పంట కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో నిర్లక్ష్యం తగదు

– సీఎం రేవంత్‌రెడ్డికి మాజీ మంత్రి హరీశ్‌రావు బహిరంగ లేఖ
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
పంట కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు విమర్శించారు. బుధవారం ఈమేరకు ఇదే విషయమై సీఎం రేవంత్‌రెడ్డికి ఆయన బహిరంగ లేఖ రాశారు. ఆహార పంటల బదులు పప్పుధాన్యాలను సాగు చేయడం ద్వారా మెరుగైన లాభాలు సాధించవచ్చన్న రైతుల ఆశలు అడియాశలు చేసేలా వ్యవహరిస్తున్నదని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం క్వింటా పెసరకు మద్దతు ధర రూ. 8,682 నిర్ణయించిందనీ, ఆ ధరకు కొనడం లేదని తెలిపారు. వ్యవసాయ మార్కెట్లు, గ్రామీణ ప్రాంతాల వ్యాపారులకు క్వింటా రూ.6,000 నుంచి రూ.6,500 మధ్యనే రైతులు విక్రయిన్నారనీ, ప్రయివేటు వ్యాపారులు ఆడిందే ఆటగా మారిందని తెలిపారు. దీంతో రైతులు క్వింటాకు రూ.2,500 పైగా నష్టపోతున్నారని పేర్కొన్నారు. గతంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మార్క్‌ఫెడ్‌ ద్వారా కొనుగోలు చేసిందనీ, ఈ ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను కూడా ఏర్పాటు చేయడం లేదని విమర్శించారు. ఖమ్మం, మహబూబాబాద్‌, వికారాబాద్‌, కామారెడ్డి, సంగారెడ్డి, నారాయణపేట, సూర్యపేట తదితర జిల్లాలకు చెందిన రైతులు తీవ్ర ఆవేదన, ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు. పంట మొత్తం అమ్ముకున్నాక కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తే దళారులకు ఉపయోగంగా ఉంటుంది తప్ప అన్నదాతలకు కాదని హెచ్చరించారు. ఇప్పటికే రుణమాఫీ, రైతు బంధును అటకెక్కించిన కాంగ్రెస్‌ ప్రభుత్వం మద్దతు ధరకు అదనంగా రూ.500 బోనస్‌ చెల్లిస్తామన్న మాటను బోగస్‌ చేసిందని విమర్శించారు. కాంగ్రెస్‌ పాలనలో పంటలు పండించడం, పండించిన పంటలను విక్రయించుకోవడం రైతన్నకు కత్తిమీద సాముగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ను నమ్మి ఓటేసినందుకు రైతులను నట్టేట ముంచుతున్నదని తెలిపారు. ఇప్పటికైనా కండ్లు తెరిచి వ్యవసాయ, రైతు వ్యతిరేక విధానాలను వీడాలని కోరారు. మార్క్‌ఫెడ్‌ ద్వారా పెసర కొనుగోలు కేంద్రాలు జిల్లాల్లో తక్షణమే ఏర్పాటు చేసి రైతులు నష్టపోకుండా చూడాలని ఆయన విజ్ఞప్తి చేశారు.