– 17 మందికే టాప్ ర్యాంక్
న్యూఢిల్లీ: ఇటీవల కాలంలో అత్యంత వివాదాస్పదంగా మారిన నీట్-యుజి 2024 సవరించిన ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) శుక్రవారం వెల్లడించింది. ఈ సవరించిన తుది ఫలితాల్లో 17 మందికే టాప్ ర్యాంక్ లభించింది. మే 5న నిర్వహించిన ఈ పరీక్షకు ముందుగా విడుదల చేసిన ఫలితాల్లో 67 మందికి టాప్ ర్యాంక్ లభించిన సంగతి తెలిసిందే. ఈ తరువాత గ్రేస్ మార్కులను ఉపసంహరించుకుని సవరించిన ఫలితాల్లో 61 మందికి టాప్ ర్యాంక్ లభించింది. తాజాగా శుక్రవారం విడుదల చేసిన ఫలితాల్లో కేవలం 17 మందికే టాప్ ర్యాంక్ లభించింది. ఫిజిక్స్‌లో ఒక ప్రశ్నకు రెండు సమాధానాలు వున్నాయని ఎన్‌టీఏ చెప్పిన తరువాత సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ తుది ఫలితాలను ప్రకటించారు. టాప్ 100 ర్యాంక్‌ల్లో 17 మంది 720 మార్కులకు 720 మార్కులు సాధించి టాప్ ర్యాంక్‌లో నిలవగా, ఆరుగురు 716 మార్కులు, 77 మంది 715 మార్కులు సాధించారు. మే 25న నిర్వహించిన నీట్ పరీక్షలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలపై సీబీఐ విచారణ జరుపుతోంది. ఆరు ఎఫ్‌ఐఆర్‌లను నమోదు చేసింది. అయితే నీట్-యుజి 2024 పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని కోరుతూ దాఖలైన పిటీషన్‌ను సుప్రీంకోర్టు ఇటీవల తిరస్కరంచిన సంగతి తెలిసిందే.