‌ చాంపియన్స్‌ జర్మనీతో భారత్‌ పోటీపడనుంది. వరుసగా ఆస్ట్రేలియా, గ్రేట్‌ బ్రిటన్‌లను ఓడించిన ఉత్సాహంలో ఉన్న భారత్‌.. చారిత్రక ఫైనల్‌పై కన్నేసి బరిలోకి దిగుతోంది. డిఫెండర్‌ అమిత్‌ రోహిదాస్‌పై ఓ మ్యాచ్‌ నిషేధం భారత్‌ 15 మందితో కూడిన జట్టులోనే సెమీస్‌లో తలపడనుంది. స్టార్‌ రెజ్లర్‌ వినేశ్‌ ఫోగట్‌ సైతం నేడు దంగల్‌కు సిద్ధం కానుంది. వినేశ్‌ పోటీపడుతున్న విభాగంలో క్వార్టర్‌ఫైనల్‌, సెమీఫైనల్‌ నేడే కావటంతో మెడల్‌ లక్ష్యంగా ఆమె బరిలోకి దిగుతుంది.