ప్రాధాన్యతాంశాల విస్మరణ…

Neglect of priorities...శాసనసభకు మరికొద్ది నెలల్లో ఎన్నికలు నిర్వహించనున్న తరుణంలో… అసెంబ్లీ సమావేశాలకు రెండు రోజుల ముందుగా సోమవారం నిర్వహించిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం పలు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నది. కీలకాంశాలపై తీర్మానాలు చేసి… వాటిని వెంటనే అమలు చేయాలంటూ ఉన్నతాధికారులను, కలెక్టర్లను ఆదేశించింది. ప్రజా రవాణా అయిన ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసుకోవటం, రూ.60 వేల కోట్లతో హైదరాబాద్‌ నగరంలో మెట్రో విస్తరణ, అనాథల సంరక్షణకు ప్రత్యేక విధానం, గతంలో గవర్నర్‌ తిరస్కరించిన బిల్లులను మరోసారి శాసనసభకు పంపి… ఆమోదింపజేయటం తదితరాంశాలు వీటిలో ప్రధానమైనవి. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయటాన్ని కార్మిక సంఘాలు ఆహ్వానించగా… మెట్రో విస్తరణపై భాగ్యనగర వాసులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. అనాథలకు సంబంధించిన నిర్ణయం తీసుకోవటాన్ని మనం కచ్చితంగా అభినందించాల్సిందే.
మంత్రివర్గంలో ఇంతటి కీలక, ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్న సర్కారు… ప్రాధాన్యత, ప్రజలకు అత్యంత అవసరమైన, ప్రధానంగా అట్టడుగు వర్గాలకు చెందిన అంశాలను మాత్రం విస్మరించిందని చెప్పక తప్పదు. దళితులకు మూడెకరాల భూమి, రైతులకు రుణమాఫీ, డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లు, కేజీ టూ పీజీ ఉచిత విద్య, నిరుద్యోగ భృతి, కొత్త రేషన్‌ కార్డుల జారీ తదితరాంశాలు వాటిలో చెప్పుకోదగ్గవి. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి, గులాబీ పార్టీ అధికారంలోకి వచ్చిన తొలి నాళ్ల నుంచి బీఆర్‌ఎస్‌ ప్రతి నిత్యం చెబుతూ వస్తున్న ప్రతిష్టాత్మక పథకాలు, కార్యక్రమాలివి. దళితులకు మూడెకరాల భూ పంపిణీ అనేది వారి ఆర్థిక, సామాజిక స్వావలంబనకు ఆధారమని సాక్షాత్తూ రాష్ట్ర ముఖ్యమంత్రే ఉద్ఘాటించారు. ఊరికి దూరంగా ఉంటూ తరతరాలుగా అణచివేతకు, ఆధిపత్య భావాలానికి, వెట్టి చాకిరీకి గురైన ఎస్సీలను వారి కాళ్ల మీద వారిని నిలబెట్టేందుకే ఈ పథకాన్ని తీసుకొచ్చామని ఆయన ప్రకటించిన విషయం విదితమే. ఇది జరిగి ఏండ్లు గడిచినా పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది తప్ప సర్కారు తన హామీని పూర్తిగా నెరవేర్చలేదు. 2014 పంద్రాగస్టు రోజున ప్రారంభమైన ఈ పథకం కింద ఇప్పటి వరకూ మొత్తం 5,607 మందికి 14,282 ఎకరాలను మాత్రమే పంచారంటే దీనిపై సర్కారుకు ఉన్న చిత్తశుద్ధి ఏపాటితో విదితమవుతున్నది.
అకాల వర్షాలు, వరదలతో అనునిత్యం కడగండ్ల పాలవుతున్న అన్నదాతను.. అప్పులు, రుణాలు ఆత్మహత్యలకు పురిగొలుపుతున్నాయి. ఈ బలవన్మరణాలను నివారించాలంటే రైతుల రుణాలను మాఫీ చేయటమే ఏకైక మార్గమని వ్యవసాయ నిపుణులు, రైతు సంఘాలు పదే పదే చెబుతున్నాయి. కానీ రైతు బంధు, రైతు బీమాతోనే అన్ని సమస్యలూ పరిష్కార మవుతాయనే ధ్యాసలో ఉన్న ప్రభుత్వం… రుణమాఫీపై దృష్టి సారించకపోవటం రైతన్నకు నిజంగా శాపమే. ఇక డబుల్‌ బెడ్‌ రూం ఇండ్ల గురించి అసలు చెప్పనక్కర్లేదు. అనేక జిల్లాలు, మండలాల్లో లక్షలాదిగా దరఖాస్తులు వస్తే… వేలల్లో మాత్రమే ఇండ్లు కట్టించారు. ఆ కట్టించిన వాటిని కూడా లబ్దిదారులకు అందజేయకపోవటంతో కొన్ని చోట్ల అవి శిథిలావస్థకు చేరటం బాధాకరం. మరికొన్ని చోట్ల కట్టించిన ఇండ్లు కూడా ఇప్పటికే పెచ్చులూడుతుండటం, చిన్నపాటి వర్షానికే కురుస్తూ ఉండటం నిర్మాణంలోని లోపాలను ఎత్తి చూపుతున్నాయి.
కేజీ టూ పీజీ కింద ఏర్పాటు చేశామని చెప్పుకుంటున్న గురుకులాల దుస్థితి చెప్పనలవి కాకుండా ఉంది. అద్దె భవనాలు, అరాకొరా వసతులు, కప్పుకోవటానికి దుప్పట్లు, రగ్గులు సైతం లేని పిల్లలు, కాంట్రాక్టు అధ్యాపకులు, సిబ్బంది… వెరసి అవి సమస్యలకు నిలయాలుగా మారాయి. ఇవిగాక నిరుద్యోగ భృతి, కొత్త రేషన్‌ కార్డు అప్లికేషన్ల సంగతినే ప్రభుత్వ పెద్దలు మరిచిపోయిన వైనం కళ్లకు కట్టినట్టు కనబడుతున్నది. కనీసం వివిధ బహిరంగ సభలు, వేదికల మీద కూడా వాటిని సర్కారు వారు ప్రస్తావించకపోవటాన్నిబట్టి ఆయా అంశాల గురించి మనం మరిచిపోతేనే మంచిదనే దుస్థితిలోకి జనాలు నెట్టబడ్డారు.
ఇదంతా ఒక ఎత్తయితే.. ఇప్పుడు రాష్ట్రంలోని గ్రామ పంచాయతీ కార్మికులు, సిబ్బంది తమ సమస్యల పరిష్కారం కోసం ఆందోళనబాట పట్టారు. 26రోజులుగా వారు సమ్మె చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవటం గమనార్హం. వీరితోపాటు ఐకేపీ వీవోఏలు, మధ్యాహ్న భోజన పథకం కార్మికులు, మోడల్‌ స్కూళ్లలోని బోధనేతర సిబ్బంది, యూనివర్సిటీల్లోని సిబ్బంది తదితరులు తమ డిమాండ్ల సాధన కోసం పోరాడుతున్నారు. పంచాయతీ కార్మికుల్లో 95శాతానికి పైగా దళితులే. ఇలాంటి వారి సమస్యల పట్ల, వాటి పరిష్కారం పట్ల మంత్రివర్గంలో నామమాత్రపు చర్చ కూడా జరక్కపోవటం విస్తుగొలిపే అంశం. రానున్న ఎన్నికల్లో ఆయా కార్మికులు, సిబ్బంది ఆశలను నెరవేర్చటం ద్వారానే ప్రజామోదం పొందగలమనే నిజాన్ని పాలకులు ఇప్పటికైనా గుర్తిస్తే మంచిది.