నీట్‌-యూజీ పరీక్షను రద్దు చేయాలి

– ఎంపీటీసీ ఏనుగు భరత్‌ రెడ్డి
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
నీట్‌ నిర్వహణలో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని బీఆర్‌ఎస్వి నాయకులు, మండల ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు ఏనుగు భరత్‌ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. కష్టపడి చదివి డాక్టర్‌ కావాలని కలలుగన్న విద్యార్థులపై, వారి తల్లిదండ్రుల ఆశలపై నీట్‌ వ్యవహారం నీళ్లు చల్లిందని ధ్వజమెత్తారు. ఫలితాలను మొదట ఈ నెల 14న విడుదల చేస్తామని ప్రకటించి, ఈ నెల 4న ఎన్నికల ఫలితాల విడుదల చేయడంపై సందేహాలు తలెత్తుతున్నాయని తెలిపారు. నీట్‌లో ఎలాంటి అక్రమాలు జరగలేదని మొదట వాదించిన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌, అక్రమాలు జరిగిన మాట నిజమేనని తాజాగా అంగీకరించారన్నారు. కానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలిపారు. నీట్‌ అక్రమాలు గుజరాత్‌, బీహార్‌లో వెలుగుచూడటం, అక్కడ ఎన్‌డీఏ కూటమి ప్రభుత్వాలే అధికారంలో ఉండటం సిగ్గుచేటన్నారు. వెంటనే నీట్‌ పరీక్షను రద్దు చేసి దేశవ్యాప్తంగా ఒకేసారి కాకుండా రాష్ట్రాల వారీగా నీట్‌ పరీక్ష నిర్వహించాలని డిమాండ్‌ చేశారు.