– టీపీసీసీ అధికార ప్రతినిధి మేడిపల్లి సత్యం విమర్శ
నవతెలంగాణ-గంగాధర : రైతాంగానికి అవసరమైన కుడి కాలువ నిర్మాణంపై ప్రభుత్వానికి, పాలకులకు శ్రద్ధ లేకపోగా , ఎమ్మెల్యే రవిశంకర్ కమిషన్లపై దృష్టి సారించారని టీపీసీసీ అధికార ప్రతినిధి మేడిపల్లి సత్యం విమర్శించారు. గంగాధర మండలం మధురానగర్ చౌరస్తాలో అసంపూర్తిగా నిలిచిన కుడి కాలువ నిర్మాణం పనులను కాంగ్రెస్ నాయకులతో కలిసి పరిశీలించారు. 2008లో ఆనాటి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన పల్లె బాట కార్యక్రమంలో భాగంగా దివంగత సీఎం వైయస్ ఎల్లంపల్లి ప్రాజెక్టులో భాగంగా ఎడమ, కుడి కాలువల నిర్మాణం పనులకు శ్రీకారం చుట్టారని అన్నారు. ఎల్లంపల్లి ఎడమ, కుడి కాలువ పనులు 90% కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే పూర్తయ్యాయని, కేవలం 10% పనులను పూర్తి చేయకుండా స్థానిక ఎమ్మెల్యే నిర్లక్ష్యం చేస్తున్నాడని ఆరోపించారు. ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ కు కమిషన్ల పై ఉన్న శ్రద్ధ, కుడి, ఎడమ కాలువల పనులు పూర్తి చేయడంపై లేదన్నారు. అదనపు టీఎంసీ కోసం వేల కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్న ప్రభుత్వం, కుడి ఎడమ కాలువ పనుల పూర్తి కోసం నిధులు ఇవ్వకపోవడం శోచనీయం అన్నారు. చొప్పదండి నియోజక వర్గాన్ని కోనసీమగా మార్చుతానని ప్రగల్బాలు పలుకుతున్న ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, గంగాధర మండలంలోని ఎగువ గ్రామాలు, బోయినపల్లి మండలంలోని గ్రామాలు ఎడారిగా ఎందుకు మారుతున్నాయో వివరించాలని డిమాండ్ చేశారు. వెంటనే నారాయణపూర్ ఎడమ, కుడి కాలువల క్రింద భూములు కోల్పోతున్న రైతులకు నష్టపరిహారం చెల్లించి, పనులను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. నారాయణపూర్ రిజర్వాయర్ కట్ట మరమ్మత్తు కోసం, గంగాధర ఎల్లమ్మ చెరువు కట్ట గండి పూర్చడం కోసం వెంటనే నిధులు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నారాయణపూర్ కుడి ఎడమ కాలువ పనులను పూర్తి చేయకుంటే గంగాధర, బోయినపల్లి మండలాల రైతులతో కలిసి ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గంగాధర , బోయినిపల్లి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పురుమల్ల మనోహర్, వన్నెల రమణారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దుబ్బాసి బుచ్చయ్య, జిల్లా కార్యదర్శి రామిడి రాజిరెడ్డి, మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు కొలిపాక స్వామి , మండల కిసాన్ సెల్ అధ్యక్షులు బూర్గు గంగన్న, నాయకులు వీరేశం, సుద్దాల రాజశేఖర్ రెడ్డి, జాగిరపు శ్రీనివాస్ రెడ్డి, తోట కరుణాకర్, దోర్నాల శ్రీనివాస్ రెడ్డి, చిప్ప చక్రపాణి, రాచమల్ల భాస్కర్, కరీం, పెద్దోల రాజేశం, ముచ్చె శంకరయ్య, పుల్కం నరసయ్య, మల్లేశం, దోమకొండ మహేష్, రమేష్ ,కొల ప్రభాకర్, వినోద్ రెడ్డి, నాగేందర్ రెడ్డి, అంజిరెడ్డి, పోచమల్లు , మహేష్, సాగర్, తదితరులు పాల్గొన్నారు.