నిర్లక్ష్యం తగదు

నిర్లక్ష్యం తగదుసుందరతీరం అనే మడుగులో చేపలు, కప్పలతోపాటు ఒక తాబేలు నివసించేది. అది చాలా తెలివిగలది. దానికి ప్రకృతి అందాలంటే చాలా ఇష్టం. ఆ తాబేలు పరోపకారి. ఆ చేపలను, కప్పలను తన తెలివితో శత్రువుల బారి నుండి ఎన్నోసార్లు కాపాడింది.
ఒకసారి తాబేలు దూరంగా వున్న కొండ దగ్గరి జలపాతం చూడటానికి తన వెంబడి ఒక కప్పను రమ్మంది. ఆ కప్ప పేరు మండూకం. అది సరేనని తాబేలుతో బయలుదేరింది. అవి కొద్ది దూరం పోగానే వాటికి ఒక పెద్ద పాము కనిపించింది. ఆ కప్ప పామును చూసి గజగజ వణికింది. అప్పుడు తాబేలు కప్పతో ‘ఓ మండూకమా! ఆ పాము వల్ల నీకేం భయం లేదు. నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు. నీవు నా వెంబడి రా!” అంది. ఆ కప్ప భయంగానే తాబేలుతో ఆ పాము ముందర నుండే వెళ్ళింది. కానీ ఆ పాము కప్పను చూసి కూడా దాన్ని ఏమీ అనలేదు. దాంతో కప్ప ఆశ్చర్య పోయింది.
తర్వాత ఆ కప్ప తాబేలుతో ”ఓ తాబేలా! ఆ పాము నీ నేస్తమా! అది నన్ను చూసి కూడా ఏమీ అనలేదు. ఇదేమిటి? నాకు చాలా చిత్రంగా ఉంది” అంది.
అప్పుడు తాబేలు నవ్వి ”అది నా మిత్రుడు కాదు. శత్రువు అంతకన్నా కాదు. అది ఇంతకు ముందే చాలా ఎలుకలను తిన్నది. అది నేను చూశాను. దాని కడుపు ఎలుకలతో నిండిపోయింది. ఇప్పుడు దానికి ఆకలిగా లేదు. అందుకే దాని ముందు నుండే ఒక ఎలుక పరుగెడుతున్నా, పాము ఆ ఎలుకను పట్టుకోవడం లేదు. అర్థమైందా! అది ఇప్పుడు నీ జోలికి రాదు. అందుకే నేను నిన్ను నాతో రమ్మన్నాను” అని అంది. ఆ మాటలను విని కప్ప ఎంతో సంతోషించింది.
ఆ తర్వాత మరొక రోజు కప్ప జలపాతం దగ్గరకు ఆహారం కోసం వెళ్లాలనుకుంది. అది తోడు కోసం తాబేలును పిలిచింది. ఆ సమయంలో తాబేలు నీటి మడుగులో లేదు. ఎక్కడికో వెళ్లింది. దాని కోసం చూసీచూసీ చివరకు ఆ కప్ప ఒంటరిగానే బయలుదేరింది. అప్పుడు కూడా ఆ పాము కప్పకు కనిపించింది. అక్కడ ఒక ఎలుక పాము వద్ద తిరుగుతున్నది. కప్ప ఈసారి కూడా అది ఎలుకలను తిన్నదనుకొని ఊహించి భయం లేకుండా ఆ పాము ముందర నుండి ఇదివరకు వెళ్లినట్లు వెళ్లబోయింది. ఆ పాము కప్పను పట్టుకోవడానికి ముందుకు వచ్చింది. వెంటనే కప్ప భయపడి వెనక్కి తిరిగి పరిగెత్తుకొని వచ్చి అప్పుడే వచ్చిన తాబేలుతో ఈ సంగతి చెప్పింది.
అప్పుడు తాబేలు నవ్వి ”అయ్యో కప్పా! నీవు అలా ఒంటరిగా శత్రువు ముందు నుండి నిర్లక్ష్యంగా వెళ్ళకూడదు” అంది.
వెంటనే కప్ప ”మరి ఇప్పుడు కూడా ఎలుక దాని ముందర తిరిగింది. అందువల్ల నువ్వు గతంలో చెప్పినట్లు ఇప్పుడు కూడా అది ఎలుకలను తిన్నదనుకొన్నాను. కానీ ఇప్పుడు నా ఊహ తప్పయింది. అది నన్ను పట్టుకోవడానికి ముందుకు వచ్చింది. నా లక్కీగా దానికి దొరకకుండా పారిపోయి వచ్చాను. ఇలా ఆ పాము నా వైపే ఎందుకు వచ్చింది” అని ప్రశ్నించింది.
దానికి తాబేలు నవ్వి ”ఏముంది? దానికి ఇప్పుడు ఎలుకలపై మోజు తగ్గి ఆకలితో నిన్ను తినాలని అనుకొంది కావచ్చు. అందుకే అది ఎలుకను ముట్టకుండా నిన్ను చూసి పట్టుకోవడానికి ముందుకు వచ్చింది. ఇంకా నయం! అది నిన్ను పట్టుకోలేదు. అది ముందుకు కదిలిందంటే చాలా జాగ్రత్తగా ఉందన్నమాట. అటువంటి సమయంలో నువ్వు అలా ఒంటరిగా శత్రువు ముందు నుండి నిర్లక్ష్యంగా వెళ్ళకూడదు” అని సలహా ఇచ్చింది. కప్ప అందుకు సరేనంది.
– సంగనభట్ల చిన్న రామకిష్టయ్య, 9908554535