విలువల విస్మ’రణం’


ఇక రామాయణంలో పిడకల వేటలాగా రాజదండం కథను
ఒకదానిని తీసుకువచ్చి ప్రారంభోత్సవ కథలో కలిపి వండి వడ్డిస్తున్నారు. చోళరాజుల కాలంలోకీ వెళ్లారు. నిజమే మరి రాచరికపు ఆనవాళ్లనన్నింటినీ తెచ్చి తిరిగి ఆ వ్యవస్థను ప్రతిష్టించటమే వీరికి కావలసింది. వాస్తవంగా స్వాతంత్య్రం వచ్చాక రాజదండాన్ని అప్పటి వైస్త్రారు మౌంట్‌బాటెన్‌ నెహ్రుకు అందించిందే లేదు. కేవలం నెహ్రూకు ఒక బహుమతిగా వచ్చిన ఓ రాచరిక చిహ్నం చుట్టూ కథలల్లి ప్రచారం చేస్తున్నారు.అంటే రాజుల కాలం నాటి సాంస్కృతిక జీవన ఆవరణంలోకి జనాన్ని తీసుకుపోయే ప్రయత్నం చేస్తు న్నారు. అందులోనూ అబద్ధాలను, అసత్యాలను ప్రచారం చేసి.

సాధారణంగా సొంతిల్లు కట్టుకుని గృహప్రవేశ ఉత్సవాన మొదట ఇంట్లోకి అడుగుపెట్టేది ఇంటి పెద్దనే కదా! ఈ మాత్రం తెలియని వారెవరుంటారు! కానీ ఇప్పుడలా ఎందుకు జరగటం లేదు. పార్లమెంటు కొత్త భవనం ప్రారంభోత్సవం పార్లమెంటులో సమున్నత అధిపతిగా ఉన్న రాష్ట్రపతి ప్రమేయం లేకుండానే ఎందుకు జరుగుతోంది. పార్లమెంటు అంటే లోక్‌సభ, రాజ్యసభ, వీటితో పాటు ప్రభుత్వానికి సంబంధించిన ప్రతి నిర్ణయమూ రాష్ట్రపతి పేరుమీదనే జరుగుతాయి. అసలు ప్రధానమంత్రిని, మంత్రులను నియమించేదీ రాష్ట్రపతే. మన రాజ్యాంగం ప్రకారం రాష్ట్రపతి పదవి సర్వోన్నతమైనది. అలాంటి అధిపతిని విస్మరించి, ప్రధాని ప్రారంభించడమనేది ప్రజాస్వామిక విలువలకు తిలోదకాలివ్వటమేనని 19 ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. అంతే కాక అందుకు నిరసనగా ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నాయి. ప్రారంభోత్సవానికి కనీసం ఆహ్వానం కూడా రాష్ట్రపతికి అందించకపోవటం దారుణమైన విషయం. ఇది రాజ్యాంగ స్ఫూర్తికి, విలువలకు భంగకరం. ప్రతిపక్షాలు, ఇతర నిపుణులు అభ్యంతర పెడుతున్నప్పటికీ ఏమాత్రం ఖాతరు చేయకుండా ప్రధానియే ప్రారంభించాలని తీసుకున్న నిర్ణయం అనేక చర్చలకు తావిస్తున్నది. అసలు పార్లమెంటు భవన శంఖుస్థాపన సందర్భంలో కూడా ఒక దళిత రాష్ట్రపతిగా ఉన్న రామ్‌నాథ్‌ కోవింద్‌నూ ఆహ్వానించలేదు. ఇప్పుడు ఆదివాసీ మహిళ రాష్ట్రపతిగా ఉంది. వీరిద్దరినీ దూరం పెట్టటమనేది వారిని అవమానపరిచేదిగా ఉందన్న విమర్శకు బలం చేకూరుస్తున్నది. కేవలం రాజకీయ ప్రయోజనాలు పొందేందుకే దళిత, ఆదివాసీలను రాష్ట్రపతులుగా చేయడం, చేసామని చెప్పుకోవటమే గాని, నిజంగా గౌరవ మర్యాదలు ఇవ్వటంలో వీరికి ఆసక్తిలేదనేది ఈ సంఘటనలు రుజువు చేస్తాయి.
ఇకపోతే ప్రజాస్వామ్యం, రాజ్యాంగ విలువలూ అని ఇతరులు గగ్గోలు పెట్టటమే కాని, అసలు ఏలుతున్న వారికి వాటిపైన అంత శ్వాసము, నమ్మకము లేవన్న విషయాన్ని మనమింకా అర్థం చేసుకోవలసేవుంది. బాహ్యంగా ప్రకటించకపోయినప్పటికీ వారి అంతర్గతమైన అవగాహనలో భారత రాజ్యాంగ విలువల పట్ల తృణీకారమే ఉన్నది. ఒక్కొక్క రాజ్యాంగ విలువను ధ్వంసమొనరుస్తూ వస్తున్న తీరు అందుకు నిదర్శనం. కేంద్రీకృతమైన అధికారాన్ని కలిగివుండాలన్నది వారి కోరిక. ప్రజాస్వామిక భావనే వారికి సరిపడదు. ఇప్పటి వరకు మన రాజ్యాంగం ద్వారా ఏర్పడిన ప్రజాస్వామిక ప్రతీకలను, రూపాలను, సంకేతాలను ఒక్కొక్కటే మార్చుతూ, తమవైన నిర్మాణాలను చేపడుతుండటాన్ని మనం చూస్తాం. అందులో భాగమే పార్లమెంటు నూతన భవనం. దశాబ్దాలుగా చూస్తూవస్తున్న ఇమేజెస్‌నూ మార్చేస్తున్నారు. హీరోలనూ మార్చేస్తున్నారు. చరిత్రనూ మార్చేసి, విలువలనూ మార్చేసి, వారు కోరుకుంటున్న ఒక రాజ్యాన్ని నిర్మించుకోవటానికి చేస్తున్న సన్నాహాలివి. పార్లమెంటును ప్రారంభించడానికి ఈరోజును యెంచుకోవడంలోనూ వారిదైన పథకం సుస్పష్టం. స్వాతంత్య్రోదమం నుండి తప్పుకుని, బ్రిటిష్‌ సామ్రాజ్యవాదులకు క్షమాపణలు చెప్పి, వారి సేవకుడుగా చరిత్రలో నిలిచిన కరుడుకట్టిన హిందూత్వవాది వి.డి. సావర్కర్‌ జయంతి నాడు మన ప్రజాస్వామ్య భవనం ఆవిష్కృతమవ్వడమంటే అది ఏ రకమైన రూపం తీసుకోబోతోంది అనే విషయం తేటపడాలి.
ఇక రామాయణంలో పిడకల వేటలాగా రాజదండం కథను ఒకదానిని తీసుకువచ్చి ప్రారంభోత్సవ కథలో కలిపి వండి వడ్డిస్తున్నారు. చోళరాజుల కాలంలోకీ వెళ్లారు. నిజమే మరి రాచరికపు ఆనవాళ్లనన్నింటినీ తెచ్చి తిరిగి ఆ వ్యవస్థను ప్రతిష్టించటమే వీరికి కావలసింది. వాస్తవంగా స్వాతంత్య్రం వచ్చాక రాజదండాన్ని అప్పటి వైస్త్రారు మౌంట్‌బాటెన్‌ నెహ్రుకు అందించిందే లేదు. కేవలం నెహ్రూకు ఒక బహుమతిగా వచ్చిన ఓ రాచరిక చిహ్నం చుట్టూ కథలల్లి ప్రచారం చేస్తున్నారు. అంటే రాజుల కాలం నాటి సాంస్కృతిక జీవన ఆవరణంలోకి జనాన్ని తీసుకుపోయే ప్రయత్నం చేస్తు న్నారు. అందులోనూ అబద్ధాలను, అసత్యాలను ప్రచారం చేసి.
ఏది ఏమైనా కర్నాటకలో తీవ్రంగా దెబ్బతిన్న తర్వాత, దాని నుండి బయటపడటానికి ఇవన్నీ ఉపకరిస్తున్నాయి. ప్రజలను కూడా మరో చర్చకు పురికొల్పినట్టయింది. అయినా కాని ఈ సమస్య దేశంలోని ప్రతిపక్షాలన్నింటినీ ఐక్యం చేయటానికి తోడ్పడుతోందని పరిశీలకులు భావిస్తున్నారు. ప్రధాని తీసుకుంటున్న నియంతృత్వ చర్యలు, మతతత్వ విధానాలు, ప్రజావ్యతిరేక నిర్ణయాలను ప్రజలు నిరసిస్తున్నారు. ప్రతిపక్షాలూ ఐక్యమవుతున్నాయి. ప్రధాని మోడీ ఇదేరీతిగా విధానాలను కొనసాగిస్తే మరింత ప్రతిఘటన పెరిగే అవకాశం ఉంది. ప్రజాస్వామిక స్ఫూర్తిని, రాజ్యాంగ విలువలను లెక్కచేయకుండా కేవలం భవనాలు నిర్మిస్తే ఏ ప్రయోజనమూ ఉండదు. భవిష్యత్తూ వెలుగొందదు.