– పెరిగిన ట్రాఫిక్‌తో తప్పని ఇబ్బందులు
– కేంద్రం నిర్లక్ష్యం
– వదిలేసిన బీఆర్‌ఎస్ సర్కారు
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
తెలుగు రాష్ట్రాలను కలిపే రెండు ప్రధాన రహదారులపై అటు కేంద్రం, ఇటు గత రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంగా ఉన్నాయి. రాష్ట్ర పునర్విభజన చట్టంలో ఇచ్చిన హామీ ప్రకారం ఆరు లేన్లుగా అభివృద్ధి చేయాల్సిన హైదరాబాద్-విజయవాడ రహదారి పదేండ్లవుతున్నా విస్తరణకు నోచుకోలేదు. అలాగే, పెరిగిన ట్రాఫిక్ అవసరాలకు అనుగుణంగా గత ప్రభుత్వం హైదరాబాద్-కల్వకుర్తి మార్గాన్ని ఆరు లేన్లుగా విస్తరించే విషయమై ఆశించినస్థాయిలో కేంద్రంపై ఒత్తిడి తేలేకపోయింది. దీంతో ఈ రెండు మార్గాల్లో రోజురోజుకూ ట్రాఫిక్ ఇబ్బందులు తీవ్రమవుతున్నాయి. తాజా కాంగ్రెస్ సర్కారు, ఎన్నికల తర్వాత ఈ సమస్యపై దృష్టిసారించే అవకాశాలున్నాయి.
ఎన్‌హెచ్-65
హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి(ఎన్‌హెచ్-65)ని ఆరు లేన్లతో ఎక్స్‌ప్రెస్‌వేగా అభివద్ధి చేయనున్నట్టు రాష్ట్ర పునర్విభజన చట్టం ద్వారా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ రహదారిని తెలంగాణ ఆవిర్భావానికి ముందే 2012లో బీవోటీ(టోల్) పద్ధతిలో నాలుగు లేన్లుగా విస్తరించారు. కాంట్రాక్టు సంస్థ అయిన జీఎంఆర్ హైదరాబాద్-విజయవాడ ఎక్స్‌ప్రెస్ లిమిటెడ్, జాతీయ రహదారుల శాఖ మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం 2024 వరకు దీన్ని హైదరాబాద్ నుంచి విజయవాడలోని నందిగామ వరకు ఆరు లేన్లుగా పనులు చేపట్టాల్సి ఉంది.
అయితే ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని సుమారు 40 కిలోమీటర్లమేర రోడ్డును ఎనిమిది లేన్లుగా విస్తరిస్తున్నారు. ఈ ఏడాది అక్టోబర్ నాటికి ఈ పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. గ్రేటర్ పరిధి నుంచి నందిగామ వరకు దాదాపు 221 కిలోమీటర్లమేర ఆరు లేన్లుగా రహదారిని అభివద్ధి చేయాల్సి వుంది. ఒప్పందం ప్రకారం ఏప్రిల్ 2024 నాటికి ఈ రోడ్డు సిద్ధం కావాలి. ప్రస్తుతం ఈ రోడ్డుపై రోజూ 50వేలకుపైగా వాహనాలు తిరుగుతున్నట్టు టోల్ ప్లాజా లెక్కలు చెబుతున్నాయి. అయితే రాష్ట్ర విభజన వల్ల ఈ రోడ్డుపై ట్రాఫిక్ తగ్గిందనీ, ముఖ్యంగా ఏపీ నుంచి ఇసుక లారీల రాక నిలిచిపోయిందనీ, ఫలితంగా తమకు టోల్ ద్వారా వచ్చే ఆదాయం కూడా పడిపోయందంటూ ఆరు లేన్లుగా విస్తరించడం సాధ్యంకాదంటూ చివరకు జీఎంఆర్ సంస్థ చేతులెత్తేసింది. మరోవైపు, ఇది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల రాజధానులను కలిపే ముఖ్యమైన రోడ్డు కావడంతో ఈ మార్గంలో రోజూ ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతున్నాయి.
ముఖ్యంగా పండుగల సందర్భంగా టోల్ ప్లాజాలవద్ద ట్రాఫిక్ జామ్ ఏర్పడి కిలోమీటర్ల పొడవునా వాహనాలు నిలిచిపోతున్న సంగతి తెలిసిందే. టోల్ రట్యాక్స్ చెల్లించే వాహనదారులకు తగిన సౌకర్యాలు కల్పించాల్సిన జాతీయ రహదారుల సంస్థ(ఎన్‌హెచ్‌ఏఐ) నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుండగా, సమస్య పరిష్కారానికి చొరవ చూపాల్సిన గత ప్రభుత్వం ఆశించినస్థాయిలో చొరవచూపలేదు.
హైదరాబాద్-కల్వకుర్తి మార్గం…
హైదరాబాద్ నుంచి నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి వరకు ప్రస్తుతమున్న ఎన్‌హెచ్-765ని నాలుగు లేన్లుగా విస్తరించేందుకు గత పభుత్వం ప్రణాళికను కేంద్రానికి పంపింది. కేంద్ర జాతీయ రహదారుల సంస్థ(ఎన్‌హెచ్‌ఏఐ) మహబూబ్‌నగర్ జిల్లా కల్వకుర్తి నుంచి కొల్లాపూర్, కరివెన మీదుగా ఏపీలోని నంద్యాల వరకు ఎన్‌హెచ్-167కే పేరుతో కొత్త జాతీయ రహదారి నిర్మాణం చేపట్టింది. దీన్ని కల్వకుర్తి వద్ద ఎన్‌హెచ్ 765కి అనుబంధంగా నిర్మిస్తున్నారు. దీంతో నాగర్‌కర్నూల్ జిల్లాలోని కల్వకుర్తి, కొల్లాపూర్, సోమశిలతోపాటు ఏపీలోని ఆత్మకూరులోగల వెనుకబడ్డ ప్రాంతాలకు ఎంతగానో ప్రయోజనం చేకూరనున్నది. అంతేకాదు, ఈ ప్రాజక్టులో భాగంగా సోమశిల వద్ద కష్ణానదిపై వంతెన నిర్మాణం కూడా చేపట్టే ప్రతిపాదన ఉంది. దీంతో హైదరాబాద్ నుంచి తిరుపతి, చెన్నరులకు ప్రయాణ దూరం దాదాపు 80 కి.మీ దాకా తగ్గనుంది. దీన్ని కల్వకుర్తి వద్ద ఎన్‌హెచ్ 765కి అనుబంధంగా నిర్మిస్తుండగా, ఎన్‌హెచ్ 765హైదరాబాద్‌ను శ్రీశైలంతో కలుపుతుంది. ప్రస్తుతం ఎన్‌హెచ్-765పై 15 వేల వాహానాల వరకూ(పీసీయు, ప్యాసింజర్ కార్ యూనిట్) ట్రాఫిక్ ఉంది. కల్వకుర్తి-కరివెన సెక్షన్‌లో ఎన్‌హెచ్ 167కే రోడ్డు నిర్మాణం పూర్తయితే, ట్రాఫిక్ మరింత పెరిగే అవకాశముంది. తిరుపతి, చెన్నరు నుంచి వచ్చే వాహనాలు, ఇటు ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ ప్రాంతం నుంచి హైదరాబాద్ వచ్చే వాహనాలు ఇదే మార్గంగుండా వచ్చే అవకాశముంది. దీంతో భవిష్యత్తులో ట్రాఫిక్ మరింత పెరగనుంది. ప్రస్తుత ట్రాఫిక్‌తోపాటు భవిష్యత్తులో పెరిగే ట్రాఫిక్‌ను దష్టిలో ఉంచుకొని ౖాదరాబాద్(ఓఆర్‌ఆర్) నుంచి కల్వకుర్తి(ఎన్‌హెచ్ 765) వరకు ఉన్న రెండు లేన్ల రోడ్డును నాలుగు లేన్లుగా అభివద్ధి చేయాలని గత ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదించింది. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయమై ఎన్నికల తర్వాత దృష్టిపెట్టే అవకాశముంది. కేంద్రంతో చర్చించి ఈ రెండు ప్రాజక్టులను పూర్తయ్యేలా చేస్తే, ఇరు రాష్ట్రాల మధ్య రాకపోకలు సాగించే వాహనదారులకు ఎంతగానో ప్రయోజనం చేకూరుతుంది.